శశి థరూర్ కాంగ్రెస్ వీడుతున్నారా..? మరైతే ఆయన పయనమెటు?
పరాజయం అన్నదే లేకుండా తిరువనంతపురం ఎంపీగా వరుసుగా గెలుస్తూ వచ్చిన శశి థరూర్ (Shashi Tharoor).. ప్రస్తుతం ఎంపీగానే కాదు, విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా కాంగ్రెస్ థరూర్‌ను పార్టీ వ్యవహారాలకు దూరం పెట్టింది. దీనిపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కలకలం సృష్టించాయి.

రాజకీయాల్లో కొందరు తమ వ్యవహారశైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తూ కొందరు గుర్తింపు తెచ్చుకుంటే.. ప్రత్యర్థులైనప్పటికీ వారు చేసిన పనులు నచ్చి మెచ్చుకుంటూ మరికొందరు వార్తల్లో నిలుస్తుంటారు. రెండో కోవలోకి చెందినవారిలో కాంగ్రెస్ నేత శశి థరూర్ ముందు వరుసలో నిలుస్తారు. రాజకీయాల్లో సాధారణంగా ఏ పార్టీ నేత కూడా ప్రత్యర్థులను ప్రసంసించేందుకు ఇష్టపడరు. ప్రత్యర్థులు ఎంత మంచి చేసినా సరే.. అందులో లోపాలు వెతికి విమర్శించేందుకే చూస్తుంటారు. ఒకవేళ విమర్శించేందుకు ఏదీ దొరక్కపోతే మౌనాన్ని ఆశ్రయిస్తారు తప్ప ప్రత్యర్థులను మెచ్చుకోడానికి మనసు రాదు. అలా మెచ్చుకుంటే తమ సొంత పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావిస్తారు. అయితే శశి థరూర్ ఇందుకు భిన్నం. ఆయన అంశాన్ని బట్టి ఆయన స్పందించే తీరు మారుతుంటుంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయం లేదా అనుసరిస్తున్న విధానం బావుంది అనుకుంటే మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెబుతారు. ఒకవేళ బాగోలేదు అనుకుంటే అదే విషయాన్ని పదునైన విమర్శలతో వెలిబుచ్చుతుంటారు. ఈ వైఖరి కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి మింగుడు పడడం లేదు. అందుకే కొన్నాళ్లుగా ఆయన సేవలను పార్టీ వినియోగించుకోకుండా దూరం పెట్టింది.
నా సేవలు వాడుకుంటారా లేదా.. నా పనులు నాకున్నాయి!
యునైటెడ్ కింగ్‌డమ్ (UK) రాజధాని ‘లండన్’లో పుట్టి, భారత ఆర్థిక రాజధాని ‘ముంబై’లో పెరిగిన శశి థరూర్ పేరొందిన విద్యావేత్త. కేవలం 22 ఏళ్ల పిన్న ప్రాయంలో “అంతర్జాతీయ సంబంధాలు, వ్యవహారాలు” అనే అంశంపై థరూర్ డాక్టరేట్ అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి (United Nations)లో తన కెరీర్ ప్రారంభించిన థరూర్.. 2001 నాటికి అండర్ సెక్రటరీ జనరల్ ర్యాంకుకు ఎదిగారు. 2006లో తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన థరూర్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో తొలిసారిగా తిరువనంతపురం (కేరళ) నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. ఆ తర్వాత వరుసగా 2014, 2019, 2024లోనూ గెలుపొందుతూ వచ్చారు.
పరాజయం అన్నదే లేకుండా వరుసుగా గెలుస్తూ వచ్చిన ఆయన ప్రస్తుతం ఎంపీగానే కాదు, విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా కాంగ్రెస్ థరూర్‌ను పార్టీ వ్యవహారాలకు దూరం పెట్టింది. దీనిపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపునకు చెందిన మలయాళ పోర్టర్ ‘వర్తమానం’కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. “పార్టీ నన్ను కోరుకుంటే నేను పార్టీకి అండగా ఉంటాను. లేకపోతే, నాకు నా సొంత పనులు ఉన్నాయి. నాకు వేరే ప్రత్యామ్నాయాలు లేవని అనుకోవద్దు. నా ఆప్షన్స్ నాకున్నాయి. నా పుస్తకాలు, ప్రసంగాలు, చర్చల కోసం ప్రపంచం నలుమూలల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను వ్యక్తపరిచిన విధానం వల్ల కాంగ్రెస్‌ను వ్యతిరేకించే వారి ఓట్లు సైతం తనకు లభించాయని ఆయన అన్నారు. “నేను అమెరికాలో బాగానే ఉన్నాను. డబ్బు కూడా బాగా సంపాదిస్తున్నాను. కానీ నేను ఈ దేశానికి సేవ చేయడానికి తిరిగి వచ్చాను” అంటూ ఆయన రాజకీయ ప్రవేశం గురించి గుర్తుచేశారు.
ఇంతకీ థరూర్ ఏమన్నారంటే?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులు మిత్రులే అయినప్పటికీ.. కేరళలో మాత్రం రాజకీయ ప్రత్యర్థులు అన్న విషయం అందరికీ తెలిసిందే. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) పేరుతో 1980ల నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా కొనసాగుతూ అనేక పర్యాయాలు గెలుపొంది అధికారాన్ని చేపట్టింది. అలా 2016లో గెలిచిన LDF, 2021 ఎన్నికల్లోనూ మరోసారి గెలిచి అధికారాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అలాంటి ప్రత్యర్థిపై శశి థరూర్ ఈ మధ్య ప్రశంసల జల్లు కురిపించారు. కేరళలో LDF ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు బావున్నాయని థరూర్ మెచ్చుకోవడం వివాదం చెలరేగింది. వామపక్షాలు ఆయన వ్యాఖ్యలను స్వాగతించాయి, కానీ ఆయన సొంత శిబిరం నుంచి మాత్రం నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షానికి చెందిన ఓ పత్రిక తన సంపాదకీయంలో థరూర్ వ్యవహారశైలి పార్టీని బలహీనపరిచే చర్యగా.. పార్టీకి ఆత్మహత్యాయత్నంగా అభివర్ణించింది.
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీ కలవడంపై కూడా శశి థరూర్ ప్రశంసిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనిపై కూడా ఆయన కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. థరూర్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. “గత వారం తాను స్టార్టప్ రంగంలో రాష్ట్ర పురోగతిని హైలైట్ చేశాను. అలాగే భారతదేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ట్రంప్-మోదీ భేటీ గురించి నా అభిప్రాయం వ్యక్తం చేశాను. అనునిత్యం పార్టీ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడమంటే కష్టం” అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిపై తన భావాలను వ్యక్తీకరించే హక్కును ప్రజలు సమర్థించారని ఆయన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అన్నారు.
ఈ ఓటు బ్యాంకుతో అధికారం కష్టం
ప్రత్యర్థి పార్టీల పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించడంతో పాటు సొంత పార్టీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పునరుజ్జీవం దిశగా ఫలితాలు వచ్చాయని, కానీ ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో అది ప్రతిబింబించలేదని థరూర్ అన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో కాంగ్రెస్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలను విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. లేదంటే వరుసగా మూడవసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని హితవు పలికారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి 19% ఓటర్ల మద్దతు మాత్రమే ఉందని, ఈ ఓటు బ్యాంకుతో దేశంలో అధికారంలోకి రావడం సాధ్యం కాదని థరూర్ ఘాటు విమర్శలు చేశారు. దీనికి అదనంగా మరో 26-27 శాతం ఓట్లు సాధించినప్పుడే అధికారం సాధ్యమని సూత్రీకరించారు. గత దశాబ్దకాలగా కాంగ్రెస్ పార్టీకి దూరమైన వర్గాల మద్దతు కూడగట్టుకోవడం చాలా అవసరమని తెలిపారు. మొత్తమ్మీద శశి థరూర్ వ్యాఖ్యలు రాజకీయ, మీడియా వర్గాల్లో విపరీతార్థాలకు కారణమయ్యాయి. ఆయన పార్టీని వీడాలని కోరుకుంటున్నారని, అందుకే ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చర్చ జరుగుతోంది.




