Indian Railways: ‘సెకండ్ క్లాస్ ప్రయాణికుడు’ అని పిలవొద్దు.. రైల్వేశాఖపై సుప్రీం సీరియస్..
రైల్వే కోచ్‌పై సెకండ్ క్లాస్ అనే పదే మనం చూసి ఉంటాం. అలాగే సెకండ్ క్లాస్ ప్రయాణికుడు అనే పదం వినే ఉంటారు. తాజాగా సెకండ్ క్లాస్ ప్యాసింజర్ అనే పదం రైల్వేశాఖ వాడుతుండటంపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అలా పిలవడం కరెక్ట్ కాదని తెలిపింది.

రైల్వే సెకండ్ క్లాస్ కోచ్‌ల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ పేరును ప్రయాణికుడికి కాకుండా కోచ్‌కు వర్తింపచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రైల్వేశాఖ తన మాన్యువల్‌లో సెకండ్ క్లాస్ ప్యాసింజర్ అనే పదాన్ని తొలగించాలని సూచించింది. సమానత్వం, గౌరవం అనే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తరగతి భేదం అనేది ప్రయాణికుడికి కాకుండా కోచ్‌కు వర్తింపజేయాలని పేర్కొంది. భారతీయ రైల్వే తన మాన్యువల్స్, అధికారిక పరిభాషలో “సెకండ్ క్లాస్ ప్రయాణికుడు” అనే పదాన్ని ఉపయోగించడాన్ని నిలిపివేయాలని సుప్రీం కోర్టు సూచించింది. 2015లో రైలు నుంచి పడి మరణించిన ఒక ప్రయాణికుడికి సంబంధించిన పరిహార కేసును విచారిస్తుండగా.. జస్టిస్ సంజయ్ కరోల్, నోంగ్‌మీకాపమ్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు రైల్వేశాఖను ఆదేశించింది.
“సెకండ్ క్లాస్” అనే పదం కోచ్‌ను గుర్తించేలా ఉండాలని, అందులో ప్రయాణించే వ్యక్తిని కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రయాణికుడు ప్రయాణం కోసం చేసే ఖర్చుకు సంబంధించినదిగా ఇది ఉంది. మన దేశంలో ఉన్న వర్గ విభజనల చరిత్ర భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనే విషయాన్ని గుర్తించి, ఆ వర్గ భావాన్ని ప్రయాణికుడికి కాకుండా కోచ్‌కు ఆపాదించాలని సూచిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. రైల్వేల నిర్లక్ష్యం లేదా తప్పును బాధితుడు నిరూపించాల్సిన అవసరం లేకుండానే నష్టపరిహారం అందించే 1989 రైల్వే చట్టం కింద నష్టపరిహార పరిధిని పరిశీలిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2015 నవంబర్‌లో అహ్మదాబాద్-హౌరా మెయిల్ రైలు నుండి కింద పడి చంద్రకాంత్ థక్కర్ అనే వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదం తర్వాత అతడు టిక్కెట్టును తిరిగి పొందలేదనే కారణంతో రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, మధ్యప్రదేశ్ హైకోర్టు అతని కుటుంబానికి నష్టపరిహారాన్ని నిరాకరించాయి. సుప్రీంకోర్టు ఆ నిర్ణయాలను రద్దు చేసి వితంతువుకు రూ. 8 లక్షల నష్టపరిహారాన్ని మంజూరు చేసింది. ఈ కేసు సందర్భంగా సెకండ్ క్లాస్ పరిబాష ఉపయోగించడం గురించి చర్చ జరగ్గా.. పై విధంగా ఆదేశాలిచ్చింది.
