Lalu Prasad Yadav: తగ్గేదే లే అంటే కుదరదు.. తప్పు చేస్తే చిప్ప కూడే.. లాలూ నుంచి చౌతాలా వరకు..
సమన్యాయం భారత రాజ్యాంగం విశిష్టత. రైట్ టు ఈక్వాలిటీ భారతీయులందరి ప్రాథమిక హక్కు. చట్టం ముందు అందరూ సమానమే.. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) నుంచి ఓం ప్రకాష్ చౌతాలా వరకూ ఎవరైనా నేరం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే..

సమన్యాయం భారత రాజ్యాంగం విశిష్టత. రైట్ టు ఈక్వాలిటీ భారతీయులందరి ప్రాథమిక హక్కు. చట్టం ముందు అందరూ సమానమే.. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) నుంచి ఓం ప్రకాష్ చౌతాలా వరకూ ఎవరైనా నేరం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.. చట్టానికి రాజూ పేదా భేదం లేదు. తప్పెవ్వరిదైనా నిగ్గుతేల్చేస్తుంది న్యాయం. పశువుల మేత మనుషులే మేసినా, రైతన్నల్ని తొక్కించేసినా నేరం రుజువైతే ఇక అంతే…. అంతా ఊచల్లెక్కించాల్సిందే… పశు దాణా కుంభకోణం కేసులో ఐదో నేరంలోనూ లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా సీబీఐ స్పెషల్ కోర్టు తేల్చడం తెలిసిందే. ఇక శిక్షే తరువాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. స్వాతంత్య్రానంతరం అంబేద్కర్ సారథ్యంలో దేశం స్వయంగా రాసుకుని, అమలు చేస్తోన్న కానిస్టిట్యూషన్ ఎదుట సర్వమానవాళీ సమానమేనని మరోమారు రుజువు చేసింది పాతికేళ్ల క్రితంనాటి లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కుంభకోణం దాణా కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు తాజా తీర్పు. భారత దేశంలోని ప్రతి వ్యక్తికీ ఈక్వాలిటీ బిఫోర్ లా అనే అత్యున్నత న్యాయం అండి తీరాల్సిందేనని భారత రాజ్యాంగం నొక్కి చెపుతోంది. దానర్థం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డా చట్టం ఎదుట సమానమే.
నేరం చేస్తే శిక్ష తథ్యం.. పేద, ధనిక, సామాన్యుడు, అపర కుబేరుడూ తేడాలకు తావేలేదు. చట్టం ముందు అంతా ఒక్కటే. చట్టం ఎదుట అందరూ సమానమే. మతపరమైన, ప్రాంతీయపరమైన, లింగ పరమైన భేదాల్లేవని భారత సర్వోన్నత రాజ్యాంగం నిర్వచిస్తుంది. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంలో రాజూ, మంత్రీ, పేద, ధనిక తేడా లేకుండా అందరికీ సర్వసమానంగా సమన్యాయం దక్కాలి. ఈ సర్వసత్తాక గణతంత్ర రాజ్యంలో నేరం చేస్తే శిక్ష తప్పదు అన్నది రాజ్యాంగం సాక్షిగా మరోమారు రుజువైంది. ఎంతటి ఘనాపాటి అయినా, ఎంతటి ప్రముఖుడైనా, రాజకీయాల్లో కాకలు తీరన యోధుడైనా భారతీయ శిక్షాస్మృతి పరిధిలోకి రాకతప్పదు. నేరం చేస్తే శిక్షను అనుభవించక తప్పదు.
కాకపోతే కాస్త అటూ ఇటూ… కానీ నేరస్తుడికి శిక్ష మాత్రం ఖాయం. ఒకటి రెండేళ్ళు కాలయాపనా జరగొచ్చు. ఇంకా చెప్పాలంటే పాతికేళ్ళు కూడా పట్టొచ్చు. కానీ శిక్షనుంచి తప్పించుకోగలననుకోవడం అవివేకమే అవుతుందన్నది సుస్పష్టమైన అంశం. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే లాలూ ప్రసాద్ యాదవ్. బీహార్‌ని అప్రతిహతంగా పరిపాలించి, సుదీర్ఘకాలం బీహార్‌ని కనుసంజ్ఞలతో ఆదేశించిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ నేరానికి పాతికేళ్ళ తరువాత కూడా శిక్ష తప్పలేదు. ఒక్క లాలూయే కాదు. ఎవ్వరైనా అంతిమంగా భారత దేశన్యాయవ్యవస్థను గౌరవించి తీరాల్సిందే. భారత రాజ్యాంగాన్ని అనుసరించి తీరాల్సిందేనని ఈ తీర్పు తేటతెల్లం చేసింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.139.35 కోట్ల ప్రజాధనాన్ని మింగేసిన పోడ్డర్ స్కాం అవినీతి కుంభకోణంలోని ఐదోకేసులో కూడా సీబీఐ స్పెషల్ కోర్టు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ని దోషిగా తేల్చింది. ప్రజాక్షేత్రంలో నిలబడి, ప్రజాధనాన్నే దోచుకునే వాళ్ళెవరికైనా లాలూపై తాజా తీర్పు సరియైన గుణపాఠంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ప్రజాపాలన ముసుగులో అవినీతికి పాల్పడే వారు అధికారం ఉంది కదా అని ఎలాగోలా తప్పించుకోగలమనుకుంటే పప్పులో కాలసినట్టేనని లాలూ కేసు తేల్చి చెప్పింది.
లాలూ కేసులో ఏం జరిగింది..?
ఇంతకీ లాలూజీని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన బీహార్ దాణా కుంభకోణం కేసు ఏంటి? ఎప్పుడు మొదలైంది? దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లాలూ ఫాడ్డర్ కేసు పూర్వపరాలేమిటి?
లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలో ఉండగా, 1990-1995 మధ్య కాలంలో పశువుల దాణా కోసం కేటాయించిన రూ.139 కోట్లను డొరాండా ట్రెజరీ నుంచి అక్రమంగా డ్రాచేసినట్టు సీబీఐ స్పెషల్ కోర్టు తేల్చి చెప్పింది. దాణా కుంభకోణం కేసుగా ప్రాచుర్యంపొందిన ఈ నేరంలో మొత్తం ఐదు కేసులకు గాను గతంలో నాలుగు కేసుల్లో లాలూని సీబీఐ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. 25 ఏళ్ల తర్వాత సీబీఐ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అయితే ఈ దాణా కుంభకోణంలో ఏకంగా రూ.950 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
గతంలో ఉన్న నాలుగు కేసులతో సహా మొత్తం ఐదు కేసుల్లో రూ.950 కోట్ల దాణా కుంభకోణానికి సంబంధించినదీ కేసు. అందులో మొదటిది రూ.37.7 కోట్ల వ్యవహారం కాగా, రెండవది ఛైబాసా ట్రెజరీ నుంచి రూ.33.13 కోట్ల రూపాయలను అక్రమంగా డ్రాచేసిన కేసు.. ఇక మూడవ కేసు రూ.89.27 కోట్ల రూపాయల డియోఘర్ ట్రెజరీ కేసు. ఆ తర్వాత చిట్టచివరిది దమ్‌కా ట్రెజరీ నుంచి రూ.3.6 కోట్ల రూపాయలను అక్రమంగా డ్రా చేసిన ఈ వ్యవహారం. పాతికేళ్ల అనంతరం ఈ చివరి కేసులో సైతం లాలూ ప్రసాద్ యాదవ్ ని కోర్టు దోషిగా తేల్చింది.
గతంలో దుమ్కా ట్రెజరీ అక్రమ విత్‌డ్రాయల్ కేసులో ఐదేళ్ళు, డియోఘర్ ట్రెజరీ కేసులో నాలుగేళ్ళు జైలు శిక్ష పడింది లాలూయాదవ్‌కి. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 14 ఏళ్ళు జైలు శిక్ష విధించారు లాలూ ప్రసాద్‌కి. యిందులో 3.5 యేళ్ల శిక్షాకాలాన్ని లాలూ జైల్లో పూర్తి చేసుకున్నారు. తాజాగా ఐదో కేసులో సైతం లాలూని దోషిగా తేల్చుతూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. దాణా కుంభకోణంలో ఇదే అతిపెద్ద కేసు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 575 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించారు. ఈ కేసులో ఆగస్టు7, 2021న వాదనలు పూర్తయ్యాయి. లాలూతో సహా మరో 98 మంది నిందితులు రాంచీ సీబీఐ స్పెషల్ కోర్టుకి హాజరయ్యారు. లాలూ ప్రసాద్‌కి కోర్టు ఎటువంటి శిక్ష విధిస్తుంది అనేది ఫిబ్రవరి 21న ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.
చరిత్ర పుటల్లో పలువురి పేర్లు..
కేవలం లాలూ విషయంలోనే కాదు దేశవ్యాప్తంగా అనేక మంది హేమాహేమీలకు, తలలు పండిన రాజకీయ నేతలకూ న్యాయక్షేత్రంలో చుక్కెదురయ్యింది. ఒకరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ, లేదా ప్రజా ప్రతినిధులుగా అత్యున్నత బాధ్యతల్లో ఉంటూ అవినీతి మురికిలో నిండా మునిగిన ప్రముఖుల చరిత్ర ఎల్లప్పుడూ నల్ల సిరాతో రాసే ఉంటుంది. అది అంత త్వరగా చెరిగిపోదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
అలాంటి కోవలోకే వస్తారు హర్యాణా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్‌ఎల్‌డి) అధినేత ఓం ప్రకాష్ చౌతాలా. జూనియర్ బేసిక్ టీచర్ ట్రైనింగ్ రిక్రూట్‌మెంట్ స్కాంలో దోషిగా నిలిచిన ఓంప్రకాష్ చౌతాలాకి 2013లో కోర్టు 10 ఏళ్ళు జైలు శిక్ష విధించింది.
ఇక జార్ఖండ్ ముక్తి మోర్ఛా(JMM) నేత శిబూ సోరెన్ బొగ్గు కుంభకోణం కేసులో ఎన్ని ఆరోపణలు ఎదుర్కున్నారో తెలిసిందే. 2004-2006 మధ్య శిబూ సోరెన్ కేంద్ర మంత్రివర్గంలో కోల్ పోర్ట్‌ఫోలియో బాధ్యతల్లో ఉన్నప్పుడు కోల్ బ్లాక్ కేటాయింపుల్లో అవినీతికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్న కేసుల్లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత, సుఖ్‌రాం, సురేష్ కల్మాడీలు కూడా ఆరోపణలు, సీబీఐ దర్యాప్తులు ఎదుర్కొన్నవారే.
ప్రజాధనాన్ని అప్పనంగా స్వాహా చేసినందుకో… ప్రభుత్వ ఉద్యోగాలను అవినీతితో కట్టబెట్టినందుకో… అవినీతి కుంభకోణంలోనో పేరేదైతేనేం అంతా అదే స్కాం. అవినీతి స్కాం….అయితే వారంతా చివరాఖరుకి ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడాల్సిందే. ఒక లాలూ ప్రసాద్ యాదవ్‌లా, మరో ఓం ప్రకాష్ చౌతాలా మాదిరిగా న్యాయస్థానంలో పరీక్షకు నిలబడాల్సిందే. నేరం రుజువయ్యాకి చట్టానికి తలలు వంచాల్సిందే.
అయితే భారత రాజ్యాంగం కల్పించిన సమన్యాయం ప్రతిభారతీయుడికీ దక్కాల్సిందే. అది అందరి హక్కు. కులమతాలకతీతంగా, పేద, ధనికులకు అతీతంగా, ప్రాంతాలకూ, రాష్ట్రాలకూ అతీతంగా ఆ న్యాయం అత్యున్నతంగా నిలిచి తీరాల్సిందేనని ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావని మదినిండుగా కాంక్షిస్తోంది. అది అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత పాలకులదే.
– అరుణ అత్తలూరి, టీవీ9 తెలుగు
Also Read..
చిన్నారులను అనాథలుగా చేసి.. కానరానిలోకాలకు తరలిపోయిన తల్లి
West Godavari: తల పట్టుకుంటున్న పోలీసులు.. ఇవేం దొంగతనాలు.. వంటింట్లోకి దూరి




