మహిళపై పొందూరు ఎస్ఐ పితలాటకం
ప్రజల సొమ్ములతో జీతభత్యాలు పొందుతూ.. రాచమర్యాదలు అందుకుంటోన్న సర్కారీ నౌకర్లలో కొందరు అసలు సంగతి మర్చిపోతున్నారు. సామాన్య ప్రజల పాలిట రక్తపింజరాల్లా..
ప్రజల సొమ్ములతో జీతభత్యాలు పొందుతూ.. రాచమర్యాదలు అందుకుంటోన్న సర్కారీ నౌకర్లలో కొందరు అసలు సంగతి మర్చిపోతున్నారు. సామాన్య ప్రజల పాలిట రక్తపింజరాల్లా తయారై పీల్చుకుతింటున్నారు. అదీ.. రక్షణగా నిలిచే బాధ్యతాయుతమైన పోలీస్ విభాగంలో పనిచేస్తూ ఓ ఎస్ఐ పిచ్చి చేష్టలకు పాల్పడ్డం వీటికి పరాకాష్ట. కుటుంబపోషణకోసం ఓ మహిళ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక జంక్షన్లో కిరాణా దుకాణం నడుపుకుంటోంది. ఆ షాపులో అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటూ పొందూరు ఎస్ఐ రామకృష్ణ సదరు మహిళ షాపుపై దాడిచేసి మహిళా యజమానిని అదుపులోకి తీసుకున్నాడు. షాపులో దొరికిన 11 మధ్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఒక రోజంతా ఆమెను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు.
అయితే, ఆ సీసాలు ఇంటిలోని ఒక ఫంక్షన్ నిమిత్తం కొనుగోలుచేసినవని.. తనను విడిచిపెట్టమని ప్రాధేయపడింది. కట్ చేస్తే.. అయ్యవారి రొమాంటిక్ యాంగిల్ బయటపడింది. నువ్వంటే నాకిష్టం.. నా ఇంటికొచ్చి సుఖపెడితే కేసూ..గీసూ జాన్తానై అని గలీజాఫరిచ్చాడు. ఆత్మాభిమానం కలదానినని.. గౌరవప్రదమైన కుటుంబం, పిల్లలూ ఉన్నారని ఎంతచెప్పినా వక్రబుద్ధిని చాటుతూ పదేపదే ఫోన్లు చేసి వేధించాడు. దీంతో బాధితురాలు ఫోన్ వాయిస్ రికార్డింగులు మీడియాకు అందచేయడంతో ఎస్ఐ వారి బాగోతం బట్టబయలైంది.