Rajiv Gandhi Assassination: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. దోషుల విడుదలకు ఆదేశాలు జారీ..
Rajiv Gandhi Assassination Convicts: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. దోషులందరినీ విడుదల చేయాలని...
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. దోషులందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం, సోనియా గాంధీ కుటుంబం సానుకూలంగా ఉండటంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులు తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తమను జైలు నుంచి విడుదల చేయాలంటూ దోషులు సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఇందులో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాల తర్వాత దోషులను విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
ఇదే కేసులో నిందితుడైన పెరారివాలన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలన్న తమిళనాడు మంత్రి మండలి సలహా ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్‌కు కట్టుబడి ఉంటుందని పేర్కొంటూ పెరారివాలన్‌ను విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది. ఇక తాజాగా రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు నళినీ శ్రీహరన్, ఆర్పీ రవిచంద్రన్‌లను కూడా ముందస్తుగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పెరారివాలన్ కేసులో జారీ చేసిన ఉత్తర్వులు వీరికి కూడా వర్తిస్తాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 (గవర్నర్ క్షమాపణ అధికారం) కింద పెరరివాళన్‌కు క్షమాభిక్ష పెట్టాలన్న మంత్రి మండలి సలహా గవర్నర్‌కు కట్టుబడి ఉంది. అయితే, గవర్నర్ ఆ అభ్యర్థనను ఆమోదించలేదు. దాంతో తమిళనాడు ప్రభుత్వం.. దోషి శిక్షలో మిగిలిన భాగాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మాణాన్ని రాష్ట్రపతికి పంపించారు. గవర్నర్ చర్య రాజ్యంగానికి విరుద్ధమని, ఇప్పటికే సుదీర్ఘ జాప్యం జరిగిందని ప్రభుత్వం అభిప్రాయపడింది.పెరరివాలన్‌కు న్యాయం చేసేందుకు రాజ్యంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం రాజ్యంగపరమైన అధికారాలను ఉపయోగించాలని కోర్టును కోరింది ప్రభుత్వం. ఈ మేరకు.. పెరరివాలన్‌ను విడుదల చేస్తు సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది.
అయితే, పెరరివాలన్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బేస్ చేసుకుని తమను కూడా ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ నళినీ శ్రీహరన్, పి రవిచంద్రన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మాజీ ప్రధాని హత్య కేసులో ఏడుగురు దోషుల్లో వీరిద్దరు కూడా ఉన్నారు. ఈ కేసులో ఆరుగురు దోషులు జైలులో శిక్షను అనుభవిస్తుండగా, ఒక దోషి AG పెరరివాలన్ ఈ ఏడాది మేలో రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం సుప్రీం కోర్టు తన అసాధారణ అధికారాన్ని ఉపయోగించడం ద్వారా జైలు నుంచి విడుదల అయ్యాడు. పెరరివాలన్ దాదాపు 30 ఏళ్లు జైలు జీవితం గడిపాడు.
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగింది. ధను అనే మహిళ తనను తాను పేల్చుకుంది. ఆ దుర్ఘటనలో రాజీవ్ గాంధీతో పాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఏడుగురు పెరరివాలన్, నళిని, జయకుమార్, ఆర్‌పీ. రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్ ను దోషులుగా తేల్చుతూ 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే ఆ మరుసటి ఏడాది పేరరివాళన్ సహా మురుగన్, నళిని, శాంతన్ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. మరణశిక్షను జీవిత ఖైదుగా తగ్గిస్తూ గతంలో కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు వీళ్లందరికీ జైలు జీవితం నుంచి విముక్తి లభించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..