AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ వర్సెస్ స్టాలిన్.. డీలిమిటేషన్‌పై కొత్త పోరాటం.. తమిళ రాజకీయాల్లో లెక్కలు మారాయా?

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఒకవైపు డీలిమిటేషన్‌ పేరుతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ఆందోళన చేస్తూనే.. మరోవైపు తమిళనాడు హక్కుల కోసం అందరం కలిసి పోరాడాలంటున్న టీవీకే అధినేత విజయ్‌కు షాక్ ఇచ్చారు డీఎంకే అధినేత స్టాలిన్. విజయ్‌ పిలుపును పక్కన పెట్టి సమావేశానికి దూరంగా ఉన్నారు. 57 మంది ఎంపీలున్న తమిళనాడులో విజయ్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి 20 మంది మాత్రమే హాజరయ్యారు. సంఖ్య పరంగా ఇది భారీ హాజరు కాదు. కానీ రాజకీయంగా చూస్తే.. ఈ 20 మంది ఎవరన్నదే ఇప్పుడు అసలు లెక్క. ఇదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయయాంశంగా మారింది.

విజయ్ వర్సెస్ స్టాలిన్.. డీలిమిటేషన్‌పై కొత్త పోరాటం.. తమిళ రాజకీయాల్లో లెక్కలు మారాయా?
Tamil Nadu Politics
Siva Nagaraju
| Edited By: |

Updated on: Aug 08, 2026 | 5:34 PM

Share

విజయ్‌ పిలిచారు.. స్టాలిన్‌ రాలేదు. డీఎంకే ఎంపీలు రాలేదు. అన్నాడీఎంకే కూడా దూరంగానే నిలిచింది. మరోవైపు కాంగ్రెస్‌, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్‌, ఎండీఎంకేకు చెందిన ఎంపీలు మాత్రం విజయ్‌తో కలిసి కూర్చున్నారు. అంటే విజయ్‌ పిలుపును పూర్తిగా తిరస్కరించిన పరిస్థితి లేదు. అదే సమయంలో అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న లక్ష్యం కూడా పూర్తిగా నెరవేరలేదు. అందుకే ఈ సమావేశాన్ని విజయ్‌ విజయం అనీ.. వైఫల్యం అనీ ఒక్క మాటలో చెప్పలేం.

అసలు డీలిమిటేషన్‌ అంటే నియోజకవర్గాల పునర్విభజన. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పునఃసర్దుబాటు చేస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందన్నది తమిళనాడు పార్టీల ఆందోళన. కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణ వంటి అంశాల్లో ముందున్న రాష్ట్రాలకు.. తర్వాత పెరిగిన జనాభా ఆధారంగా రాజకీయ ప్రాతినిధ్యం తగ్గించడం న్యాయం కాదన్న వాదన చాలాకాలంగా ఉంది. అందుకే డీలిమిటేషన్‌ తమిళనాడులో కేవలం నియోజకవర్గాల లెక్క కాదు.. రాష్ట్ర హక్కుల అంశంగా మారింది.

స్టాలిన్ దూరం

ఈ అంశంపై డీఎంకే ఇప్పటికే పోరాటం చేస్తోంది. స్టాలిన్‌ నేతృత్వంలో గతంలోనే అఖిలపక్ష సమావేశాలు కూడా జరిగాయి. తమిళనాడుకు అన్యాయం జరగకూడదన్న వాదనను డీఎంకే జాతీయ స్థాయిలో కూడా వినిపించింది. అంటే డీలిమిటేషన్‌ వ్యతిరేక పోరాటం విజయ్‌తో మొదలైంది కాదు. మరి ఇప్పుడు విజయ్‌ అదే అంశంపై ప్రత్యేకంగా ఎంపీల సమావేశం ఎందుకు పెట్టారు? అన్నదే అసలు రాజకీయ ప్రశ్న.

రాజకీయ చతురత

ఇక్కడే విజయ్‌ రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ఒక సమస్యపై అన్ని పార్టీలను ఒకే టేబుల్‌ దగ్గరకు తీసుకురావడం ద్వారా తాను కేవలం ఒక పార్టీ అధినేతను కాదని.. తమిళనాడు ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకొని వెళ్లగల నాయకుడిననే ఇమేజ్‌ను నిర్మించుకోవాలని చూస్తున్నారా? అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించడం ఒక రాజకీయ విజయం. కానీ ప్రత్యర్థి పార్టీలతో కూడా ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం మాట్లాడగల స్థాయిని చూపించడం మరో రకమైన నాయకత్వ పరీక్ష.

అయితే ఈ సమావేశానికి స్టాలిన్‌ రాకపోవడమే ఇప్పుడు విజయ్‌కి అతిపెద్ద రాజకీయ ప్రశ్నగా మారింది. స్టాలిన్‌ వచ్చి ఉంటే కథ మరోలా ఉండేది. విజయ్‌ పిలుపునకు స్పందించి స్టాలిన్‌ కూడా అదే వేదికపై కూర్చుని తమిళనాడు హక్కుల కోసం కలిసి పోరాడతామని ప్రకటించి ఉంటే.. విజయ్‌ రాజకీయ ఇమేజ్‌కు అది భారీ బూస్ట్‌ అయ్యేది. తనకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న స్టాలిన్‌ను కూడా ఒక సమస్యపై తన వేదికపైకి తీసుకురాగలిగాడనే ప్రచారం జరిగేది.

కానీ స్టాలిన్‌ రాలేదు. డీఎంకే ఎంపీలు కూడా రాలేదు. ఇది విజయ్‌కు ఒకవైపు ఎదురుదెబ్బే. కానీ రాజకీయంగా మరో అవకాశం కూడా. ఎందుకంటే ఇప్పుడు విజయ్‌ ప్రజల్లో ఒక ప్రశ్నను బలంగా తీసుకెళ్లవచ్చు. తమిళనాడు కోసం అందరినీ పిలిచాను.. కలిసి మాట్లాడుదామని చెప్పాను. ఎవరు వచ్చారు? ఎవరు రాలేదనేది మీరు చూశారని చెప్పొచ్చు. రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి గైర్హాజరు కూడా ప్రచార ఆయుధంగా మారుతుంది. స్టాలిన్‌ విజయ్‌ వేదికపైకి వచ్చి ఉంటే.. విజయ్‌కి ఒక రోజు రాజకీయ మైలేజ్‌ వచ్చేది. రాకపోవడంతో.. విజయ్‌ దాన్ని ఒక నేరేటివ్‌గా మార్చుకునే అవకాశం వచ్చింది.

మెజార్టీ లేదు..

అయితే ఇక్కడ మరో లెక్క ఉంది. తమిళనాడుకు చెందిన మొత్తం 57 మంది ఎంపీల్లో 20 మంది మాత్రమే సమావేశానికి రావడం అంటే దాదాపు 35 శాతం మంది మాత్రమే హాజరైనట్టే. మిగిలిన 37 మంది.. అంటే దాదాపు 65 శాతం మంది రాలేదు. కాబట్టి దీనిని అన్ని పార్టీల ఏకాభిప్రాయ సమావేశంగా చెప్పడం సాధ్యం కాదు. కానీ వచ్చిన 20 మంది వివిధ పార్టీలకు చెందినవారు కావడం మాత్రం విజయ్‌కు రాజకీయంగా ఉపయోగపడే అంశం.

చేయి కలిపింది..

ముఖ్యంగా కాంగ్రెస్‌ రావడం.. డీఎంకే దూరంగా ఉండటం ఆసక్తికరమైన పరిణామం. డీఎంకేకు కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధం ఉన్నప్పటికీ.. విజయ్‌ ఏర్పాటు చేసిన వేదికకు కాంగ్రెస్‌ ఎంపీలు రావడం ద్వారా డీలిమిటేషన్‌ను పార్టీ రాజకీయాలకు అతీతమైన అంశంగా చూడాలన్న వాదన బలపడింది. అయితే దీన్ని వెంటనే కాంగ్రెస్‌-డీఎంకే మధ్య విభేదాలకు సంకేతంగా చూడటం తొందరపాటే అవుతోంది. కానీ విజయ్‌ మాత్రం ఈ పరిణామాన్ని తన రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఇప్పటివరకు తమిళ రాజకీయాల్లో ప్రధాన పోరు డీఎంకే వర్సెస్‌ అన్నాడీఎంకే. రెండు పెద్ద రాజకీయ ధృవాల చుట్టూనే ఎన్నికలు తిరిగేవి. ఇప్పుడు విజయ్‌ రంగంలోకి వచ్చారు. 2026 రాజకీయ సమీకరణాల్లో ఆయన ఎదుగుదలతో పాత లెక్కలకు కొత్త సవాలు ఎదురైంది. అందుకే డీలిమిటేషన్‌ వంటి రాష్ట్ర హక్కుల అంశం విజయ్‌కు కేవలం ఒక విధానపరమైన అంశం కాదు.. తన నాయకత్వాన్ని ప్రదర్శించుకునే రాజకీయ వేదిక కూడా.

కీలక పరీక్ష…

అయితే విజయ్‌ ముందున్న అసలు పరీక్ష ఇక్కడే ఉంది. ఒక సమావేశం పెట్టడం సులువు.. ఆ సమావేశాన్ని ఉద్యమంగా మార్చడం కష్టం. డీలిమిటేషన్‌పై నిజంగా పోరాడాలంటే పార్లమెంట్‌లో ఎంపీలను సమన్వయం చేయాలి. దక్షిణాది రాష్ట్రాలతో కలిసి వెళ్లాలి. కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. కేవలం తమిళనాడు ఎన్నికల రాజకీయాలకు పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడు మాత్రమే విజయ్‌ “తమిళ హక్కుల కోసం అందరినీ కలిపే నాయకుడు” అనే ఇమేజ్‌ బలపడుతుంది.

లేకపోతే డీఎంకే నుంచి మరో కౌంటర్‌ రావచ్చు. డీలిమిటేషన్‌పై మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. కొత్తగా విజయ్‌ వచ్చి మీటింగ్‌ పెట్టడం వల్ల ఇది కొత్త పోరాటం కాదని చెప్పే వీలుంది. అదే విజయ్‌కు పెద్ద సవాలు. ఎందుకంటే డీలిమిటేషన్‌ అనే అంశంపై స్టాలిన్‌కు రాజకీయ చరిత్ర ఉంది. విజయ్‌కు మాత్రం ఈ అంశంపై రాజకీయంగా కొత్త అధ్యాయం మొదలవుతోంది.

అందుకే ఈ సమావేశానికి కేవలం “20 మంది ఎంపీలు వచ్చారు.. 37 మంది రాలేదు” అనే అంకెలతో చూడటం సరిపోదు. అసలు కథ.. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు.. ఎందుకు రాలేదు.. విజయ్‌ ఈ వేదికను తర్వాత ఎలా ఉపయోగించబోతున్నారు అన్నదే. స్టాలిన్‌ రాలేదు కాబట్టి విజయ్‌ ఓడిపోయారని చెప్పలేం. 20 మంది వచ్చారు కాబట్టి విజయ్‌ గెలిచారని కూడా చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. డీలిమిటేషన్‌ పోరాటం పాతదే.. దానిపై విజయ్‌ వేసిన రాజకీయ అడుగు మాత్రం కొత్తది.

స్టాలిన్‌ దగ్గర ఈ అంశంపై అనుభవం ఉంది. విజయ్‌ దగ్గర కొత్త రాజకీయ ఉత్సాహం ఉంది. ఒకరి దగ్గర పోరాట చరిత్ర ఉంటే.. మరొకరు దానికి కొత్త రాజకీయ వేదికను నిర్మించాలనుకుంటున్నారు. అందుకే విజయ్‌ పిలుపు.. స్టాలిన్‌ దూరం అనేది కేవలం ఒక సమావేశం కథ కాదు.

తమిళనాడు హక్కుల పేరుతో మొదలైన ఈ పోరు.. రేపటి తమిళ రాజకీయాల్లో నాయకత్వ పోరుగా మారుతుందా? డీలిమిటేషన్‌ సీట్లను మారుస్తుందో లేదో వేచి చూడాలి.

కొండవీటి శివనాగరాజు

టీవీ9, డిప్యూటీ అవుట్ పుట్ ఎడిటర్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us