AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనికి రావాలనిపించడం లేదా? సెలవు తీసుకోండి..! ఉద్యోగులకు చైనా కంపెనీ బంపర్ ఆఫర్!

ఉద్యోగుల పని ఒత్తిడి, మానసిక సంతృప్తి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చ మొదలైంది. చైనాకు చెందిన రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లై (Pang Dong Lai) అనుసరిస్తున్న ఓ ప్రత్యేకమైన సెలవు విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులు మానసికంగా సంతోషంగా లేని రోజుల్లో కూడా సెలవు తీసుకునే అవకాశం కల్పించడమే ఈ పాలసీ ప్రత్యేకత.

పనికి రావాలనిపించడం లేదా? సెలవు తీసుకోండి..! ఉద్యోగులకు చైనా కంపెనీ బంపర్ ఆఫర్!
Harsh Goenka
Balaraju Goud
|

Updated on: Aug 08, 2026 | 1:53 PM

Share

ఉద్యోగుల పని ఒత్తిడి, మానసిక సంతృప్తి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చ మొదలైంది. చైనాకు చెందిన రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లై (Pang Dong Lai) అనుసరిస్తున్న ఓ ప్రత్యేకమైన సెలవు విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులు మానసికంగా సంతోషంగా లేని రోజుల్లో కూడా సెలవు తీసుకునే అవకాశం కల్పించడమే ఈ పాలసీ ప్రత్యేకత.

పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ విధానంపై సోషల్ మీడయా Xలో చేసిన పోస్టుతో ఈ అంశం మరింత వైరల్‌గా మారింది. పాంగ్ డాంగ్ లై సంస్థ ఉద్యోగులకు ఏడాదికి 10 రోజుల వరకు ‘అసంతృప్తి సెలవు’ (Unhappy Leave) ఇచ్చే విధానాన్ని అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగికి ఆ రోజు పనికి వెళ్లాలనే మానసిక స్థితి లేకపోతే.. సెలవు తీసుకోవచ్చన్నది ఈ విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా, ఇలాంటి సెలవు అభ్యర్థనను మేనేజర్లు తిరస్కరించకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు గోయెంకా తన పోస్టులో ప్రస్తావించారు.

ఈ విధానాన్ని భారత్‌లో అమలు చేయడం సాధ్యమేనా? అన్న ప్రశ్నను కూడా గోయెంకా లేవనెత్తారు. అయితే ఉద్యోగులు అసంతృప్తికి గురైన తర్వాత సెలవులు ఇవ్వడం కంటే.. వారు అసలు బర్న్‌అవుట్‌కు గురికాకుండా ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని నిర్మించడం మరింత ముఖ్యమా? అని ప్రశ్నించారు. కాగా, చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న పాంగ్ డాంగ్ లై సంస్థను యు డాంగ్లాయ్ 1995లో స్థాపించారు. ఉద్యోగుల సంక్షేమం, పని-జీవిత సమతుల్యతకు ప్రాధాన్యతనిచ్చే సంస్థగా ఇది గుర్తింపు పొందింది.

గోయెంకా పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇలాంటి విధానం ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి, ఉత్పాదకతకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడగా.. మరికొందరు సెలవుల కంటే ముందుగా పని గంటలు, పనిభారం, మేనేజ్‌మెంట్ సంస్కృతిలో మార్పులు రావాలని సూచిస్తున్నారు.

మొత్తానికి ‘అసంతృప్తి సెలవు’ చర్చ కేవలం 10 రోజుల అదనపు సెలవుల గురించి కాదు. ఉద్యోగులు సెలవు కోరుకునే పరిస్థితి రాకముందే.. వారిని సంతోషంగా, ఉత్సాహంగా పనిచేసేలా చేసే కార్యాలయ వాతావరణాన్ని సంస్థలు నిర్మించగలవా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us