CM KCR: ఎనిమిదేళ్లలో దేశం పూర్తిగా నష్టపోయింది.. మోడీ సర్కార్‌పై సీఎం కేసీఆర్ ఫైర్..
కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ అంటూ వ్యాఖ్యానించారు. విస్తృత చర్చ అనంతరం సమర్థమైన నాయకుడిని ఎన్నుకుంటామన్నారు.
CM KCR on Modi Govt: బీహార్‌లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాన్ని నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. గల్వాన్ అమరవీరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ అనంతరం సీఎం కేసీఆర్, బీహార్ ముఖ్యంత్రి నితీశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ అంటూ వ్యాఖ్యానించారు. విస్తృత చర్చ అనంతరం సమర్థమైన నాయకుడిని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికలప్పుడు నాయకుడిని ఎన్నుకుంటామని.. నాయకత్వం గురించి తెలుపుతామని ప్రకటించారు. నితీష్ కుమార్ దేశంలోనే సీనియర్ నాయకుడని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఘోరంగా పతనమైందని పేర్కొన్నారు. రైతులు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ మోడీ సర్కారు ఏం చెయ్యలేదంటూ మండిపడ్డారు. తన కార్పొరేట్ మిత్రుల కోసమే ప్రధాని మోడీ తపనపడుతున్నారని విమర్శించారు.
దేశవ్యాప్తంగా ఉన్న నదుల్లో 70 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, కానీ వాటిని ఉపయోగించుకునే ఆలోచన మాత్రం కేంద్రానికి లేదంటూ సీఎం కేసీఆర్ విమర్శించారు. దేశరాజధాని ఢిల్లీలో కూడా తాగునీరు, విద్యుత్ సమస్యలు తీర్చలేదంటూ ఎద్దేవా చేశారు. సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ఈ దేశాన్ని ఏం చేయాలని అనుకుంటోందని ప్రశ్నించారు. బీజేపీ మంచి చేసి ఉంటే రైతులు ఉద్యమించే వారు కాదన్నారు. ధరలు పెరగడంతో పేదలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెడుతున్నారని.. బీజేపీ ముక్త్ భారత్ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మేకిన్ ఇండియా అన్నారని, కానీ గాలి పటాలు ఎగరేసే మాంజా కూడా చైనా నుంచే దిగుమతి అవుతోందంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రతీకారంతోనే రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ లాంటి వాటితో దాడులు చేస్తున్నారన్నారు. విద్వేశాలు పెరిగితే దేశం నష్టపోతుందని.. గుణాత్మక మార్పులు, దేశాన్ని మార్చే రాజకీయాలు అవసరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశాన్ని కాపాడుకోవడంపై నితీశ్ తో చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు. చైనాతో పోల్చుకుంటే మనం ఎక్కడున్నాం..? అమెరికా చైనాతో పోటీ పడుతుంటే.. కేంద్రం దేశాన్ని నాశనం చేస్తుందని మండిపడ్డారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అన్న బీజేపీ నినాదం ఏమైందంటూ ప్రశ్నించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి