Central Government: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.20 లక్షల వరకు లోన్.. వీరికి మాత్రమే..
కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. వివిధ వర్గాలకు వివిథ స్కీమ్స్ అమలు చేస్తోంది. అందులో విద్యార్థులకు సాయం అందించేందుకు ఓ స్కీమ్ ఉంది. అదే పీఎం విద్యాలక్ష్మి పథకం ఉంది. ఈ పథకం ద్వారా విద్యం కోసం రుణం పొందవచ్చు.

పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. చాలామంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉంటుంది. కానీ డబ్బు అనేది పెద్ద అడ్డంకిగా మారుతుంది. విద్యార్థులకు ఎదురయ్యే ఈ అడ్డంకిని తొలగించే ఉద్దేశంతో ప్రధాని మోదీ విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు. నవంబర్ 2024లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి పూచీకత్తు లేదా గ్యారెంటీ లేకుండా తక్కువ వడ్డీ రేట్లతో విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చు. ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశాలకు వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 22 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో సుమారు 7 లక్షల మంది కొత్త విద్యార్థులు కూడా ఉన్నారు. రూ. 10 లక్షల వరకు ఉన్న రుణాలపై వీరికి 3 శాతం వడ్డీతో లోన్ అందిస్తున్నారు.
లోన్ పొందేందుకు అర్హతలు ఏంటి..?
మెరిట్ ఆధారిత ఎంపిక ద్వారా అర్హత గల సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం డిగ్రీ, డిప్లొమా కోర్సులకు మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని ఆదాయ వర్గాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్షలు లేదా మెరిట్ ఆధారిత ప్రవేశాల ద్వారా చేరిన వారు మాత్రమే పీఎం విద్యాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మేనేజ్‌మెంట్ కోటా లేదా ఇతర కోటాల ద్వారా చేరిన వారు అర్హులు కాదు. మంజూరు చేసే రుణ మొత్తం కోర్సు ఫీజు, సంబంధిత ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. ఈ పథకం కింద రుణ మొత్తంపై నిర్దిష్ట గరిష్ట పరిమితి కేంద్రం విధించలేదు.
ఈ పథకంలో ప్రయోజనాలు ఏంటి..?
పీఎం విద్యాలక్ష్మి పథకంలో అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. రుణం పొందడానికి విద్యార్థులు ఎటువంటి పూచీకత్తును అందించాల్సిన అవసరం లేదు. అలాగే ఎలాంటి గ్యారెంటీ సంతకం కూడా అవసరం లేదు. రూ. 7.5 లక్షల వరకు విద్యా రుణాల కోసం ప్రభుత్వం బ్యాంకులకు 75 శాతం రుణ హామీని అందిస్తుంది. రూ. 4.5 లక్షల వరకు కుటుంబ ఆదాయం ఉన్న విద్యార్థులు కోర్సు కాలంలో 100 శాతం వడ్డీ రాయితీకి అర్హులు. రూ . 4.5 లక్షల నుండి రూ. 8 లక్షల మధ్య వార్షిక కుటుంబ ఆదాయం ఉన్న విద్యార్థులు రూ. 10 లక్షల వరకు విద్యా రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ద్వారా విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
పీఎం విద్యాలక్ష్మి యూనిఫైడ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. విద్యార్థులు తమ పేరు, ఆధార్ నంబర్, ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను అందించి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. లాగిన్ అయ్యాక కోర్సు, సంస్థ గురించిన వివరాలను నింపాలి. తాము రుణం కోరుకుంటున్న బ్యాంకును ఎంచుకుని దరఖాస్తును సమర్పించాలి. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులు తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
