Onion Prices Rise: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ ఘాటెక్కనున్న ఉల్లి ధర..!
Onion Prices Rise: గతంలో దేశ వ్యాప్తంగా ఉల్లి కొయకుండానే అందరిని కన్నీళ్లు పెట్టించింది. ఆ సమయంలో సామాన్య ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకు..
Onion Prices Rise: గతంలో దేశ వ్యాప్తంగా ఉల్లి కొయకుండానే అందరిని కన్నీళ్లు పెట్టించింది. ఆ సమయంలో సామాన్య ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకు కారణం ధరలు పెరగడమే. కొన్ని రోజులు కిలో దాదాపు రూ.200 వరకు చేరిన ఉల్లిపాయలు.. ప్రస్తుతం ధర పూర్తిగా అదుపులో ఉంది. ఇప్పుడు కిలో రూ.20 నుంచి 30 వరకు పలుకుతోంది. అయితే రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ క్రిసిల్ హెచ్చరిస్తోంది. రాబోయే రోజుల్లో ధరలు రెట్టింపు కావడం ఖాయమంటోంది.
నెలకు 13 లక్షల టన్నులు:
భారత్‌లో ప్రతి నెల సుమారు 13 లక్షల టన్నుల ఉల్లిపాయల వినియోగం జరుగుతోంది. ఇందులో సగానికి పైగా పంట మహారాష్ట్ర నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది. ఇక మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగానే పండిస్తున్నారు రైతులు. తౌటౌ తుఫాను ఎఫెక్ట్‌తో మహారాష్ట్ర, కర్ణాటకలలో ఉల్లి సాగు చేయడంలో ఆలస్యమైంది. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఉల్లి పంట చేతికందడం ఆలస్యం అవుతోందని క్రిసిల్ చెబుతోంది.
ఉల్లి మార్కెట్లో రావడానికి ఆలస్యం..
దేశంలో ఉల్లి పండించే ప్రాంతాల్లో 75 శాతం పంట ఖరీఫ్ సీజన్ నుంచే వస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించిన ఉల్లి పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టవచ్చని క్రిసిల్ వెల్లడిస్తోంది. పంట చేతికి వచ్చి, ప్రాసెసింగ్, సరఫరా తదితర కారణాల వల్ల ఉల్లి మార్కెట్లో రావడానికి చాలా సమయం కావచ్చని చెబుతోంది. గత మూడేళ్లుగా ఉల్లి ఉత్పత్తి, సరఫరా, మార్కెట్ తదితర విషయాలను పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతోంది.
రబీ పైనా ప్రభావం:
ఖరీఫ్ సీజన్ పంట చేతికి రావడంలో ఆలస్యమైనా రబీలో వచ్చిన ఉత్పత్తి బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉంటుంది. ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఉల్లి త్వరగా పాడవుతుంది. ఇందుకు తోడు బఫర్‌స్టాక్ సైతం తగ్గిపోయే అవకాశం ఉందని క్రిసిల్ చెబుతోంది. ఉల్లిని అత్యధికంగా పండించే మహారాష్ట్రలో విస్తరంగా వర్షాలు కురిసినా ఉల్లిపంట పండించే నాసిక్‌లో గత మూడు సంవత్సరాలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉల్లి పండించే రైతులు కూడా నర్సరీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉల్లి దిగుబడి సైతం తగ్గిపోనుందని క్రిసిల్ అంచనా వేసింది. ఏదేమైనా వచ్చే దసరా సీజన్ నాటికి ఉల్లి ధర పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ సంస్థ చెబుతోంది.