ఆ బంగ్లా వెంటనే ఖాళీ చేయండి.. మాజీ చీఫ్ జస్టిస్‌కు సుప్రీం షాక్..
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్.. అధికారిక బంగ్లాను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి సుప్రీం లేఖ రాసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన నివాసం ఉంటున్నారని లేఖలో ప్రస్తావించింది. ఈ అంశంపై చంద్రచూడ్ స్పందించారు. ఇంకా ఎందుకు ఆ బంగ్లాలోనే ఉంటున్నారో వివరించారు.

భారత మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. వెంటనే తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. సీజేఐగా రిటైర్ అయ్యాక కూడా చంద్రచూడ్ అదే భవనంలో ఉంటున్నారు. చంద్రచూడ్ నవంబర్ 10, 2024న రిటైర్ అయ్యారు. దాదాపు 8నెలలు గడుస్తున్నా.. ఆయన ఇంకా అధికారిక భవనంలోనే ఉంటున్నారు. బంగ్లాను ఖాళీ చేయాలని సుప్రీం కోర్టు గతంలోనే చంద్రచూడ్‌కు లేఖ రాసింది. అయితే ఆయన 6నెలల పాటు అక్కడే ఉండేలా పర్మిషన్ తీసుకున్నారు. ఆ గడువు సైతం మే 31, 2025తో ముగిసింది. అయినా మాజీ సీజేఐ బంగ్లా ఖాళీ చేయకపోవడంతో వెంటనే బంగ్లాను స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర గృహనిర్మాణ శాఖకు లేఖ రాసింది.
ఈ అంశంపై చంద్రచూడ్ స్పందించారు. వ్యక్తిగత కారణాలతోనే బంగ్లాలో ఉండాల్సి వస్తుందని తెలిపారు. తన కూతుళ్లకు అనువైన బంగ్లా కోసం ఎంతో కాలంగా వెతుకుతున్నానని.. కానీ ఎక్కడా దొరకలేదన్నారు. ప్రభుత్వం తనకు తాత్కాలిక వసతిని అద్దెకు కేటాయించిందని..అయితే ఆ బంగ్లా రెండేళ్లుగా ఉపయోగించకపోవడంతో.. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. అవి పూర్తైన వెంటనే బంగ్లా ఖాళీ చేస్తానన్నారు. ప్రభుత్వ బంగ్లాలో ఉండాలని తనకు ఆసక్తి లేకున్నా.. తప్పక ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి.. అత్యున్నతి పదవి కావడంతో ప్రభుత్వం ఆ రేంజ్ లోనే వారికి భవనం కేటాయిస్తుంది. సాధారణంగా సీజేఐకి కేంద్రం టైప్ 8 బంగ్లా కేటాయిస్తుంది. ఎప్పటినుంచో కృష్ణ మీనన్ మార్గ్‌లోని బంగ్లాలో సీజేఐ నివాసం ఉంటూ వస్తున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయితో సహా 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇంకా నలుగురికి ప్రభుత్వ బంగ్లా కేటాయించలేదు. వారిలో ముగ్గురు సుప్రీంకోర్టు ట్రాన్సిట్ అపార్ట్‌మెంట్లలో, ఒకరు రాష్ట్ర అతిథి గృహంలో నివసిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..