Maharashtra: షిండే వర్గానికే శివసేన సొంతం.. స్పష్టం చేసిన ఈసీ.. పూర్తి వివరాలివే..

శివసేన అధికార పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తు సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని వర్గానికే చెందుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం..

Maharashtra: షిండే వర్గానికే శివసేన సొంతం.. స్పష్టం చేసిన ఈసీ.. పూర్తి వివరాలివే..
Shinde Faction To Get Shiv Sena Name, Bow Arrow Symbol
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 17, 2023 | 8:46 PM

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన అధికార పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తు సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని వర్గానికే చెందుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం(ఫిబ్రవరి 17) తెలిపింది. రాజకీయ పార్టీల రాజ్యాంగం ప్రకారం ఆఫీస్ బేరర్ల పోస్టులకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని పేర్కొంది. అంతర్గత వివాదాల పరిష్కారానికి న్యాయమైన విధానాన్ని అనుసరించాలని సూచించింది. సంస్థాగత సభ్యుల మద్దతును నిర్ధారించిన తర్వాత మాత్రమే పార్టీ రాజ్యాంగాన్ని సవరించాలని పేర్కొంది. షిండే వర్గానికి పెద్ద ఎత్తున సభ్యుల మద్దతు ఉన్నందున శివసేన అధికార పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తు హక్కులు ఆ వర్గానికే చెందుతాయని స్పష్టం చేసింది. ఉద్ధవ్‌ ఠాక్రే, శివసేన రెబల్‌ వర్గం మధ్య గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ వివాదానికి ఈ మేరకు ఈసీ ముగింపు పలికింది.

ఈ తరుణంలో ఈసీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు మహారాష్ట్ర సీఎం, శివసేన పార్టీ అధినేత ఏక్‌నాథ్‌ షిండే. ఇంకా ఇది వేలాదిమంది శివసేన కార్యకర్తల విజయమన్నారు. మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన కార్యకర్తలు, షిండే వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కేంద్రం కార్యాలయం సహా, పలుజిల్లాలో బాణాసంచా పేల్చి కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. ‘మాదే అసలైన శివసేన’ అంటూ నినాదాలు చేశారు. అయితే ప్రజల నమ్మకాన్ని ఈసీ కోల్పోయిందని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. ఈసీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేస్తామని చెప్పారు.

కాగా, మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడి కూటమిని వ్యతిరేకిస్తూ.. గతేడాది జూన్‌లో కొందరు ఎమ్మెల్యేలతో శివసేన నుంచి బయటకు వచ్చేశారు ఏక్‌నాథ్‌ షిండే. ఆ క్రమంలో బీజేపీ సాయంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే రాష్ట్రానికి సీఎంగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ తరుణంలో థాక్రే వర్గం, షిండే వర్గం సిసలైన శివసేన గుర్తింపు కోసం న్యాయ పోరాటానికి దిగాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం.. శివసేనపార్టీ పేరును, పార్టీ గుర్తైన విల్లు బాణంను పక్కనపెట్టి మరీ ఇరు వర్గాలకు ప్రత్యేక పేర్లు, గుర్తులను కేటాయించింది. అయితే ఈసీ నిర్ణయంపై థాక్రే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..