ఒకే ఆరోపణపై నేరుగా సస్పెన్షన్‌ విధించడంలో అర్థం లేదు.. ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఏడాదికిపైగా సస్పెన్షన్‌ను పొడిగించడాన్ని సవాలు చేస్తూ ఏబీ.

  • Subhash Goud
  • Publish Date - 4:21 pm, Tue, 9 March 21
ఒకే ఆరోపణపై నేరుగా సస్పెన్షన్‌ విధించడంలో అర్థం లేదు.. ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఏడాదికిపైగా సస్పెన్షన్‌ను పొడిగించడాన్ని సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా అప్లికేషన్‌ వేశారు. అవినీతి ఆరోపణలు లేనందున రివ్యూ కమటీ ఏడాదికిపైగా పొడిగించడానికి వీలులేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది చందర్‌ ఉదయ్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో సస్పెన్షన్‌ ఒక్కటే మార్గమా అని ప్రభుత్వాన్ని అని జస్టిస్‌ ఖన్‌ విల్కర్‌ ప్రశ్నించారు. అయితే వెంకటేశ్వరరావును సస్పెన్షన్‌ చేసిన తర్వాత వేరే విభాగంలో పోస్టింగ్‌ ఇవ్వవచ్చు కదా అని ధర్మాసం ప్రశ్నించింది. ఒకే ఆరోపణపై నేరుగా సస్పెన్షన్‌ విధించడంలో అర్థం లేదని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్న వేసింది. సస్పెన్షన్‌ అనేది పరిష్కారం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

ఆరోపణలు నిగ్గు తేల్చాక చర్యలు తీసుకుంటే బాగుంటుందని జస్టిస్‌ ఏఎం ఖన్‌ విల్కర్‌ అన్నారు. ఆరోపణలపై దర్యాప్తు పూర్తికి ఆరు నెలల గడువు కోరింది ప్రభుత్వం. అయితే రోజువారీ దర్యాప్తు చేపట్టి ఎందుకు వెంటనే పూర్తి చేయలేదని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒక సీనియర్‌ అధికారిని సస్పెన్షన్‌ చేసి దర్యాప్తు పూర్తి చేయకుండా ఎన్నాళ్లు గడువు తీసుకుంటారని కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇందుకు వెంకటేశ్వరరావు తరపున న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ గడువు తీసుకున్న ప్రభుత్వం ఏమి చేయలేదని అన్నారు.

రోజువారీ దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామన్న ఆదినారాయణరావు.. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా సస్పెన్షన్‌ కొనసాగించాలని చూస్తోందని అన్నారు. నిన్ననే దర్యాప్తు అధికారిని నియమించినట్లు పత్రికల ద్వారా తెలిసిందని, దర్యాప్తు అధికారిని నియమించినట్లు స్పష్టం చేశారు ప్రభుత్వం తరపున న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ.

ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శాఖాపరమైన దర్యాప్తును ఏప్రిల్‌ 8లోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రోజువారీగా దర్యాప్తు చేపట్టాలని దర్యాప్తు అధికారికి ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు అధికారి ఏప్రిల్‌ 30లోగా పూర్తి దర్యాప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు సమగ్ర నివేదికను కోర్టుకు తదుపరి విచారణ తేదీలోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ మే 3కు వాయిదా వేసింది.

కాగా, ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు. అయితే సంబంధిత శాఖ విభాగంలో పరికరాలు, ఆయుధాల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం ఆయనను సస్పెన్షన్‌కు గురి చేసింది. అప్పటి నుంచి కోర్టు విచారణ కొనసాగుతూనే ఉంది.

 

ఇవి చదవండి :

Vizag Steel Plant: పెట్టుబడుల ఉపసంహరణ ఆగదంటున్న కేంద్రం.. దేశంలో ఇప్పటి వరకు డిజిన్వెస్టుమెంటు ప్రాసెస్ ఇదే!

Maitri Setu Bridge: ‘మైత్రి సేతు’ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. భారత్ – బంగ్లాల మధ్య అతిపెద్ద వంతెన

Gold Price: బంగారం ప్రియులకు శుభవార్త.. పసిడి కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమేనా..? రూ.13 వేలు తగ్గిన బంగారం