Delimitation: నేడే తమిళనాడులో డీలిమిటేషన్‌పై మీటింగ్! తెలంగాణ నుంచి ఎవరెవరు వెళ్లారంటే..?
చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశం దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా ఏకతాన్ని చూపుతుంది. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ సీఎంలు, ఇతర పార్టీ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వారు ఒక ఉమ్మడి వ్యూహం రచించే అవకాశం ఉంది.

డీలిమిటేషన్‌పై సౌత్ ఏకం కాబోతోందా? తమిళనాడు సీఎం స్టాలిన్ అందరిని ఒక్కతాటిపై తెస్తారా? కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాలు దండెత్తబోతున్నాయా? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై ఇవాళ చెన్నై వేదికగా డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. ఈ భేటీకి సౌత్ నుంచి 20కి పైగా పార్టీల నేతలు, పలువురు సీఎంలు హాజరుకానున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు చెన్నైలో ల్యాండయ్యారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి మొత్తం 24 మంది నేతలు మీటింగ్ హాజరుకానున్నట్లు తెలిపింది డీఎంకే. కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక కాంగ్రెస్ నుంచి డీకే శివకుమార్, రాజేంద్ర చోళన్, పొనన్నతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే చెన్నై చేరుకున్నారు.
బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, వినోద్ కూడా చెన్నైలో ల్యాండయ్యారు. ఇక ఆప్ తరుపున పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, సంజయ్ సింగ్. ఒడిశాలోని బీజేడీ నుంచి ఇద్దరు నేతలు, కాంగ్రెస్ నుంచి ఒకరు, అలాగే కేరళ కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు లీడర్లు, సీపీఐ తరుపున వినయ్ విశ్వం అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారంటూ ఇప్పటికే డీఎంకే కన్ఫామ్ చేసింది. అలాగే పంజాబ్‌లోని శిరోమణి అకాలీదల్ పార్టీ నుంచి మరో ఇద్దరు కీలక నేతలు కూడా మీటింగ్ వస్తున్నట్లు డీఎంకే నేతలు తెలిపారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా బలంగా గొంతు వినిపించేందుకు కలిసి రావాలని దక్షిణాది రాష్ట్రాల పార్టీలను గతకొన్ని రోజులుగా డీఎంకే ఆహ్వానిస్తోంది. చెన్నైలో అన్ని పార్టీలు చర్చించి డీలిమిటేషన్‌పై నిర్ణయం తీసుకుందామని ఉత్తరాల ద్వారా కూడా ఆహ్వానాలు పంపారు సీఎం స్టాలిన్.
అంతేకాదు… సౌత్‌లోని దాదాపు అన్ని రాష్ట్రాలకు డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లి నేతలను స్వయంగా పిలిచారు. దీంతో డీలిమిటేషన్‌పై సౌత్ పొలిటికల్ సినిమా చెన్నైకి మారింది. నేతలంతా మీటింగ్ కోసం ఒకరి తర్వాత ఒకరు చెన్నై చేరుకుంటున్నారు. డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్, కేంద్ర ప్రతిపాదనల ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా డీలిమిటేషన్ కసరత్తును బహిరంగంగానే విమర్శించారు. ఈ క్రమంలోనే.. చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశంలో డీలిమిటేషన్‌పై ఆయా పార్టీల నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? కేంద్రంపై పోరుకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
కేటీఆర్ రియాక్షన్..
ఒక భారతీయుడిగా దేశం ఎదుగుతున్న తరుణంలో చాలా గర్వపడుతున్నాం.. కానీ, జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తామంటే ఎలా అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. డీలిమిటేషన్‌పై తమిళనాడులో డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో శనివారం(మార్చ్ 22) జరగబోయే పలు పార్టీల మీటింగ్‌కి ముందు కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. “ఒక భారతీయుడిగా దేశం ఎదుగుతున్న తరుణంలో చాలా గర్వపడుతున్నాం. 2.8 శాతం జనాభా ఉన్న తెలంగాణలో జీడీజీ వృద్ధి గొప్పగా ఉంది. జనాభా నియంత్రణ విషయంలో మంచి ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు అన్యాయం చేస్తామని అంటే ఎలా? జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. బీజేపీ నినాదం డబుల్ ఇంజన్ డెవలప్మెంట్ అంటోంది. మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలకి తప్ప నిధులు ఇవ్వం అనే ధోరణితో వ్యవహరిస్తోంది.
రేపటి సమావేశంలో ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయో చూస్తాం. ఆ తర్వాత కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జనాభా ప్రాతిపదికన ఇలాంటి అన్యాయం చేస్తామనడం సరైంది కాదు.” అని కేటీఆర్ అన్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అఖిల పక్షం సమావేశానికి వెళ్లడం వల్ల ఉపయోగం ఏంటి? కాంగ్రెస్ చేతిలో ఏముందని వెళ్ళాలి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాకు శత్రువు కాదు. బీసీల అంశంలో అందులో లొసుగులు ఉన్నా మద్దతు ఇచ్చాం. భావ స్వారూప్యత ఉన్న అంశాల్లో మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రేపటి రోజున ఏం జరుగుతుందో ఇప్పుడే ఎలా చెప్పగలం. భవిష్యత్ లో కేసీఆర్ జాతీయ రాజకేయల్లో ముఖ్య భూమిక పోషించే అవకాశం లేకపోలేదు అని పేర్కొన్నారు. పార్లమెంట్ పునర్విభజన అంశంలో అన్యాయం జరగదని బీజేపీ డైలాగులు చెబితే సరిపోదని, చట్టంలో చెప్పాలని డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.