Jammu Drone: జమ్ము కశ్మీర్‌లో మరోసారి డ్రోన్ కలకలం.. ఆరా తీస్తున్న భద్రతాధికారులు
Jammu Kashmir Drones: జమ్ము కశ్మీర్‌లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. జమ్ములోని సత్వారి ప్రాంతంలో డ్రోన్ సంచరిస్తుండటాన్ని స్థానికులు గుర్తించి భద్రతా దళాలకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది.
జమ్ము కశ్మీర్‌లో మరోసారి అనుమానిత డ్రోన్ సంచారం కలకలం సృష్టించింది. జమ్ములోని సత్వారి ప్రాంతంలో బుధవారం ఉదయం డ్రోన్ సంచరిస్తుండటాన్ని స్థానికులు గుర్తించి భద్రతా దళాలకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. జమ్ము ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు వందల మీటర్ల దూరంలోనే ఈ ప్రాంతముంది. వేకువజామున 4.05 గం.ల ప్రాంతంలో డ్రోన్ కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. డ్రోన్ సంచారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న భారత సైనికాధికారులు..దీనిపై ఆరా తీస్తున్నారు. అక్కడ ఆకాశంలో కనిపించింది డ్రోనేనా? అన్న అంశంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై ప్రత్యేక దృష్టిసారించారు. డ్రోన్ కనిపించినట్లు చెబుతున్న ప్రాంతంలో సాయుధ బలగాలను మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Jammu & Kashmir | Suspected drone spotted in Satwari area of Jammu. Details awaited.
— ANI (@ANI) July 21, 2021
శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లోని ఐఏఎఫ్ స్టేషన్‌పై గత నెల డ్రోన్ దాడి జరగడం తెలిసిందే. ఈ దాడి ఘటనలో ఇద్దరు సిబ్బంది స్వల్ప గాయాలకు గురైయ్యారు. దేశంలో భారత సేనలపై ఉగ్రవాదులు జరిపిన ఈ తొలి డ్రోన్ దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. భారత ఆర్మీపై డ్రోన్ దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 29న ఉన్నత రక్షణ శాఖ అధికారులు, సైనికాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కూడా పలుచోట్ల డ్రోన్లు కనిపించడం కలకలం సృష్టిస్తోంది. భారత సేనలపై దాడులకు ఉగ్రవాదులు డ్రోన్లను సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్న భద్రతా దళాలు..డ్రోన్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత సైనికులపై దాడులు జరిపేందుకు తక్కువ వ్యయంతో కూడిన డ్రోన్స్ సమకూర్చుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా చైనా నుంచి డ్రోన్స్ సమకూర్చుకుని..వాటిని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇవ్వొచ్చని భారత సైనికాధికారులు అనుమానిస్తున్నారు.
అటు దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలపై డ్రోన్లతో ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశముందని ఇంటెలిజన్స్ వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది.
Also Read..
చైనాను ముంచెత్తుతున్న భారీ వరదలు..రైల్లో చిక్కుకున్న వందలాది ప్రయాణికులు..12 మంది మృతి