Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో కేంద్రానికి సూచనలు

Russia Ukraine War: రష్యా - ఉక్రెయిన్ యుద్ధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో కేంద్రానికి సూచనలు
Supreme Court

Russia Ukraine War News: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో శుక్రవారం విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై..

Janardhan Veluru

|

Mar 04, 2022 | 12:43 PM

Russia Ukraine War News: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో శుక్రవారం విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల వివరాలను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీం ధర్మాసనానికి వివరించారు. ఇప్పటి వరకు 17 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా దేశానికి చేర్చినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న మిగతా వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అటార్నీ జనరల్ ధర్మాసనానికి వివరించారు.

పిటిషనర్లలో ఒకరైన ఉక్రెయిన్‌‌‌లోని భారత విద్యార్థితో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఫోన్‌లో మాట్లాడినట్లు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆ విద్యార్థి రొమానియాకు చేరుకున్నారని.. ఈ రాత్రికి ప్రత్యేక విమానంలో మిగిలిన విద్యార్థులతో పాటు ఆ విద్యార్థిని కూడా దేశానికి తీసుకురానున్నట్లు తెలిపారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరినీ దేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని అటార్నీ జనరల్‌ను సుప్రీంకోర్టు కోరింది. అవసరమైతే విద్యార్థుల తల్లిదండ్రుల కోసం హెల్ప్‌ లైన్ ఏర్పాటు చేయాలని సూచించింది.

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గత చేతు అనుభవాల నుంచి పాఠాలు నేర్వకుండా ఇంకా యుద్ధాలకు దిగడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ విషయంలో ఇంతకు మించి చెప్పగలిగింది ఏమీ లేదని.. అయితే విద్యార్థుల క్షేమం తమను ఆందోళనకు గురిచేస్తున్నట్లు పేర్కొంది.

ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ చేపడుతుండటం తెలిసిందే. ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు వారిని తరలిస్తోంది. నేపాల్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ దేశ పౌరులను కూడా తరలించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది.

ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు..

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ ప్రజలను హెచ్చరించింది అక్కడి ప్రభుత్వం. రష్యా వైమానిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉండటంతో అంతా బంకర్లలో తల దాచుకోవాలని సూచించింది. ఇప్పటికే ఒడెస్సా, బిలాసెర్‌క్వా, వొలిన్‌ఒబ్లాస్ట్‌ ప్రాంతాల్లో రష్యా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఇదిలా ఉండగా ఉక్రెయిన్‎పై రష్యా దాడులు ఎనిమిదో రోజు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో వందల మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నా పెద్దా అన్న తేడా లేదు.. ఇప్పటి వరకు కచ్చితంగా చనిపోయిన వారు ఇంతా అని లేకున్నా.. అక్కడ ఉన్న దృశ్యాలను చూసి హృదయం తల్లడిల్లుతోంది. ఎక్కడ చూసినా కాపాడాలంటూ కన్నీటితో ఎదురుచూపులు, ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పలువురు చిన్నారులు అనాథలుగా మారుతున్నారు.

ముఖ్యంగా చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులు ఎక్కడున్నారో అంటూ చూస్తున్న బిక్కు బిక్కు చూపులు గుండెలను కరిగి వేస్తున్నాయి. ప్రమాద ఘటనలో చిక్కుకున్న పేరెంట్స్‌.. పిల్లలైన జీవించాలన్న ఆశతో వదిలేసిన వారు ఇలా స్టేషన్లు, రోడ్లపై అనాధలుగా కనిపిస్తున్నారు. ఇక పిల్లలను మళ్లీ చూస్తామో లేదో.. అన్న బాధను చూస్తే కంటతడి పెట్టిస్తుంది. కూతురుని దూరంగా పంపలేక.. తనతో పాటు ఉంచుకోలేక పాపను పట్టుకొని ఏడ్వడం వర్ణనాతీతం. పాప కూడా పేరెంట్స్‌ని మళ్లీ కలుస్తానో లేదో అని ఎక్కిఎక్కి ఏడుస్తూ కనిపించింది. ఇది చూసిన వారెవరికైనా గుండె చలించక మానదు.

Also Read..

Work From Home: వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌కు దిగ్గజ సెర్చింజన్‌ సంస్థ స్వస్తి.. త్వరలోనే ఉద్యోగులు ఆఫీసుకు రావాలని సూచన

Russia-Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఈ ఫోటోస్ చూస్తే కన్నీళ్లు ఆగవు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu