AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తత.. ఇరకాటంలో భారత్‌ వైద్య విద్యార్ధులు! అసలు సంగతేమంటే..

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇరాన్‌లోని భారతీయ పౌరులు, విద్యార్థులు సహా అక్కడి భారతీయులంతా వీలైనంత త్వరగా ఇండియాకు చేరుకోవాలని సూచించింది. కానీ భద్రత, విద్యాపరమైన ఇబ్బందుల నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు నలిగిపోతున్నారు. వారు ఉన్నపళంగా దేశం నుంచి నిష్క్రమించడం అంత తేలికైన పని కాదు..

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తత.. ఇరకాటంలో భారత్‌ వైద్య విద్యార్ధులు! అసలు సంగతేమంటే..
geopolitical tension in USA and Iran
Srilakshmi C
|

Updated on: Feb 25, 2026 | 11:13 AM

Share

టెహ్రాన్, ఫిబ్రవరి 25: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడి విద్యార్థులు, పౌరులు వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు ద్వారా స్వదేశానికి తిరిగి రావాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ నేపథ్యంలో అక్కడి వైద్య విద్యార్ధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి ప్రారంభంలో ఇరాన్ లోని మెడికల్ వర్సిటీల్లో కీలక పరీక్షలు జరగాల్సి ఉంది. వర్సిటీ నిర్వహించే ఈ మెడికల్‌ డిగ్రీ పరీక్షలకు హాజరు కాకపోవడం వల్ల విద్యార్ధుల గ్రాడ్యుయేషన్ చదువులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దాదాపు 1000 నుంచి 1,500 మంది భారతీయ వైద్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. వీరిలో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులే ఉన్నారు. ఇరానియన్ వర్సిటీల్లో వీరంతా చదువుతున్నారు. భారత్‌ పిలుపు వారి వర్సిటీ పరీక్షల షెడ్యూల్‌కు విరుద్ధంగా ఉండటంతో.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అక్కడి భారత వైద్య విద్యార్ధులు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇరాన్‌ నుంచి భారత్‌కి తిరిగి వస్తాం. కానీ మా పరీక్షలు మార్చిలో జరగాల్సి ఉంది. వాటి వాయిదాపై ఎలాంటి స్పష్టత లేదు. మేము పరీక్షలను మిస్ అయితే అది మా అకడమిక్‌ ఇయర్‌ను ప్రభావితం చేస్తుంది. మా పరీక్షలు వాయిదా పడితే, మేము వీలైనంత త్వరగా భారత్‌కు వస్తామని సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌లోని భారతీయ వైద్య విద్యార్థి బిలాల్ భట్ తెలిపాడు. ఆకాశంలో విమానాలు నిత్యం చక్కర్లు కొడుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న అనిశ్చితి చాలా మంది విద్యార్థులను, వారి కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తుందని తెలిపాడు. మరో విద్యార్థి ముసాఫిద్ కూడా ఇలాంటి భయాలనే వ్యక్తం చేశాడు. విమానాలు నడుస్తున్నాయి. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు. మా ఏకైక ఆందోళన భద్రత, మా చదువులు. విదేశాలలో ప్రొఫెషనల్ డిగ్రీలు చదువుతున్న చాలా మంది ఎదుర్కొంటున్న సందిగ్ధతను ఇదేనని అన్నాడు.

ఈ క్రమంలో ఇరాన్‌లో ప్రస్తుతం ఉన్న భారతీయ విద్యార్థుల భద్రత, విద్యా భవిష్యత్తు కోసం ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA) జమ్మూ కాశ్మీర్ యూనిట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఇరాన్‌ నుంచి భారతీయ విద్యార్ధులను స్వదేశానికి రావాలన్న సూచనపై AIMSA జమ్మూ, కాశ్మీర్ యూనిట్ అధ్యక్షుడు మొహమ్మద్ మోమిన్ ఖాన్ మాట్లాడుతూ.. టెహ్రాన్‌లోని భారత హైకమిషన్ ఈ సలహా జారీ చేసింది. అందులో వారు తమ పౌరులను తిరిగి భారత్‌కు రావాలని కోరారు. అయితే మార్చి 5న వర్సిటీ పరీక్షలు జరగనున్నాయని విద్యార్థుల నుంచి మాకు సమాచారం అందింది. కొంతమంది విద్యార్థులు ఇప్పటికే భారత్‌కి చేరుకున్నారు. కాబట్టి వారు తిరిగి రావడం సాధ్యం కాదు. ప్రస్తుత పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. వారి తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారని అన్నారు.

ఇరాన్ పరీక్షల షెడ్యూల్ ఇదే..

ఇరాన్ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ ప్రకారం ప్రభుత్వ ప్రాథమిక శాస్త్రాలు (ఓలుమ్-ఇ-పాయే) పరీక్ష, ప్రీ-ఇంటర్న్‌షిప్ పరీక్ష మార్చి 5న జరగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాలు విద్యార్థి ప్రీ-క్లినికల్ అధ్యయనం నుంచి క్లినికల్ శిక్షణ, ఆసుపత్రి పోస్టింగ్‌ల వరకు పురోగతి సాధించేందుక ఉపయోగపతాయి. ఈ పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే జరుగుతాయి. వాటిని రాయలేకపోతే మరో ఆరు నెలల వరకు ప్రమోషన్‌ కోల్పోయే అవకాశం ఉంది. దీని వల్ల వారి ఐదున్నర సంవత్సరాల మెడికల్ డిగ్రీ మరింత ఆలస్యం అవుతుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us