Gig Platform: నేడు దేశవ్యాప్తంగా జొమాటో, స్విగ్గీ డెలివరీ సేవలు బంద్.. కారణం ఏంటంటే..?
డెలివరీ బాయ్స్ దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. తమకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ డెలివరీ కార్మికులు సమ్మె చేపడుతున్నారు. దీంతో నేడు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరల్లో స్విగ్గీ, జోమాటో వంటి సేవలు నిలిచిపోనున్నాయి.

ఆర్డర్ చేసిన కొన్ని గంటల్లోనే ఇంటికి నిత్యావసర సరుకులు, ఫుడ్ అందించే క్విక్ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ అయిన స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేవలు గురువారం మూతపడ్డాయి. డిసెంబర్ 25వ తేదీన గిగ్ కార్మికులు దేశవ్యాప్తంగా బంద్ చేపడుతున్నారు. క్రిస్మస్ పండుగ రోజున సమ్మె చేపడుతుండటంతో ఇంటికే సరుకులు, ఫుడ్ డెలివరీ చేసే సేవలు ఆగిపోయాయి. అలాగే న్యూ ఇయర్ వేళ డిసెంబర్ 31వ తేదీన కూడా బంద్ చేపట్టనున్నారు. దీంతో ఆ రోజు కూడా క్విక్ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ సేవలు నిలిచిపోనున్నాయి.
నిరసనల్లో భాగంగా దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్ రెండు గంటల పాటు పనిని నిలిపివేయనున్నారు. దీని వల్ల సేవలకు అంతరాయం కలగనుంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ సమన్వయంతో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్ట్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణలో కూడా సేవలకు అంతరాయం కలగనుంది. తమకు న్యాయపరంగా వేతనాలు కల్పించాలని, పని ప్రదేశంలో భద్రత, గౌవరం, సామాజిక భద్రత కల్పించాలని డెలివరీ బాయ్స్ డిమాండ్ చేస్తున్నారు. 10 నిమిషాల్లోనే డెలివరీ చేయాలనే నిబంధనను ఎత్తివేయాలని కోరుతున్నారు. దీని వల్ల తమపై ఒత్తిడి పడుతుందని, ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలస్యంగా డెలివరీ చేస్తే ఐడీని ఇనాక్టివ్ చేయడం, జరిమానాలు విధించడం వంటి నిర్ణయాలను రద్దు చేయాలని డెలివరీ బాయ్స్ కోరుతున్నారు. హెల్త్ ఇన్యూరెన్స్‌తో పాటు యాక్సిడెంటర్ ఇన్యూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విశ్రాంతి సమయాలు, సాంకేతిక లోపాలు లేకుండా బిల్లు చెల్లింపులు వంటివి కోరుతున్నారు. ఇక తమకు పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డెలివరీ బాయ్స్ కోరుతున్నారు.
