Jal shakti ministry: కృష్ణా, గోదావరి బోర్డుల ఏర్పాటు తప్పని పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర జల్‌శక్తి శాఖ
గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు తీవ్ర కసరత్తే జరిగిందని.. అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించామన్న కేంద్రం.
Union Jal Shakti Ministry clarity on River Boards: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను కేంద్రం ఖరారు చేసింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను వేర్వేరుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ గెజిట్లు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల శక్తి అధికారలు స్పందించారు. బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు తీవ్ర కసరత్తే జరిగిందని.. అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించామని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అధికారులు స్పష్టం చేశారు. బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గురువారం రాత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గెజిట్‌పై కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరుగుతుంది. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెక్షన్ 84 ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. అపెక్స్ కౌన్సిల్‌లో కేంద్ర జల్‌శక్తి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారు. 2016లో తొలిసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశమైంది. ఆ సమయంలో కమిటీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. 2020 అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ కమిటీ మరోసారి భేటీ అయింది. 2014 నుంచి బోర్డుల పరిధిపై కసరత్తు చేస్తున్నాం. సీడబ్ల్యూసీతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం తీసుకున్నాం. ఎంతో ఆలోచించిన తర్వాతే ప్రతి పదం, ప్రతి వాక్యం రాశాం. ఏపీ పునర్ విభజన చట్టం మేరకే నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులు తెలిపారు.
నోటిఫికేషన్ ప్రకారం బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలు సమానంగా భరించాల్సి ఉంటుందని కేంద్ర స్పష్టం చేసింది. నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లోగా రూ.200 కోట్లు చొప్పున రెండు రాష్ట్ర ప్రభుత్వాలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బోర్డుల నిర్వహణ, నిధులు, వనరుల కొరత రాకూడదని తెలిపింది. ఆమోదం పొందిన ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలను గెజిట్‌లో పేర్కొన్నామన్నారు. బి-పార్ట్ షెడ్యూల్‌లో ఉన్నంత మాత్రాన ఆమోదం పొందినట్లు భావించవద్దని కేంద్ర జల్ శక్తి క్లారిటీ ఇచ్చింది. నోటిఫికేషన్‌లోని షెడ్యూల్-2 పూర్తిగా బోర్డుల పరిధిలోనే ఉంటుంది. షెడ్యూల్-3లో ఇప్పుడు ఉన్నట్లే రాష్ట్రాల పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.