Budget -2025: క్యాన్సర్ బాధితులకు బడ్జెట్ భరోసా.. ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు..!
భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో క్యాన్సర్ కూడా ఒకటి. సామాజిక ఆర్థిక అసమానతలు సృష్టించడంలోనూ క్యాన్సర్ కీలక పాత్ర పోషిస్తోందన్న వాదన ఉంది. పైగా.. ఏటా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఇస్తున్న భరోసా వాళ్లందరికీ ధైర్యం కలిగించనుంది.

ఇది ప్రజల బడ్జెట్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తరవాత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. నిజంగానే..సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఊరటనిచ్చే నిర్ణయాలు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అందుబాటు ధరలో లేని వాటిని.. మధ్య తరగతి వాళ్లకి అందేలా కీలక ప్రకటనలు చేశారు.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ధరల గురించే. క్యాన్సర్ మహమ్మారి ఎంత మంది ప్రాణాలు తీస్తోందో ఎన్నో రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు భారత్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సర్వికల్ క్యాన్సర్‌ని అరికట్టేందుకు కృషి చేస్తోంది. అయితే.. క్యాన్సర్ వచ్చిందంటే..ట్రీట్‌మెంట్ ఓ నరకం. పైగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది. సామాన్యులకు ఇలాంటి జబ్బులు వస్తే వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. క్యాన్సర్‌కి సంబంధించిన మందుల ధరలూ భారీగానే ఉంటాయి. మొత్తంగా…ఈ జబ్బు ప్రజల్ని శారీరకంగానే కాకుండా.. ఆర్థికంగానూ దెబ్బ తీస్తోంది. అందుకే..కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే ఆ మేరకు వాటి ధరలు తగ్గుతాయి. ఫలితంగా అవి సామాన్యులకు అందుబాటులోకి వచ్చేస్తాయి. అంతే కాదు. క్యాన్సర్ బాధితుల కోసం మరో కీలక ప్రకటన కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 200 క్యాన్సర్ డే కేర్ సెంటర్స్‌ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. పైగా వీటిని జిల్లా హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అంటే..జిల్లా స్థాయిలో సేవలు అందిస్తే చాలా మందికి హెల్ప్ అవుతుందన్నది కేంద్రం ఆలోచన. వీటి ద్వారా బాధితులకు పెద్ద ఎత్తున భరోసా ఇవ్వడంతో పాటు చికిత్స అందించేందుకు ప్రణాళికలు రచించింది.
కేవలం క్యాన్సర్ ఔషధాలపైనే కాదు…మొత్తంగా 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్‌ని బేసిక్ కస్టమ్స్ డ్యూటీ జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మరో 6 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై 5% మేర కస్టమ్స్ డ్యూటీ విధించనుంది. ICMR లెక్కల ప్రకారం…దేశవ్యాప్తంగా సుమారు 7 కోట్ల మంది అరుదైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం లభించాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరి అని భావిస్తోంది కేంద్రం. ఇప్పటికే క్యాన్సర్‌కి సంబంధించిన మూడ రకాల ట్రీట్‌మెంట్‌పై కస్టమ్స్ డ్యూటీని మినహాయించింది. ఇప్పుడు వీటి మందులపైనా పన్నులు తగ్గించి ఊరటనిచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..