ఖాళీ సీసాలు తిరిగిస్తే డబ్బులు.. నవంబర్ 1 నుంచి మద్యం విక్రయంలో కొత్త రూల్స్!
మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్.. నవంబర్ ఫస్ట్ నుంచి ప్రతి బ్రాండ్‌పై రూ.10 పెరగనుంది. అవును పర్యావరణ పరిరక్షణలో భాగంగా మద్యం సీసాలపై పర్యావరణ సెస్ విధించిన నేపథ్యంలో రూ.10 అదనంగా వసూలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఖాళీ సీసాలను దుఖానాల్లో తిరిగి ఇస్తే.. మీరు అదనంగా చెల్లించిన డబ్బులు మళ్లీ తిరిగి పొందవచ్చు. ఈ విధానం ఎక్కడ అమల్లోకి రాబోతుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్.. నవంబర్ ఫస్ట్ నుంచి ప్రతి బ్రాండ్‌పై రూ.10 పెరగనుంది. అవును తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్ నవంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల మద్యం సీసాలపై చిల్లర ధరను (MRP) రూ. 10 మేర పెంచాలని నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటీవలే మద్యం సీసాలపై పర్యావరణ సెస్ విధించడంతో టాస్మాక్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, వినియోగదారులు ఖాళీ సీసాలను మళ్లీ తిరిగి ఇస్తే.. వారు చెల్లించిన అదనపు డబ్బులను తిరిగి పొందవచ్చని టాస్మాక్ స్పష్టం చేసింది.
ఈ కొత్త విధానం అమలు చేయబోతున్నట్టు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం తయారీదారులు, డిపోలు, జిల్లా మేనేజర్లు, రిటైల్ దుకాణాల సిబ్బందికి టాస్మాక్ సర్క్యులర్‌ను జారీ చేసింది. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్నాళ్లు నిలిచిపోయిన ఖాళీ సీసాల సేకరణను రాష్ట్రంలో మళ్లీ ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. అయితే మద్యం ధరపై రూ.20 వరకు పర్యావరణ సెస్ పెంచేందుకు అసెంబ్లీ ఆమోదం తెలపగా.. ఖాళీ సీసాల పేరుతో కొందరు వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాని.. అందుకే ఈ సెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి తెలిపారు.
సాధారణంగా సెస్ అనేది ఎంఆర్పిలోనే కలిసి ఉంటుంది కాబట్టి.. సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు మొత్తాన్ని వసూలు చేయడానికి వీల్లేదని తెలిపారు. సిబ్బంది ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టాస్మాక్ తెలిపింది. అలాగే టెండర్ ద్వారా ప్రత్యేక వెండర్‌ను ఎంపిక చేసేవరకు ప్రస్తుత సిబ్బందే ఈ సీసాలను సేకరిస్తారని.. ఈ అదనపు పనిభారానికి గాను దుకాణాలకు రోజువారీ భత్యాన్ని చెల్లించనున్నట్టు తెలిపారు.
టస్మాక్ ప్రకారం.. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని దుకాణాలకు రోజుకు రూ. 2,000 ప్రకటించిగా, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు రోజుకు రూ. 1,800, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీల్లోని దుకాణాలకు రోజుకు రూ. 1,600, గ్రామ పంచాయతీలలోని దుకాణాలకు రోజుకు రూ. 1,500 చెల్లించనున్నట్టు తెలిపారు.
అయితే టాస్మాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత త్వరగా ఈ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని ఏఐటీయూసీ అనుబంధ టాస్మాక్ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి. ధనశేఖరన్ తెలిపారు. ఖాళీ సీసాల సేకరణకు ప్రత్యేక వెండర్‌ను పెట్టకుండా ఆ పని భారాన్ని సిబ్బందిపై మోపడం సరికాదని.. టస్మాక్ ఇచ్చే రూ. 2,000 అదనపు సిబ్బంది జీతాలు, సీసాల నిల్వ కోసం గదులకు ఇచ్చే అద్దెకే సరిపోదన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
