“జ్వాలా సూర్యగ్రహణం” ఎప్పుడు..? ఎక్కడ..? ఎలా..?
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం 21న ఏర్పడనుంది. గత ఏడాదిలో చివరిసారి డిసెంబర్‌లో సూర్యగ్రహణం ఏర్పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజలు దీన్ని చూసేందుకు వీలుంది.
Solar Eclipse 2020 : ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం 21న ఏర్పడనుంది. గత ఏడాదిలో చివరిసారి డిసెంబర్‌లో సూర్యగ్రహణం ఏర్పడింది. మన దేశంతోపాటు ఆసియా, ఆఫ్రికా ఖండాలు, పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించనున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజలు దీన్ని చూసేందుకు వీలుంది. డైరెక్టుగా కాకుండా… ప్రత్యేక పరికరాల్ని ఉపయోగించి దీన్ని చూడొచ్చు.
సూర్యగ్రహణ ప్రత్యేకతలు…
దీనికి ఓ ప్రత్యేకత ఉంది. గగనతలంలో వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఖగోళ పరిణామం ఫలితంగా ఏర్పడే “జ్వాలా వలయం” కనువిందు చేయనుంది. సూర్యుడికి, భూమికి మధ్యలోకి పూర్తిగా చంద్రుడు వస్తే “సంపూర్ణ సూర్యగ్రహణం”. కొంతమేర వస్తే “పాక్షిక సూర్యగ్రహణం”గా పిలుస్తారు. అయితే సూర్యుడి కేంద్ర భాగానికి మాత్రమే చంద్రుడు అడ్డుగా రావడంతో “వలయాకార సూర్యగ్రహణం” ఏర్పడుతుంది. ఒక్కోసారి ఒక సెకను కంటే తక్కువ కాలంలోనే “జ్వాలా వలయం” మాయమవుతుంది.
కానీ, కొన్నిసార్లు 12 నిమిషాల వరకూ ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదిలావుంటే.. భారత్‌లో సూర్యగ్రహణం 21న ఉదయం 9:15కు ప్రారంభమై, మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషాలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 12:10 గంటలకు గరిష్ఠ స్థితిలో ఉంటుంది.
తెలంగాణలో గ్రహణ సమయం…
తెలంగాణలో ఉదయం 10.14కి మొదలవుతుంది. ఉదయం 11.55కి చంద్రుడు సరిగ్గా భూమికి, సూర్యుడికి మధ్యకు వస్తుంది. దీనిని గ్రహణ మధ్యకాలం అంటారు. ఆ తర్వాత గ్రహణం వీడిపోతూ… మధ్యాహ్నం 1.44కి పూర్తిగా తొలగిపోతుంది. అంటే మొత్తం మూడున్నర గంటలపాటూ గ్రహణం ఉండనుంది.
తెలంగాణలో…
గ్రహణ ఆరంభకాలం : ఉదయం 10.14 గ్రహణ మధ్యకాలం : ఉదయం 11.55 గ్రహణ అంత్యకాలం : మధ్యాహ్నం 1.44 గ్రహణ ఆద్యాంత కాలం 3 గంటల 30 నిమిషాలు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రహణ సమయం…
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 21 ఉదయం 10.23కి గ్రహణం మొదలవుతుంది. మధ్యాహ్నం 12.05కి చంద్రుడు సరిగ్గా భూమికి, సూర్యుడికి మధ్యకు వస్తుంది. ఆ తర్వాత గ్రహణం వీడిపోతూ మధ్యహ్నం 1.51కి పూర్తిగా తొలగిపోతుంది. అంటే దాదాపు మూడున్నర గంటలపాటూ గ్రహణం ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో…
గ్రహణ ఆరంభకాలం : ఉదయం 10.23 గ్రహణ మధ్యకాలం : మధ్యాహ్నం 12.05 గ్రహణ అంత్యకాలం : మధ్యాహ్నం 1.51 గ్రహణ ఆద్యాంత కాలం 3 గంటల 28 నిమిషాలు
ఈ జ్వాలా వలయాన్ని సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్‌లతో మాత్రమే చూడాలని ఖగోళ పరిశోధకులు తెలిపారు. దీన్ని మొబైల్‌తో ఫొటోలు తీయవద్దని హెచ్చరించారు. సూర్యగ్రహణాన్ని ఫొటోలు, వీడియోలూ తియ్యాలంటే… ప్రతేక సోలార్ ఫిల్టర్ అవసరం ఉంటుందన్నారు.