CETs 2026: ఇకపై సెట్స్ ప్రవేశ పరీక్షలకు.. ఆధార్, ఆపార్ ఐడీ తప్పనిసరి!
రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CET) సెల్ 2026 కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి జరిగే అన్ని CET పరీక్షలకు ఆధార్ కార్డు, APAAR ID (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ)ని తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రకటించింది. వీటిలో MHT-CET కూడా ఉంది. దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులను..

మహారాష్ట్ర రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CET) సెల్ 2026 కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి జరిగే అన్ని CET పరీక్షలకు ఆధార్ కార్డు, APAAR ID (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ)ని తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రకటించింది. వీటిలో MHT-CET కూడా ఉంది. దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులను నివారించడానికి విద్యార్థులు అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే అప్‌డేట్ చేసుకోవాలని CET కమిషనర్ దిలీప్ సర్దేశాయ్ వెల్లడించారు.
కాగా మహారాష్ట్ర CET 2026 పరీక్షల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ లో ప్రారంభమవుతుంది. అంతకంటే ముందుగానే అభ్యర్థులు తమ ఆధార్ (UIDAI) కార్డును తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకుని ఉండాలి. అభ్యర్దుల పేరు, పుట్టిన తేదీ, ఫోటోగ్రాఫ్, చిరునామా, తండ్రి పేరు, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు అన్నీ అప్‌డేట్ చేసుకోవాలి. ఈ వివరాలన్నీ 10వ తరగతి సర్టిఫికెట్‌లోని వివరాలతో తప్పనిసరిగా సరిపోలాలని CET కమిషనర్ దిలీప్ సర్దేశాయ్ పేర్కొంది. అలాగే ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉండాలి.
ఆధార్‌తో పాటు అభ్యర్థులు, విద్యార్ధుల విద్యా రికార్డులను నిర్వహించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన 12-అంకెల విద్యా గుర్తింపు సంఖ్య APAAR IDని కూడా సమర్పించాల్సి ఉంటుంది. CET 2026 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరికీ APAAR ID తప్పనిసరి అని CET సెల్ స్పష్టం చేసింది. వికలాంగుల (PwDs) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వైకల్య ధృవీకరణ పత్రాన్ని లేదా అందుబాటులో ఉన్న ప్రత్యేక వైకల్య ID (UDID) కార్డును సమర్పించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు వికలాంగ అభ్యర్థులు UDID కార్డును దరఖాస్తుకు ముందుగానే తీసుకుని ఉండాలని వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




