Superman Stunt: బాలుడి ప్రాణాలు తీసిన ‘సూపర్ మ్యాన్’ స్టంట్.. చుట్టూ చెల్లెళ్లు ఉన్నా..
Superman Stunt: నోయిడాలో దారుణం జరిగింది. సూపర్ మ్యాన్ లా స్టంట్ చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు ఓ బాలుడు. గత కొంతకాలంగా సోషల్ మీడియా
Superman Stunt: నోయిడాలో దారుణం జరిగింది. సూపర్ మ్యాన్ లా స్టంట్ చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు ఓ బాలుడు. గత కొంతకాలంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వీడియో షేరింగ్ యాప్‌ల హవా బాగా పెరిగిపోయింది. వినూత్న ప్రయోగాలతో రీల్స్ చేయడం, స్టంట్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. చాలా మందిలో ఈ పిచ్చి రాను రాను మరింత ముదిరిపోతుంది. తెల్లారి లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు రీల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు, కూలీ పని చేసుకునే వారి నుంచి ప్రభుత్వ అధికారుల వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది. ఈ ట్రెండ్ కారణంగా అబంశుభం తెలియని 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
నోయిడా నగరంలోని పార్థాల గ్రామంలో 12 ఏళ్ల బాలుడు సుర్జీత్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడం కోసం ‘సూపర్ మ్యాన్’ స్టంట్ చేశాడు. ఈ స్టంట్ సమయంలో అతనితో పాటు నలుగురు చెల్లెళ్లు కూడా ఉన్నారు. ఒకరు మొబైల్‌లో వీడియో తీస్తుండగా.. మరో ఇద్దరు నిల్చున్నారు. అయితే, సుర్జీత్ తాను కూర్చున్న చెక్క బల్ల నుంచి కిందకు దూకుతూ.. కామిక్ బుక్ సూపర్ హీరోని అనుకరించేందుకు కేప్ లాగా అతని మెడకు గుడ్డ కట్టుకున్నాడు. అయితే, స్టంట్ చేసే క్రమంలో చిన్న పొరపాటు జరగడంతో.. ఆ క్లాత్ మెడకు బిగుసుకుపోయి ఉరి పడింది. అది గమనించకుండా.. మిగతా చెల్లెళ్లు అతన్ని వీడియో తీస్తూనే ఉన్నారు. కాసేపటి తరువాత అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో భయపడిపోయారు. విషయాన్ని పేరెంట్స్‌కు తెలియజేయగా.. వారు వచ్చారు. అయితే, అప్పటికే బాలుడు చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో పిల్లలు ఏం చేస్తున్నారు? వారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది కాస్త గమనిస్తూ ఉండాలని పిల్లల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పోలీసులు.