కిడ్నాప్ కేసులో ఖైదీని కోర్టు ఆవరణలోనే పెళ్లాడిన ప్రియురాలు.. తిరిగి మళ్లీ జైలుకు
అండర్ ట్రయల్ ఖైదీ న్యాయస్థానం అనుమతితో కోర్టు ఆవరణలో ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న సదరు యువకుడు కోర్టు ఆవరణలోని ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అనంతరం పోలీసులు అతన్ని తిరిగి జైలుకు..
అండర్ ట్రయల్ ఖైదీ న్యాయస్థానం అనుమతితో కోర్టు ఆవరణలో ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న సదరు యువకుడు కోర్టు ఆవరణలోని ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అనంతరం పోలీసులు అతన్ని తిరిగి జైలుకు తరలించారు. ఈ విచిత్ర సంఘటన బిహార్‌లో శనివారం (మే 20) జరిగింది. వివరాల్లోకెళ్తే..
సీతామర్హి జిల్లాలోని బర్గానియా ప్రాంతానికి చెందిన రాజా కుమార్ (28), అదే ప్రాంతానికి చెందిన అర్చన కుమారి (23) 2016 నుంచి ప్రేమించుకుంటున్నారు. గతేడాది నవంబరులో వారిద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో యువతి తండ్రి రాజాపై కిడ్నాప్ కేసు పెట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవంబర్ 6, 2022లో యువకుడిని అరెస్టు చేసి, జైలుకు తరలించారు. అప్పటి నుంచి రాజా జైలులోనే ఉన్నాడు.
తాజాగా ఈ కిడ్నాప్ కేసును కోర్టు విచారించగా.. ఇరుకుటుంబాలు వీరి పెళ్లికి సమ్మతి తెలిపాయి. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పెళ్లి కోసం 4 గంటల పెరోల్‌పై రాజాను విడుదల చేశారు. శనివారం పోలీసుల సమక్షంలో కోర్టు ఆవరణలోనే వారిద్దరికి పెళ్లి జరిపించారు. అనంతరం కేసును జూన్ 19కి వాయిదా వేయడంతో పెళ్లి తర్వాత రాజాను పోలీసులు జైలుకు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.