UP Elections: రసకందాయంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు.. యోగి భవితవ్యం తేల్చేది వారేనా?
ఉత్తరప్రదేశ్‌లోని బ్రాహ్మణ సామాజికవర్గానికి ఇప్పుడో ధర్మ సందేహం వచ్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఉన్న ధర్మాగ్రహాన్ని ఇతర పార్టీలకు ఓటు వేయడం...
ఉత్తరప్రదేశ్‌లోని బ్రాహ్మణ సామాజికవర్గానికి ఇప్పుడో ధర్మ సందేహం వచ్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath)పై ఉన్న ధర్మాగ్రహాన్ని ఇతర పార్టీలకు ఓటు వేయడం ద్వారా తెలియచేయడమా? లేక యోగీని కాసింత క్షమించేసి ఎప్పట్నుంచో మద్దతు ఇస్తున్న బీజేపీ పక్షంవైపే నిలబడటమా? ఇప్పుడేమిటీ కింకర్తవ్యం? ఎటూ తేల్చుకోలేకపోతున్నారు మెజారిటీ బ్రాహ్మణులు. రాముడు ఎలాగూ తమ వైపు ఉంటాడు.. మరి పరశురాముడి కరుణ కటాక్షాలు ఎవరివైపు ఉంటాయోనన్న బెంగ మాత్రం బీజేపీ(BJP)లో ఉంది. అసలు ఈసారి బ్రాహ్మణ సామాజికవర్గం ఏ పార్టీకి మద్దతు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. బీజేపీ అవతరించినప్పట్నుంచి ఆ పార్టీకే మద్దతు ఇస్తూ వస్తున్న బ్రాహ్మణులు ఇప్పుడు మాత్రం బీజేపీకి ఓటు వేయకూడదని డిసైడయ్యారట. బీజేపీ అంటే అభిమానమున్నా ముఖ్యమంత్రి యోగి కారణంగా అభిమానాన్ని చంపుకుంటున్నారట. బ్రాహ్మణ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారంటూ ఆయనపై బ్రాహ్మణ సామాజికవర్గం మండిపడుతోంది. మొన్నామధ్య గంగానది సాక్షిగా బీజేపీకి ఓటు వేయబోమని ప్రమాణం కూడా చేశారు కొందరు బ్రాహ్మణులు.
ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణుల జనాభా ఇంచుమించు 12 శాతం ఉంది. ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత బ్రాహ్మణుల శాతం కొంచెం తగ్గి ఉంటుందేమో . అయినప్పటికీ రాజ్‌పుత్‌ల కంటే ఎక్కువే! రాజ్‌పుత్‌లు ఎనిమిదిన్నర శాతం వరకు ఉంటారు.. అందుకే యూపీలో ఈ రెండు అగ్రకుల సామాజికవర్గాల మధ్య అనాదిగా ఆధిపత్యపోరు సాగుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజ్‌పుత్ సామాజికవర్గానికి చెందినవారే! ఠాకూర్ల కుటుంబానికి చెందిన యోగి .. తన సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తూ తమను నిర్లక్ష్యం చేశారన్నది బ్రాహ్మణ సామాజికవర్గం ఆరోపణ. ఇప్పుడే కాదు. మొదటి నుంచి యోగి బ్రాహ్మణ సామాజికవర్గానికి వ్యతిరేకి అని యూపీ జనం చెప్పుకుంటుంటారు. ఇందుకు 2002లో జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చెబుతుంటారు. అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పుర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున శివ్ ప్రతాప్ శుక్లా పోటీ చేశారు. ఇది యోగికి నచ్చలేదు. అప్పుడు గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నది యోగీనే! రాజ్‌పుత్‌లు బ్రాహ్మణ అభ్యర్థికి ఓటు వేయరన్న సంగతి యోగికి తెలుసు. యోగీకి బ్రాహ్మణ సామాజికవర్గానికి పడదన్న సంగతి అప్పటి ప్రధాని వాజ్‌పేయికి కూడా తెలుసు. అందుకే యోగిని తన దగ్గరకు పిలుపించుకుని శివ్‌ప్రతాప్ శుక్లా గెలుపు కోసం గట్టిగా కృషి చేయాలని చెప్పి పంపించారు. వాజ్‌పేయి అంతటి పెద్దమనిషి చెప్పినా యోగి వినిపించుకోలేదు. రాధామోహన్ అగర్వాల్ అనే తన మిత్రుడిని హిందూసభ అభ్యర్థిగా బరిలో దింపారు. ఆయనకు మద్దతుగా ఊరువాడా తిరిగారు. అగర్వాల్‌ను గెలిపించుకుని తన పంతం నెరవేర్చుకున్నారు.. అప్పట్నుంచే యోగిపై బ్రాహ్మణ వ్యతిరేకి అన్న ముద్ర బలంగా పడింది. పరశురామ జయంతిని సెలవుల జాబితాలోంచి తీసేయడం కూడా బ్రాహ్మణులకు కోపం తెప్పించింది. యోగి ముఖ్యమంత్రి అయ్యాక బ్రాహ్మణులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టించుకోకపోవడం అటుంచితే బ్రాహ్మణ వ్యతిరే విధానాలను అమలు చేస్తున్నారన అపవాదు కూడా ఆయన మీద ఉంది. యోగి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు.
ఫలితంగా గోరఖ్‌పుర్ లోక్‌సభకు 2018 మార్చిలో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఉపేంద్ర శుక్లా ఓడిపోయారు. యోగి మద్దతు ఇవ్వకపోవడం వల్లే తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఓడిపోయారని బ్రాహ్మణులు మండిపడుతున్నారు. గోరఖ్‌పుర్‌లో బీజేపీ ఓడిపోతుందని కలలో కూడా అనుకోని అధిష్టానం ఇలాగే వదిలేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని గ్రహించింది. అందుకే 2019 సాధారణ ఎన్నికలప్పుడు జాగ్రత్తగా వ్యవహరించింది. గోరఖ్‌పుర్ లోక్‌సభ అభ్యర్థి ఎంపిక బాధ్యతను యోగికే అప్పగించింది. గోరఖ్‌పుర్‌కు చాలా దూరంలో ఉన్న జౌన్‌పుర్ జిల్లాకు చెందిన భోజ్‌పురి నటుడు రవికిషన్ శుక్లాను యోగి ఎంపిక చేశారు. రవికిషన్ కూడా బ్రాహ్మణుడే. కాకపోతే రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాల మధ్య గొడవలతో ఆయనకు ఎలాంటి సంబంధమూ లేదు. అందుకే అటు బ్రాహ్మణుల ఓట్లు, ఇటు రాజ్‌పుత్‌ల ఓట్లు రవికిషన్‌కు పడ్డాయి. ఫలితంగా ఆయన ఘన విజయం సాధించగలిగారు. ఇక్కడితో సమస్య సద్దుమణిగిందనుకున్న బీజేపీ అధినాయకత్వానికి యోగి మళ్లీ షాకిచ్చారు. 2019లో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిలోంచి బ్రాహ్మణుడైన మహేంద్రపాండేను తప్పించి కుర్మీ సామాజికవర్గానికి చెందిన స్వతంత్రదేవ్ సింగ్‌కు ఆ పదవి కట్టబెట్టారు యోగి. తమను యోగి ఉద్దేశపూర్వకంగానే అణచివేస్తున్నారన్న భావన బ్రాహ్మణుల్లో ఏర్పడింది. తమ సామాజికవర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను బూటకపు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారని కొందరు బ్రాహ్మణులు ఆరోపిస్తున్నారు. అదే ఎన్‌కౌంటర్‌లో వికాస్ సన్నిహితుడు అమర్ దుబే కూడా హతమయ్యాడు. పెళ్లి జరిగిన మూడు రోజులకే అమర్ చనిపోవడంతో బంధుమిత్రులు తీవ్ర ఆవేదన చెందారు. అమర్ పోయిన దుఃఖంలో సన్నిహితులు ఉంటే అమర్ భార్య ఖుషీ దుబేను.. ఇంట్లో ఆయుధాలను అక్రమంగా కలిగి ఉన్నారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేయడం ఇంకా మండించింది. ఇప్పటికీ ఆమెకు బెయిల్ దొరకలేదు. బ్రాహ్మణ వర్గానికి చెందిన వివేక్ తివారీ, కమలేశ్ తివారీ హత్య కేసుల్లో దర్యాప్తు వేగంగా జరగడం లేదన్న అభిప్రాయం కూడా బ్రాహ్మణుల్లో ఉంది. ఇవన్నీ బ్రాహ్మణులు బీజేపీకి దూరం కావడానికి దోహదం చేశాయి. ఇలా ఉంటే ఖుషీ దుబే సోదరి నేహా తివారి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కల్యాణ్‌పుర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే నేహాకు టికెట్ ఇచ్చింది.
క్రితం సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అంతటి ఘన విజయం సాధించిందంటే అందుకు ప్రధాన కారణం బ్రాహ్మణ సామాజికవర్గం ఆ పార్టీ వైపు ఉండటమే! ఇప్పుడు యోగీ ప్రభుత్వంపై బ్రాహ్మణుల్లో అసంతృప్తి బాగా పేరుకుపోయింది. ఈసారి బీజేపీకి ఓటు వేయబోమని కొందరు బ్రాహ్మణ ప్రముఖులు బహిరంగంగానే చెబుతున్నారు. బీజేపీపై బ్రాహ్మణుల్లో అసంతృప్తి ఉందని పసిగట్టిన ప్రతిపక్షాలు వారిని దువ్వే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అయితే ఏకంగా 40 బ్రాహ్మణ సంస్థల ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు కూడా! బ్రాహ్మణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. బ్రాహ్మణ వర్గంపై యోగీ ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. 108 అడుగుల పరుశురామ విగ్రహాన్ని ఏర్పాఉట చేస్తామని వాగ్దానం చేశారు. మొత్తం 75 జిల్లాలలోనూ జిల్లాకొకటి చెప్పన పరశురామ విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. సంస్కృతం, ఆస్ట్రాలజీ అధ్యాపకుల పోస్టులలో బ్రాహ్మణులకు 90 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్న అఖిలేశ్ ఈసారి బ్రాహ్మణుల మద్దతు ఎలాగైనా కూడగట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. గోరఖ్‌పూర్‌లో యోగికి బద్ధ శత్రువు హరిశంకర్ తివారీ కుమారుడు వినయ్‌శంకర్ తివారీని చిల్లూపార్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు అఖిలేశ్. అటు బహుజన్‌సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా 2007 ఎన్నికలలాగే దళిత, బ్రాహ్మణ ఓట్లను సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. బ్రాహ్మణ్ ఉత్పాత్ మచాయేగా, హథీ బడ్‌తా జాయేగా అన్న నినాదాన్ని ఎత్తుకున్నారు. తాము అధికారంలోకి వస్తే పరశురాముడి విగ్రహంతో పాటు ఆయన పేరుతో హాస్పిటల్స్ కట్టిస్తామని అంటున్నారు.
బ్రాహ్మణులు దూరమైతే కష్టమేనని తెలుసుకున్న బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు వారిని మళ్లీ దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తోంది. బ్రాహ్మణుల్లో పేరుకుపోయిన అసంతృప్తిని తొలగించేందుకు ఓ కమిటీ వేసింది. నలుగురు సభ్యులున్న ఈ కమిటీకి శివ్ ప్రతాప్ శుక్లా నేతృత్వం వహించిన గమనార్హం. రాజస్తాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, యూపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ వాజ్‌పేయిలను ఈ మధ్యనే బీజేపీ పెద్దలు ఘనంగా సత్కరించారు. తద్వారా బ్రాహ్మణులంటే తమకు గౌరవాభిమానులున్నాయని చెప్పుకునే ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు ఎక్కడా మాజీ ప్రధాని వాజ్‌పేయి బొమ్మలు కనిపించలేదు కానీ.. ఇప్పుడు మాత్రం బీజేపీ ప్రచారంలో వాజ్‌పేయి చిత్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ బ్రాహ్మణుడేనని పదే పదే బీజేపీ చెప్పుకుంటోంది. అలాగే బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి పుట్టిన రోజున ప్రధాని మోదీ స్వయంగా వెళ్లడం బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకోవడానికేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.