Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో వారం రోజుల ముందుగానే అడుగుపెట్టనున్న నైరుతి రుతుపవనాలు
సాధారణంగా తెలంగాణలో రుతుపవనాలు జూన్ 12న ప్రారంభమవుతాయి. ఈ ఏడాది దాదాపు ఒక వారం ముందుగానే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని హైదరాబాద్ భారత వాతావరణ శాఖ పేర్కొంది.
Telangana: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి జూన్ 10వ తేదీలోపు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈనెల 21వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కాగా బుధవారం నాడు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. కేరళలో మే 27 న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపారు. ఇక జూన్ మొదటి వారం నాటికి వేసవి ఎండలు తగ్గుతాయని.. ఉష్ణోగ్రతలు నెమ్మదిస్తాయని అధికారి తెలిపారు.
ఇప్పటికే బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో మొత్తం అండమాన్, నికోబార్ దీవులు తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయి. ఇక తూర్పు, మధ్య బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర – దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి కర్నాటక మీదుగా ఉత్తర కేరళ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉందన్నారు. దీంతో రాగల 24 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని.. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు దాని సాధారణ తేదీ అయిన జూన్ 1 కంటే ముందుగానే రావడానికి అసని తుఫాను అవశేషాల ప్రభావమే కారణమని వాతావరణ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా తెలంగాణలో రుతుపవనాలు జూన్ 12న ప్రారంభమవుతాయి. ఈ ఏడాది దాదాపు ఒక వారం ముందుగానే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు వాతావరణంలో వస్తున్న మార్పులతో పాటు నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలు కావడంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి ఉపశమనం కలిగించింది. పలు జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..