కలలో వెంటాడిన ముగ్గురు మహిళలు.. మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఊహించని ఘటన..
సైన్స్ పుంతలు తొక్కుతున్న తరుణంలోనూ ఇంకా మంత్రాలు.. తంత్రాలు అంటూ మూఢనమ్మకాల వెంట పరుగెడుతూ అమాయకులు బలి అవుతూనే ఉన్నారు. కంటి నిండా నిద్ర లేక, కలలో వచ్చే పీడకలల భయం భరించలేక, మానసిక వేదనతో ఓ యువకుడు అర్ధాంతరంగా తన నూరేళ్ల జీవితాన్ని ముగించాడు. ముగ్గురు మహిళల రూపంలో వెంటాడిన ఆ పీడకలలు, చివరకు అతడిని మృత్యువు ఒడిలోకి ఎలా నెట్టాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆధునిక యుగంలోనూ మూఢనమ్మకాలు అమాయక ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. పీడకలలు వస్తున్నాయనే భయంతో సరైన వైద్యం అందక ఓ 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో సంచలనం సృష్టించింది. మృతుడిని రాందాస్‌గా గుర్తించారు. గత కొంతకాలంగా రాందాస్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని కలలలో నిరంతరం ముగ్గురు మహిళలు కనిపిస్తూ, అతన్ని వేధిస్తున్నట్లు భ్రమపడేవాడు. ఆ పీడకలల వల్ల అతను తీవ్రమైన భయాందోళనకు గురై మానసికంగా కృంగిపోయాడు.
వైద్యం పక్కన పెట్టి.. మాంత్రికుడి చెంతకు..
రాందాస్ పరిస్థితిని చూసిన కుటుంబ సభ్యులు.. అది మానసిక సమస్య అని గుర్తించలేకపోయారు. ఎవరో తమ కొడుకుపై క్షుద్ర పూజలు చేశారని అనుమానించారు. రాందాస్ సోదరి నివసించే అంబపట్ గ్రామంలోని ఒక మాంత్రికుడి వద్దకు అతన్ని తీసుకెళ్లారు. ఆ మాంత్రికుడు రాందాస్‌కు మంత్రతంత్రాలతో చికిత్స చేశాడు. మొదట్లో మూడు నెలల పాటు రాందాస్ బాగానే ఉన్నట్లు అనిపించినా మళ్లీ ఆ పీడకలలు మొదలయ్యాయి.
విషం తాగి ఆత్మహత్య
మళ్లీ అవే భయంకరమైన కలలు రావడం, ఆ మహిళలు తనను వేధిస్తున్నారనే ఆందోళనతో రాందాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఈ సమస్య నుంచి బయటపడలేననే భావనతో గత గురువారం రాత్రి గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లి విషం తాగి తన ప్రాణాలను తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి, కేసు నమోదు చేశారు. “రాందాస్ మరణానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, పీడకలల భయం అని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే దీని వెనుక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం” అని పోలీసులు తెలిపారు.
నిపుణుల హెచ్చరిక
ఇలాంటి ఘటనలు సమాజంలో పాతుకపోయిన మూఢనమ్మకాలకు అద్దం పడుతున్నాయి. మానసిక అనారోగ్యం కలిగినప్పుడు మంత్రగాళ్ల వద్దకు కాకుండా సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. సరైన సమయంలో కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే రాందాస్ ప్రాణం దక్కేదని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
