భారత్‌కు ముప్పుగా మారిన త్రీ బ్రదర్స్! ఆ దేశాలు ఏంటి? ఎలాంటి ముప్పు పొంచి ఉంది?
పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్ దేశాల మధ్య ఏర్పడిన "త్రీ బ్రదర్స్ అలయన్స్" భారతదేశానికి కొత్త భద్రతా ముప్పును కలిగిస్తోంది. ఈ కూటమి రాజకీయ, ఆర్థిక, సైనికంగా బలపడుతూ కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తోంది. అయితే ఈ ముమ్మును ఎదుర్కొనేందుకు భారత్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇరాన్, ఆర్మేనియాతో సంబంధాలను బలోపేతం చేస్తూ ఈ ముప్పును అధిగమించేందుకు భారత్ పావులు కదుపుతోంది.

భారతదేశం ఒక కొత్త ప్రమాదకరమైన ముప్పును ఎదుర్కొంటోంది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సరికొత్త ముప్పు బహిర్గతమైంది. ఆ ముప్పు పేరే “త్రీ బ్రదర్స్ అలయన్స్”. దేశ విభజన సమయం నుంచి శత్రు వైఖరితో ఉన్న పాకిస్తాన్ అందులో ఒకటి. పాక్ వైఖరి తెలుసు కాబట్టి ఆ దేశం నుంచి ఎదురయ్యే ముప్పు గురించి కూడా స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఇప్పుడు త్రీ బ్రదర్స్ కూటమిలో పాకిస్తాన్‌కు అండదండలు అందిస్తున్న సోదర దేశాలు టర్కీ, అజర్‌బైజాన్‌తో కొత్త ముప్పు ముంచుకొచ్చింది. అందులో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి NATOలో సభ్యదేశంగా ఉన్న టర్కీ వైఖరే యావద్దేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ప్రజలు స్వచ్ఛందంగా ఆ దేశంతో సంబంధాలు తెంచుకుంటుండగా.. భారత ప్రభుత్వం ఆచితూచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్‌లు కలిసి భారతదేశాన్ని సవాలు చేయడానికి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి గత నాలుగేళ్లుగా రాజకీయ, ఆర్థిక మరియు సైనిక సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తోంది.
త్రీ బ్రదర్స్ అలయన్స్ ఏర్పాటు – దాని లక్ష్యాలు
2021లో అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశంలో పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్ అధినేతలు కలిసి తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలోనే “త్రీ బ్రదర్స్ అలయన్స్” పేరుతో ఒక అనధికారిక కూటమి ఏర్పడింది. ఈ మూడు దేశాల మధ్య చారిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు టర్కిక్ (తురుష్కులు) వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇక ఈ మూడు దేశాలను కలిపే కీలకమైన అంశం మతం. ఈ మూడూ మెజారిటీ ఇస్లామిక్ దేశాలు.
టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ ఈ కూటమి వెనుక ప్రధాన శక్తిగా ఉన్నారు. టర్కీ ప్రభావాన్ని విస్తరించడానికి, ఎర్డోగాన్ తన దేశంతో సన్నిహిత సంబంధాలు కలిగిన దేశాలతో సహకారాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కూటమి మూడు దేశాలకు పరస్పర ప్రయోజనాలను అందించింది. ఉదాహరణకు, 2020 నాగోర్నో-కరబాఖ్ సంఘర్షణలో అజర్‌బైజాన్ దేశానికి టర్కీ సైనిక మద్దతు అందించింది. ఫలితంగా ఆర్మేనియాపై అజర్‌బైజాన్ విజయం సాధించడంలో సహాయపడింది. అదేవిధంగా, 1950ల నుండి పాకిస్తాన్ టర్కీతో సన్నిహిత రక్షణ సంబంధాలను కలిగి ఉంది. దీని ద్వారా క్రూయిజ్ మిస్సైల్స్, డ్రోన్లు, ఇతర ముఖ్యమైన సైనిక సాంకేతికతను పొందింది.
సైనిక సహకారం, కాశ్మీర్ సమస్యపై మద్దతు
2021లో ఈ మూడు దేశాలు “త్రీ బ్రదర్స్” సైనిక విన్యాసాన్ని ప్రారంభించాయి. సైనిక సమన్వయాన్ని మెరుగుపరచుకున్నాయి. ఈ కూటమి దేశాలు ఒకరి ప్రాదేశిక వివాదాలలో మరొకరికి మద్దతు ఇస్తాయి. అంటే.. కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ విధానానికి టర్కీ, అజర్‌బైజాన్ మద్దతు ఇస్తాయని దానర్థం. టర్కీ ఐక్య రాజ్య సమితి (UN) వంటి వేదికలపై కాశ్మీర్ సమస్యను పదేపదే లేవనెత్తింది. ఇది భారతదేశాన్ని తీవ్రంగా కలవరపరిచింది. పహల్‌గాం ఉగ్రదాడి తర్వాత భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో అజర్‌బైజాన్, టర్కీ రాజకీయంగా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చాయి. భారతదేశంపై దాడుల్లో టర్కీ అందజేసిన డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించింది. ఇది ఈ కూటమి యొక్క సైనిక సహకార తీవ్రతను సూచిస్తుంది.
ఈ కూటమి ఎందుకు ఆందోళన కలిగిస్తుంది?
ఒబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF)కు చెందిన కబీర్ తనేజా మాట్లాడుతూ “ఈ కూటమి చాలా కాలంగా ఉంది. ఇది భారతదేశానికి భౌగోళిక రాజకీయ సమస్యగా మారింది. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఇది భారతదేశానికి పెద్ద సమస్య అని నేను అనుకోను” అని అన్నారు. అయితే టర్కీ, అజర్‌బైజాన్ రెండూ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం లేదని ఆయన సూచించారు. అయినప్పటికీ భారతదేశం ఈ కూటమికి రాజకీయంగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని తనేజా వాదించారు.
భారత్ ప్రతిస్పందన: ఇరాన్, ఆర్మేనియాతో సంబంధాలు
ఈ కూటమి విసిరే సవాలును ఎదుర్కోవడానికి భారతదేశం ఇరాన్, ఆర్మేనియాతో సన్నిహితంగా వ్యవహరిస్తోంది. ఆర్మేనియా, అజర్‌బైజాన్‌తో దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు కలిగి ఉంది. ఇరాన్ కూడా అజర్‌బైజాన్‌తో ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఇరాన్‌లో నివసిస్తున్న లక్షలాది అజారీలు అజర్‌బైజాన్‌తో సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ దేశం ఈ సంబంధాలను ఉపయోగించి విభజన ఉద్యమాలను ప్రోత్సహించవచ్చని ఇరాన్ భయపడుతోంది. భారతదేశం ఆర్మేనియాకు వెపన్ లొకేటింగ్ రాడార్లు, ఆర్టిలరీ సిస్టమ్స్, రాకెట్ లాంచర్లను విక్రయించింది. దీని ద్వారా ఆర్మేనియా సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసింది. గత సంవత్సరం ఆస్ట్రా మిస్సైల్స్ కొనుగోలు ఆర్మేనియా Su30 ఫైటర్ జెట్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి చర్చలు జరిగాయి. ఈ చర్యలు అజర్‌బైజాన్‌ను కలవరపరిచాయి.
అదేవిధంగా భారతదేశం టర్కీతో ప్రాదేశిక వివాదంలో ఉన్న సైప్రస్‌తో సంబంధాలను బలోపేతం చేసింది. భారతదేశం సైప్రస్‌కు రాజకీయ మద్దతు ఇచ్చింది. సైప్రస్ భారతదేశ రాజకీయ ప్రాధాన్యతలకు మద్దతు ఇచ్చింది. ఈ విధానం టర్కీని అసహనానికి గురిచేసింది.
ఇటీవలి ఉద్రిక్తతలు – భారత్ చర్యలు
టర్కీ, అజర్‌బైజాన్ రెండూ పాకిస్తాన్‌కు రాజకీయ మద్దతు ఇవ్వడంతో భారతదేశం ఈ రెండు దేశాలతో సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) ఒక టర్కీ విశ్వవిద్యాలయంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే.. భారతీయ పర్యాటకులు టర్కీ, అజర్‌బైజాన్‌లను బహిష్కరించాలని సామాజిక మాధ్యమాల్లో పిలుపునివ్వడమే కాదు, ఆ దేశాలకు వెళ్లేందుకు చేసుకున్న టూర్ ప్యాకేజీలను రద్దు చేసుకున్నాయి.
త్రీ బ్రదర్స్ అలయన్స్ సవాలును ఎదుర్కోవడానికి భారతదేశం గ్రీస్, సైప్రస్, ఆర్మేనియా, ఇరాన్ వంటి దేశాలతో సన్నిహితంగా వ్యవహరిస్తూ.. సహకారాన్ని కొనసాగించే అవకాశం ఉంది. టర్కీ, అజర్‌బైజాన్‌తో భారతదేశ సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్నాయి కానీ పూర్తిగా శత్రుత్వంగా మారలేదు. కాలం గడిచేకొద్దీ మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కూటమి భారతదేశానికి సవాలుగా ఉన్నప్పటికీ, దాని ప్రభావాన్ని తగ్గించడానికి భారతదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
