Business Idea: శంఖు పూలు.. మీకు లక్షల ఆదాయం ఇచ్చే అవకాశం ఉంది!
శంఖు పూల సాగు భారత్‌లో వాణిజ్య పంటగా మారే అవకాశం. బ్లూ టీ, సహజ రంగులకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండే దీనికి కారణం. ఈ పూలను సాగు చేసి, ఎండబెట్టి రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. ఔషధ గుణాలున్న ఈ పూలు కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తున్నాయి.

శంఖు పూలు.. పెరట్లోనో రోడ్ల పక్కనో అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. ఈ పూలను పెద్దగా గులాబీ, మల్లెలు, బంతిపూలలా సాగు చేయరు. కానీ, ఇప్పుడు ఈ పూలకు కూడా టైమ్ వచ్చినట్టు ఉంది. మన దేశంలో శంఖు పూల సాగు కూడా వాణిజ్య పంటల మారే అవకాశం కనిపిస్తుంది. అందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా సహజ నీలం రంగు డైలు, బ్లూ టీకి డిమాండ్ పెరగడమే.
ఈ శంఖు పూలను కొంతమంది ఇప్పటికే సాగు చేసి.. వాటిని ఎండబెట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. అస్సాంలోని అంతాయ్‌గాలో నీలం బ్రహ్మ అనే మహిళ రెండేళ్ల క్రితం మొదటిసారి ఆరబెట్టిన శంఖు పూలు అమ్మి రూ.4,500 సంపాదించారు. ఇప్పుడు సోలార్ డ్రయ్యర్లతో శంఖు పూలు ఎండబెడుతూ చిన్నపాటి వ్యాపారం ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా శంఖు పూల సాగు జరుగుతోంది. ఈ శంఖు పూలను వేడి నీళ్లలో వేస్తే అద్భుతమైన నీలం రంగు టీ వస్తుంది. దీనిలో కొంచెం నిమ్మరసం వేస్తే ఊదా రంగుకి మారుతుంది. ఇది ఆ పూల రసంలోని మరో బ్యూటీ. సహజ ఫుడ్ కలరింగ్, టెక్స్‌టైల్ డైలకు దీనిని ఉపయోగిస్తారు.
పైగా ఇందులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని, ఇది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కూడా సహాయపడుతుందని చెన్నైకి చెందిన శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ అధ్యయనాలు చెబుతున్నాయి. థాయ్‌లాండ్, ఇండోనేసియా తర్వాత భారత్‌లో ఈ శంఖుపూల సాగు వేగంగా పెరుగుతోంది. అమెరికా FDA 2021లో ఆహారంలో దీనిని అనుమతించగా, యూరప్‌లో కొన్ని అనుమానాలతో ప్రస్తుతానికి ‘నావెల్ ఫుడ్’గా మాత్రమే వర్గీకరించారు.
ఇలా వాణిజ్య పంటగా ఈ శంఖు పూల సాగు మారే సమయం దగ్గరల్లోనే ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. కొత్త వ్యాపారం చేయాలని చూస్తున్న వారు ఈ శంఖు పూల డ్రైయింగ్ బిజినెస్ ప్రారంభించినా, లేదా భూమి ఉండి వినూత్న పంటను సాగు చేయాలని అనుకుంటే శంఖు పూలను పెంచి వాటిని అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. వీటికి పోనుపోను మార్కెట్‌లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
