Transgender Employment: హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. 50 మందికి నియామక పత్రాలు అందజేసిన సీఎం
ట్రాన్స్జెండర్లకు సమాజంలో గుర్తింపు ఇచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ట్రాన్స్‌జెండర్లకు చోటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. తాజాగా హోంగార్డ్ సర్వీసులలో శిక్షణ పూర్తి చేసుకున్న పలువురు ట్రాన్స్‌జెండర్లకు సీఎం స్టాలిన్ నియామక పత్రాలను అందజేశారు.

ట్రాన్స్జెండర్లకు సమాజంలో గుర్తింపు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వారిని ట్రాఫిక్ పోలీస్ విధుల్లోకి చేర్చగా.. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ట్రాన్స్‌జెండర్లకు హోంగార్డ్ సర్వీసుల్లోకి చేర్చుకుంది. రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇటీవలే హోంగార్డు సర్వీసుల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సుమారు 50 మంది ట్రాన్స్ జెండర్లకు మంగళవారం సీఎం స్టాలిన్ నియామక పత్రాలను అందజేశారు. మొదటి దశలో, చెన్నైలో ఐదుగురు, తాంబరంలో 15 మంది, అవడిలో 10 మంది, కోయంబత్తూర్, మధురైలలో ఏడుగురు, తిరుచ్చిలో ఆరుగురికి పోస్టింగ్ ఇచ్చారు. పండుగల సమయంలో వాహనాల ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణలో వీరు విధులు నిర్వహించనున్నారు.
అనంతరం హిందూ మతం, ఆలయాల ఎండోమెంట్స్ శాఖ ఆధీనంలో ఉన్న దేవాలయాల్లో సేవలందించిన పలువురు పెన్షనర్లకు సీఎం స్టాలిన్ పొంగల్ బోనస్‌ను పంపిణీ చేశారు. అలాగే, తమిళనాడు కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ రూ.80.62 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన కొత్త ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. తర్వాత కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి శాఖ నిర్వహించిన శిబిరం ద్వారా ఉపాధి పొందిన ఒక లబ్ధిదారుడికి ఆయన నియామక ఉత్తర్వును అందజేశారు. తాజాగా జరిగిన ఈ నియామకంతో, ఇటువంటి శిబిరాల ద్వారా ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల మంది ఉపాధి పొందారు.

Transgender Employment
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
