AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రశాంత్ కిశోర్‌తో రజనీ భేటీ.. అసలు మ్యాటరేంటి..!

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై దృష్టి పెట్టారా..? ఇక పూర్తిగా ఆయన రాజకీయాలకు సమయాన్ని కేటాయించనున్నారా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికి ఇప్పుడు అవుననే సమాధానమే వినిపిస్తోంది. దానికి తోడు ఇటీవల ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో రజనీ భేటీ అవ్వడంతో.. ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రశాంత్‌ కిశోర్ తన బృందంతో చేయించిన సర్వే వివరాలు తదితర అంశాలపై వీరిద్దరి […]

ప్రశాంత్ కిశోర్‌తో రజనీ భేటీ.. అసలు మ్యాటరేంటి..!
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 25, 2019 | 2:12 PM

Share

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై దృష్టి పెట్టారా..? ఇక పూర్తిగా ఆయన రాజకీయాలకు సమయాన్ని కేటాయించనున్నారా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికి ఇప్పుడు అవుననే సమాధానమే వినిపిస్తోంది. దానికి తోడు ఇటీవల ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో రజనీ భేటీ అవ్వడంతో.. ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రశాంత్‌ కిశోర్ తన బృందంతో చేయించిన సర్వే వివరాలు తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు రజనీ ప్రజా సంఘాల నిర్వాహకులు ధృవీకరించారు. దీంతో రజనీ రాజకీయాల్లో బిజీ కానున్నారని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

అయితే సినిమాల్లో సూపర్‌స్టార్‌గా పేరొందిన రజనీకాంత్.. రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీంతో రాజకీయాల్లోకి ఆయన రాకకు సంబంధించి దాదాపుగా 2 దశాబ్దాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిపై రజనీ స్పష్టతను ఇవ్వకపోవడంతో అవన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి(దీనిపై ఇటీవల వచ్చిన ఓ సినిమాలో సెటైరికల్ డైలాగ్‌ కూడా పెట్టగా.. దానిపై పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే). ఇక ఆ తరువాత అభిమానుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. ఎట్టకేలకు 2017లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు రజనీ. ‘రజనీ మక్కల్ మంద్రమ్’ పేరుతో డిసెంబర్ 31న తన పార్టీని ప్రకటించిన తలైవా.. 2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందని వెల్లడించారు.

అయితే కేవలం పార్టీని మాత్రమే స్థాపించిన రజనీ.. తన పార్టీ జెండా, అజెండా గురించి ఏ విషయం చెప్పలేదు. కనీసం కేడర్‌ను కూడా బలోపేతం చేసుకోవడం లేదు. తన పాటికి తాను సినిమాలను చేసుకుంటూ పోతున్నారు. దీంతో రజనీ పార్టీ ఒకటి ఉంది అన్నది దాదాపుగా అందరూ మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ తన మనసును రాజకీయాలవైపు మళ్లించారు సూపర్‌స్టార్. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. వీలైనంత త్వరగా తన పార్టీ పనులను ప్రారంభించాలనుకుంటున్న రజనీ.. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్‌తో అందుకే భేటీ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో మోదీ విజయం వెనుక కీలక పాత్ర పోషించిన ఆయన.. ఆ తరువాత బీహార్‌లో ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వ ఏర్పాటులోనూ ముఖ్య పాత్ర వహించారు. అంతేకాదు ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ఆయన.. వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి గల ముఖ్య కారకుల్లో ఒకరిగా నిలిచారు. ఇక ఇప్పుడు తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంకు వ్యూహ కర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ అనూహ్యంగా రజనీకాంత్‌, ప్రశాంత్‌ను కలవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే రాజకీయాల్లో రజనీతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. కమల్ పలుమార్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరు కలిసి పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.