ప్రభుత్వ ఉద్యోగం కోసం.. పుట్టిన బిడ్డను సజీవంగా పాతిపెట్టిన తల్లిదండ్రులు!
ప్రభుత్వ ఉద్యోగం మీద ఉన్న మమకారం కన్న బిడ్డపై లేకుండాపోయింది ఆ దంపతులకు. ఉద్యోగం పోతుందన్న భయంతో ఓ టీచర్ తన భార్యకు అప్పుడే పుట్టిన కొడుకును అడవిలో బండరాయి కింద సజీవంగా పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింధ్వారా జిల్లాలోని నందన్‌వాడీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

భోపాల్, అక్టోబర్ 2: మధ్యప్రదేశ్‌లోని చింధ్వారా జిల్లాలోని నందన్‌వాడీ గ్రామం సమీపంలోని ఓ గుట్టపై సప్టెంబర్ 28న తెల్లవారుజామున ఓ శిశువు ఏడుపు వినిపించింది. పొద్దున్నే వాకింగ్‌కు వచ్చిన కొందరు శిశువు ఏడుపు విని అటుగా వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్ వారి కంటపడింది. అప్పుడే పుట్టిన పసికందు.. ఒంటి నిండా చీమలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రాయిని తొలగించి రక్తసిక్తంగా చలికి వణికిపోతున్న మూడు రోజుల పసికందును రక్షించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
విచారణలో శిశువు తల్లిదండ్రులు బబ్లు దండోలియా(38), భార్య రాజకుమారిగా పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసి, విచారించగా అసలు బండారం బయటపడింది. బబ్లు దండోలియా ప్రభుత్వ టీచర్. అయితే ఇద్దరి కంటే సంతానం ఎక్కువ కలిగి ఉండకూడదని, ఒకవేళ ఉంటే వారి ఉద్యోగం తొలగిస్తామని ఇటీవల అక్కడి ప్రభుత్వం ప్రకటన చేసింది. జనాభా నియంత్రణ కోసం తీసుకువచ్చిన ఈ నిబంధన పసికందు పాలిట శాపంగా మారింది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 23 తెల్లవారుజామున బబ్లూ భార్య రాజకుమారి ఇంట్లో ప్రసవించింది. దీంతో ఇప్పటికే తమకు ముగ్గురు పిల్లలు ఉండటంతో నాలుగో సారి మగబిడ్డ పుట్టడంతో నలుగురు పిల్లలు సంగతి ప్రభుత్వానికి తెలిస్తే తన ఉద్యోగం పోతుందనే భయంతో ఇంట్లోనే భార్య ప్రసవించడంతో బిడ్డను అడవిలో బండరాయి కింద పాతిపెట్టినట్లు దండోలియా దంపతులు పోలీసులకు తెలిపారు. పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విద్యావంతులైన తల్లిదండ్రులు ఇంతటి దారుణానికి పాల్పడగం విచారకరమని, డీఎన్‌ఏ టెస్ట్‌లో శిశువు దండోలియా దంపతుల బిడ్డగా తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




