Aadhar Number: ఆధార్ నంబర్ మార్చడం కుదరదు.. మారిస్తే అనేక చిక్కులు.. కీలక ప్రకటన చేసిన ఉడాయ్
Aadhar Number: ప్రస్తుతం భారత్‌లో అమలు అవుతోన్న ప్రతి సంక్షేమ పథాకానికి ఆధార్ కార్డు తప్పనిసరి. బ్యాంకు ఖాతాలతో పాటు పాన్ కార్డుకు సైతం ఆధార్ నంబరుతో
Aadhar Number: ప్రస్తుతం భారత్‌లో అమలు అవుతోన్న ప్రతి సంక్షేమ పథాకానికి ఆధార్ కార్డు తప్పనిసరి. బ్యాంకు ఖాతాలతో పాటు పాన్ కార్డుకు సైతం ఆధార్ నంబరుతో లింక్ ఉంటుంది. ఆధార్ కార్డులో మనం అందించిన వేలి ముద్రల ఆధారంగా మన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ పథకాలతో పాటు ప్రైవేటు, చిన్నచిన్న పనులకు కూడా ఆధార్ కార్డు లేనిది కుదరదు. ప్రతి పని జరగాలంటే ఆధార్‌తో ముడిపడి ఉంటుంది. మరి అలాంటి ఆధార్ కార్డు నంబర్ మార్చడం సాధ్యమేనా? ఆధార్ సంఖ్య మార్పుపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) ఢిల్లీ హైకోర్టులో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తులకు కేటాయించిన ఆధార్ నంబర్‌ను మార్చివేసి మరో నంబర్‌ను కేటాయించడం సాధ్యం కాదని భారత ఆధార్ సంస్థ ఉడాయ్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇలాంటి మార్చేందుకు అనుమతి ఇస్తే వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు మాదిరిగానే తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రతి ఒక్కరి నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తుతాయని తెలిపింది.
ఓ వ్యాపారి తనకు కేటాయించిన ఆధార్ సంఖ్యను మార్చాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆధార్ గుర్తు తెలియని విదేశీ సంస్థలకు అనుసంధానమై ఇబ్బందులు కలుగుతున్నాయని తన పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ రేఖా పల్లి విచారణ చేపట్టారు. ఉడాయ్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రతి ఆధార్ కార్డుదారు అందించిన సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందని తెలిపారు. పిటిషనర్ తన ప్రస్తుత ఆధార్ నంబర్ మరింత భద్రంగా ఉండేందుకు.. నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. దీని కోసం పిటిషనర్ తన మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ వివరాలను అప్‌డేట్ చేయాలని సూచించారు. ఒక వ్యక్తికి కేటాయించిన ఆధార్ సంఖ్యను మార్చి మరో సంఖ్యను ఇవ్వడం అసాధ్యమని స్పష్టం చేసింది.
నంబర్ మారిస్తే అనేక చిక్కులు..
ఇప్పుడు ఆధార్ కార్డు నంబర్ మారిస్తే.. అనేక చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని కోర్టుకు నివేదించారు. ఒకరి నంబర్ మారిస్తే.. ఇతరులు కూడా ఇలాంటివే అడిగే అవకాశం ఉందని ఉడాయ్ అభిప్రాయపడ్డారు.