UP Elections 2022: ఈ గట్టునుంటారా.. ఆ గట్టునుంటారా..? యూపీ ఎన్నికల్లో ముస్లిం సమాజం ఎటు వైపు..?

SP vs AIMIM: రాజకీయాల్లో.. అందులోనూ ఎన్నికల సమయంలో జరిగే కొన్ని అనూహ్య ఘటనలు మొత్తం పరిణామాలనే మార్చేస్తుంటాయి. గెలుపు వాకిట్లో ఉన్నవారిని బోల్తాకొట్టిస్తాయి.

UP Elections 2022: ఈ గట్టునుంటారా.. ఆ గట్టునుంటారా..? యూపీ ఎన్నికల్లో ముస్లిం సమాజం ఎటు వైపు..?
Akhilesh Yadav, Asaduddin Owaisi
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 05, 2022 | 5:43 PM

UP Assembly Election 2022: రాజకీయాల్లో.. అందులోనూ ఎన్నికల సమయంలో జరిగే కొన్ని అనూహ్య ఘటనలు మొత్తం పరిణామాలనే మార్చేస్తుంటాయి. గెలుపు వాకిట్లో ఉన్నవారిని బోల్తాకొట్టిస్తాయి. అసలు పోటీలోనే లేరనుకున్నవారిని విజేతలుగా నిలబెడుతుంటాయి. యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి ఘటన ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (AIMIM) పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన హత్యాయత్నం ఘటన మరి కొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే చర్చకు తెరలేపింది. యూపీ ఎన్నికలపై రకరకాల అంచనాలు, ఊహాగానాలకు తావిచ్చింది.

ఆవిర్భావం నుంచి నేటి వరకు… హైదరాబాద్ కేంద్రంగా 1958లో ఆవిర్భవించిన ‘ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (AIMIM) అనేక దశాబ్దాల పాటు తన రాజకీయాలను హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం చేసింది. ముస్లిం సమాజానికి రాజకీయ ప్రతినిధిగా, ముస్లింల గొంతు వినిపించే రాజకీయ వేదికగా గుర్తింపు తెచ్చుకున్న మజ్లిస్ పార్టీ, గత దశాబ్దకాలంగా దేశంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2014లో మొదటిసారిగా హైదరాబాద్ వెలుపల మహారాష్ట్రలో రెండు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుని యావద్దేశం దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ తర్వాత 2015లో బిహార్లో, 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి, ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కానీ 2020లో బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 5 సీట్లు గెలుపొంది ఆశ్చర్యపరిచింది. ఈ ఉత్సాహంతో ఆ వెంటనే 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒకసారి ఆశ్చర్యపరుస్తూ.. ఇంకోసారి కనుమరుగవుతూ పడి లేస్తున్న కెరటంలా సాగుతున్న ఎంఐఎం ప్రయాణంలో ఇప్పుడు జరుగుతున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి అగ్నిపరీక్షలా మారాయి. దేశంలో మిగతా ఏ రాష్ట్రంతో పోల్చినా ఎక్కువ సంఖ్యంలో ముస్లిం జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఉనిని చాటుకోవడం ఛాలెంజ్‌గా మారింది.

మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో 100 సీట్లకు ఎంఐఎం పోటీ చేస్తోంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. వీటిలో కనిష్టంగా 20 శాతం నుంచి గరిష్టంగా 65 శాతం వరకు ముస్లిం జనాభా ఉన్న నియోజకవర్గాలున్నాయి. దాదాపు 45 సీట్లలో 50 శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉంది. ఈ పరిస్థితుల్లో ముస్లిం సమాజం నమ్మకాన్ని పొందగల్గితే సులభంగా గెలిచే అవకాశం ఉంది. అందుకే, యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో తమ అభ్యర్థుల గెలుపు కోసం ఓవైసీ నిర్విరామంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మీరట్, కిథౌర్ ప్రాంతాల్లో ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తుండగా, ఛజార్సి టోల్ ప్లాజా వద్ద ఆయనపై కాల్పులు జరిగాయి. 4 రౌండ్ల కాల్పుల నుంచి అదృష్టావశాత్తూ తప్పించుకుని క్షేమంగా ఢిల్లీ చేరుకున్న ఓవైసీ, ఈ దాడి ‘గాడ్సే వారసుల’ పని అని ఆరోపించారు. మోదీ-యోగీ సంయుక్తంగా తనపై దాడికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాల్పులకు తెగబడ్డ ఇద్దరు యూపీ వాసులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తూ జెడ్ కేటగిరీ భద్రతను కల్పించేందుకు సుముఖత వ్యక్తంచేసింది. అయితే 1994 నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా రాజకీయాల్లో ఉన్న తాను ఏనాడూ భద్రత కోరలేదని, తీసుకోలేదని, ఇప్పుడు కూడా అవసరం లేదని అసద్ తేల్చి చెప్పేశారు. మొత్తంగా ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారాన్నే సృష్టిస్తోంది. ఈ ఘటన వెనుక నిజంగా ఎవరున్నారన్నది పోలీసుల విచారణకు వదిలేసినా, ఘటనను రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారు.

Asaduddin Owaisi

Asaduddin Owaisi

మజ్లిస్‌కు దూరంగా ఎస్పీ, బీఎస్పీ నిజానికి ఈ ఎన్నికల్లో సెక్యులర్ రాజకీయ పార్టీలుగా పేరున్న సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీల్లో ఏ ఒక్క పార్టీతోనైనా జట్టుకట్టేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నించారు. అయితే ముస్లిం బుజ్జగింపు రాజకీయాలతో విసుగెత్తిన హిందూ మెజారిటీ సమాజాన్ని సమీకృతం చేస్తూ, వాటిని ఓట్లుగా మలచుకుంటున్న భారతీయ జనతా పార్టీని చూసి ఎస్పీ, బీఎస్పీలు మజ్లిస్ పార్టీని దూరం పెట్టాయి. ఎంఐఎంను కలుపుకుంటే వచ్చే ముస్లిం ఓటుబ్యాంకు ప్రయోజనం కంటే, కోల్పోయే హిందూ ఓటుబ్యాంకు ముప్పే ఎక్కువని ఆ పార్టీలు భావించాయి. మరోవైపు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 సీట్లలో పోటీచేసి, ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఎంఐఎంతో ఇప్పుడు పొత్తు ద్వారా ఒనగూరేది కూడా ఏమీలేదన్న భావన ఆ పార్టీల్లో ఉంది. యూపీలో ముస్లింలను తమ ఓటుబ్యాంకుగా చేసుకున్న సమాజ్‌వాదీ పార్టీ సైతం, ముస్లిం బుజ్జగింపు రాజకీయాలతో జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి పెద్దగా ముస్లింల ఊసెత్తకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితుల్లో మతతత్వ పార్టీగా ముద్రపడ్డ ఎంఐఎంతో పొత్తు ఆలోచననే తమ దరికి రానివ్వలేదు.

అటా.. ఇటా.. ఎటూ తేల్చుకోలేకపోతున్న ముస్లిం యువత.. ఒవైసీపై దాడి ఘటనకు ముందు నాటి పరిస్థితులను గమనిస్తే ముస్లిం ఓటర్లు సందిగ్ధంలో ఉన్నట్టుగా కనిపించింది. ఓవైసీ ప్రచార కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ముస్లిం యువత హాజరయ్యేవారు. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఎస్పీ, బీఎస్పీలు ముస్లింలను ఓటుబ్యాంకుగా వాడుకోవడమే తప్ప వారి కోసం చేసిందేమీ లేదంటూ ఓవైసీ చేస్తున్న ప్రసంగాలు యువతను ఆలోచింపజేస్తున్నాయి. ఇదే సమయంలో ఎంఐఎం కారణంగా బీజేపీకి ఆయాచిత లబ్ది జరుగుతుందనే అభిప్రాయం కూడా చాలా మంది ముస్లింలలో ఉంది. మజ్లిస్ పార్టీ ‘ఓట్ కట్టర్’గా మారి బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చుతోందనే విమర్శలున్నాయి. బిహార్‌లో 5 సీట్లు గెలుచుకున్న ఎంఐఎం, చాలా చోట్ల ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా ఆర్జేడీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఈ క్రమంలోనే బెంగాల్ ముస్లిం సమాజం ఎంఐఎంను ఏమాత్రం ఆదరించకపోగా, ముస్లిం మతపెద్దలు సైతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేయాలంటూ పిలుపునిచ్చింది. ఇప్పుడు యూపీలో బిహార్ పరిస్థితిని పునరావృతం చేయొద్దంటూ సమాజ్‌వాదీ పార్టీతో పాటు ముస్లిం మతపెద్దలు కోరుతున్నారు. దీంతో ముస్లింలు ఏ గట్టునుండాలో అర్థంకాని అయోమయంలో, సందిగ్దావస్థలో ఉన్నారు.

ఘటనతో ఎవరికి లాభం? అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన హత్యాయత్నం ఘటనతో అటు బీజేపీ, ఇటు ఎంఐఎం.. ఇద్దరికీ లాభమే అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఘటన కంటే ముందే ముస్లిం యువత మజ్లిస్ పార్టీవైపు ఎక్కువ ఆకర్షితులవుతున్న పరిస్థితులుండగా, ఘటన అనంతరం ఏర్పడే సానుభూతి వల్ల మరికొన్ని ఓట్లు జత కలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ దాడిని తమ సమాజంపై జరిగిన దాడిగా భావిస్తే మెజారిటీ ముస్లిం సమాజం గంపగుత్తగా అసదుద్దీన్ వెంట నడిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ ఓటుబ్యాంకుగా ఉన్న ముస్లిం సమాజం నుంచి చీలే ప్రతి ఓటూ బీజేపీకి లాభం చేకూర్చుతుంది. ఈ క్రమంలో ఘటన వెనుక ఎవరి హస్తం ఉన్నా సరే.. లాభం మాత్రం ఇద్దరికీ ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట.

Also Read..

UP Assembly Election 2022: యూపీ సీఎం వద్ద గన్స్.. అఫిడవిట్‌లో ప్రకటించిన యోగి ఆదిత్యనాథ్..

UP Elections: రసకందాయంలో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు.. యోగి భవితవ్యం తేల్చేది వారేనా?