Rains In South India: మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక.. దక్షిణాది రాష్ట్రాలన్నీ అప్రమత్తం

Rains In South India: తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటకల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. వారం రోజుల కిందట మొదలైన ఈ అకాల వర్షం ఈనెల 22 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. దక్షిణాది రాష్ట్రాలన్నీ అప్రమత్తం అయ్యాయి.

Rains In South India: మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక.. దక్షిణాది రాష్ట్రాలన్నీ అప్రమత్తం
Southern India Rains
Follow us
Surya Kala

|

Updated on: May 19, 2022 | 12:04 PM

Rains In South India: రుతుపవనాలు రాకముందే భారీ దక్షిణాదిన కుండపోత కష్టాలు తప్పడం లేదు. నడి వేసవిలో కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించిపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటకల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. వారం రోజుల కిందట మొదలైన ఈ అకాల వర్షం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు.

కేరళ: గతంలో పెను తుపానుతో తల్లడిల్లిపోయిన కేరళ రాష్ట్రాన్ని మరోసారి బెదరగొడుతోంది వర్ష బీభత్సం. కన్నూర్, కాసరగోడ్… మొత్తం నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. కొల్లాం, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్. వాయనాడ్ జిల్లాలల్లో IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో భారీ వర్షాలకు కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జనావాసాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వరద పరిస్థితిని సమీక్షించి, సత్వరమే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అమలు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు కేరళ సీఎం పినరయి విజయన్. ఆదివారం వరకూ భారీవర్షం కురిసే అవకాశం ఉండడంతో యుద్ధప్రాతిపదికన చర్యలు మొదలయ్యాయి.

కర్నాటక: దక్షిణ కన్నడ ప్రాంతాన్ని పూర్తిగా తడిపేసింది భారీవర్షం. ఉరుములు మెరుపులతో దద్దరిల్లింది హుబ్లి. ముందు జాగ్రత్తగా స్కూళ్లకు ఒకరోజు సెలవు ప్రకటించారు. ఆరంజ్ ఎలర్ట్ జారీ చేసి… అధికారుల్ని అప్రమత్తం చేసింది కర్నాటక ప్రభుత్వం. వర్ష పీడిత ప్రాంతాల్లో పర్యటించి జనానికి భరోసానిచ్చారు సీఎం బస్వరాజ్ బొమ్మై. కుటుంబానికో ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

తమిళనాడు: కేరళ, కర్ణాటకలో కురుస్తున్న వర్షాల ప్రభావం తమిళనాడు మీద పడుతోంది. తమిళనాట కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒక్కేనక్కల్ జలపాతాలకు కావేరీ నది నుంచి వరద ముప్పు పొంచివుంది. వాటర్‌ ఫాల్స్‌ వద్దకు పర్యాటకులు ప్రవేశించకుండా నిషేధం విధించారు స్థానిక అధికారులు. కుట్రాలం జలపాతాలను పూర్తిగా మూసివేశారు. తమిళనాడులో కూడా వాన దెబ్బ మామూలుగా లేదు. సరిహద్దు జిల్లాలైన ఈరోడ్, సేలం, నామక్కల్‌లో భారీ వర్షం కురుస్తోంది. వాన నీళ్లు రోడ్ల మీద నుంచి ఇళ్లలోకి చేరి.. జనం అవస్థలు పడుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం పడవల్లో ప్రయాణించాల్సి వస్తోంది.

ఆంధ్రప్రదేశ్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు దంచి కొట్టాయి. మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని స్థాయిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ప్యాపిలి మండలం చంద్ర పల్లి, సిద్ధన గట్టు, హుసేనాపురం, నల్లమేకల పల్లె గ్రామాల్లో పంటపొలాలు నీటి మునిగాయి. చెరువులు-వాగులు-వంకలు పొంగి పొర్లుతున్నాయి. గాలివానకు అరటి పంట నేలమట్టమైంది. అర్ధరాత్రి మొదలైన కుండపోత కర్నూలు జిల్లాను అతలాకుతలం చేసింది. తెల్లవారేసరికి ఎక్కడ చూసినా విధ్వంసం లాంటి వాతావరణమే కనిపించింది. విద్యుత్ స్తంభాలు తెగి పడటంతో రాత్రంతా కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. హోళగుందలో పిడుగుపాటుకి తండ్రి కొడుకులు మృతి చెందారు.

ఈనెల 22 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. సో… మరో ముూడురోజుల పాటు టెన్షన్ తప్పేలా లేదు. అందుకే… దక్షిణాది రాష్ట్రాలన్నీ అప్రమత్తం అయ్యాయి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ ఎలర్ట్ అయింది. తీరప్రాంతంలో మత్యకారుల్ని అప్రమత్తం చేశారు అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..