Delhi High Court: పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు.. ఏంటంటే?
Mutual consent divorce : భార్యభర్తల విడాకుల ప్రక్రియపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పువెలువరించింది. భార్యభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులకు తీసుకునేందుకు కోర్టులో మొదటి పిటిషన్ దాఖలు చేసే ముందు ఒక సంవత్సరం విడివిడిగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం (HMA) సెక్షన్ 14(1) ప్రకారం తగిన సందర్భాలలో దీనిని రద్దు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది.

భార్యభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులకు తీసుకునే ముందు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఒక సంవత్సరం పాటు విడివిడిగా జీవించడం అనే చట్టబద్ధమైన అవసరం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అసాధారణ పరిస్థితులలో (ఎక్సెప్షనల్ హార్డ్‌షిప్ లేదా డెప్రావిటీ) కుటుంబ కోర్టు, హైకోర్టు ఈ షరతును రద్దు చేయవచ్చని పేర్కొంది. హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 13B(1) కింద సూచించబడిన షరతు డైరెక్టరీ అని, తప్పనిసరి కాదని న్యాయమూర్తులు నవీన్ చావ్లా , అనుప్ జైరామ్ భంభానీ, రేణు భట్నాగర్‌లతో కూడిన పూర్తి ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఈ చట్టంలోని నిబంధనలకు లోబడి” అనే పదబంధంతో ప్రారంభమయ్యే సెక్షన్ 13B(1)ని HMAలోని సెక్షన్ 14(1) నిబంధనతో సామరస్యంగా చదవాలని ధర్మాసనం అభిప్రాయపడింది. భార్యభర్తల మధ్య తీవ్ర గొడవలు ఉన్న నేపథ్యంలో వాళ్లిద్దరూ విడాకులు కోరుతున్నప్పటికి బలవంతంగా వివాహ బంధంలో ఉంచడం కోర్టు ధర్మం కాదని వెల్లడించింది. అలా కాదు.. వారు ఏడాది పాటు కలిసే ఉండాలని చెప్పడం విడిపోవాలని నిర్ణయించుకున్న వారి ఆత్మగౌరవం,స్వేచ్ఛకు విరుద్ధవుతుందని పేర్కొంది.
ఇదే కాకుండా HMA సెక్షన్ సెక్షన్ 13B(2) కింద రెండవ మోషన్‌ను దాఖలు చేయడానికి ముందు కలిసి ఉండే ఆరు నెలల కూలింగ్-ఆఫ్ పిరియడ్‌ను కూడా మాఫీ చేయవచ్చని పేర్కొంది. అయితే ఇందుకు బలమైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే కోర్టు అటువంటి మినహాయింపులను ఇస్తుందని.. పిటిషనర్‌కు తన భాగస్వామి వల్ల అసాధారణమైన కష్టం, దుర్మార్గం వంటి పరిస్థితులు ఉంటే మాత్రమే కోర్టు వాటిని పరిగణలోకి తీసుకుంటుందని పేర్కోంది.




