Asaduddin Owaisi: థర్డ్‌ ఫ్రంట్‌‌కు కేసీఆర్‌ నాయకత్వం వహిస్తే బాగుంటుంది.. బీజేపీ, కాంగ్రెస్‌పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఫైర్..

Asaduddin Owaisi On Congress, BJP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ దూకుడు పెంచారు. బీజేపీ, కాంగ్రెస్‌పై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో బీజేపీ బండి పంక్చర్‌ అయిందని, ఉన్న గాలిని కూడా ప్రజలు తీసేశారని అసదుద్దీన్‌ పేర్కొన్నారు. దేశంలో థర్డ్‌ ఫ్రంట్‌ వచ్చేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయని

Asaduddin Owaisi: థర్డ్‌ ఫ్రంట్‌‌కు కేసీఆర్‌ నాయకత్వం వహిస్తే బాగుంటుంది.. బీజేపీ, కాంగ్రెస్‌పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఫైర్..
Asaduddin Owaisi - CM KCR
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 19, 2023 | 1:55 PM

Asaduddin Owaisi On Congress, BJP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ దూకుడు పెంచారు. బీజేపీ, కాంగ్రెస్‌పై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో బీజేపీ బండి పంక్చర్‌ అయిందని, ఉన్న గాలిని కూడా ప్రజలు తీసేశారని అసదుద్దీన్‌ పేర్కొన్నారు. దేశంలో థర్డ్‌ ఫ్రంట్‌ వచ్చేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయని, ఈ ఫ్రంట్‌కు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాయకత్వం వహిస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. కేసీఆర్‌, మాయవతి ఏ కూటమిలో లేరని, ప్రాంతీయంగా గట్టి పట్టు ఉన్న పార్టీలు రెండు కూటముల్లో లేవని చెప్పారు. ఓబీసీలు, దళితులకు రిజర్వేషన్లను పెంచాలంటున్న కాంగ్రెస్‌.. మరి ముస్లింల అంశంలో ఏం చెబుతుందని ఓవైసీ సూటిగా ప్రశ్నించారు. అటు మహారాష్ట్రలోనూ ముస్లిం రిజర్వేషన్ల విషయం ఎందుకు మాట్లాడరంటూ నిలదీశారు. తెలంగాణలో ముస్లింలు సేఫ్‌గా ఉన్నారని, కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలు మరీ దారుణంగా ఉండేవని, ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయిందని అసదుద్దీన్‌ విమర్శించారు.

ఇక తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని, ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందంటూ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలాంటి దాడులు జరగవంటూ ఒవైసీ అన్నారు. తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేకుండా కేసీఆర్‌ మంచిపాలన అందిస్తున్నారని చెప్పారు. ఇక తాము దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, బీజేపీ నేతలు తమ ప్రాంతంలో పోటీ చేస్తామంటున్నారు.. రండి తాడోపేడో తేల్చుకుందామంటూ ఓవైసీ సవాల్‌ విసిరారు. అయితే, ఎంఐఎం అధినేత టికెట్లపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో ఎంఐఎం సిట్టింగ్‌లకు టికెట్‌ కేటాయిస్తామో..? లేదో..? చెప్పలేమంటూ బాంబు పేల్చారు. మరోవైపు ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌లను చిత్తుగా ఓడించాలని ఓవైసీ పిలుపునిచ్చారు. జమ్ముకశ్మీర్‌లో భారతీయులపై పాకిస్తాన్‌ తీవ్రవాదులు దాడులు చేస్తుంటే అహ్మదాబాద్‌లో ఇండియా, పాక్‌ మ్యాచ్‌ నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన అన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో ఎంఐఎం పాత్ర విలక్షణమైనదంటూ అసదుద్దీన్ పేర్కొన్నారు. అయితే, మజ్లీస్ పార్టీ గెలిచే సీట్లతో మాత్రం బలమైన వారిని బరిలో ఉంచి.. మిగతా చోట్ల నామమాత్రంగా అభ్యర్థులను పోటీకి దింపుతోంది. ప్రస్తుతం ఎఐఎంకి ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. గత ఎన్నికల్లో అందరు సిట్టింగ్‌లకు చోటు లభించినా.. ఈ సారి మాత్రం ఎక్కువ మందికి టికెట్లు రావని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అసదుద్దీన్‌ తాజా వ్యాఖ్యలు కూడా అదే నిజమని చెబుతుంటడంతో సిట్టింగుల్లో గుబులు మొదలైంది.

ఎప్పుడూ బిజీగా ఉండే అసదుద్దీన్.. ఇటీవల బైక్ రైడింగ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. హైదరాబాద్ నగరంలో బైక్ లపై తిరుగుతూ.. ఆకట్టుకుంటున్నారు. తాజాగా.. కుమారుడు సలావుద్దీన్ తో కలిసి బైక్ రైడింగ్ నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..