ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
IAS Officer: ఐఏఎస్ కావాలన్నది లక్షల మంది కల. కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఐఏఎస్ అవ్వడం వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఐఏఎస్ జీవితం కేవలం హోదా, గౌరవం మాత్రమే కాదు, అపారమైన కష్టం, త్యాగాలతో కూడుకున్నది. పని వేళలకు పరిమితి లేని ఈ వృత్తిలో అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అయితే వారి జీతం ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో అత్యున్నతమైన సర్వీసుగా భావించే ఐఏఎస్ అధికారి కావడం అనేది లక్షలాది మంది యువత కల. చుట్టూ అధికారులు, అంగరక్షకులు, సమాజంలో గౌరవం.. ఇవన్నీ బయట ప్రపంచానికి కనిపించే హోదా. కానీ ఈ గౌరవం వెనుక ఒక ఐఏఎస్ అధికారి పడే కష్టం, వారు చేసే త్యాగం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. చాలా ప్రభుత్వ ఉద్యోగాలు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. కానీ ఐఏఎస్ అధికారికి పనివేళలు అనేవి ఉండవు. ఇది 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత.
సాధారణ రోజులు
సాధారణంగా ఉదయం 9 లేదా 10 గంటలకు ప్రారంభమయ్యే ఆఫీస్ పని రాత్రి 8 లేదా 9 గంటల వరకు కొనసాగుతుంది. రోజుకు సగటున 10 నుండి 12 గంటలు వారు ఫైళ్లు చూడటం, సమీక్ష సమావేశాలు నిర్వహించడం, క్షేత్రస్థాయి తనిఖీల్లో గడుపుతారు. వరదలు, అల్లర్లు, ఎన్నికలు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు పని గంటలకు పరిమితి ఉండదు. వారాల తరబడి నిద్రలేకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. అర్ధరాత్రి ఫోన్ కాల్ వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.
వేతనం – ఇతర అలవెన్సులు
ప్రస్తుతం ఐఏఎస్ అధికారుల జీతం ఏడవ వేతన సంఘం ప్రకారం నిర్ణయిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త అధికారికి ప్రాథమిక జీతం నెలకు రూ. 56,100 గా ఉంటుంది. అనుభవం, ప్రమోషన్ బట్టి ఇది రూ.1,77,000 వరకు ఉంటుంది. అయితే సీనియారిటీ పెరిగే కొద్దీ వేతనం పెరుగుతుంది. క్యాబినెట్ సెక్రటరీ వంటి అత్యున్నత స్థాయికి చేరుకుంటే నెలకు రూ. 2,50,000 వరకు జీతం ఉంటుంది. ప్రాథమిక జీతంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ వంటివి లభిస్తాయి. ఉచిత నివాసం, వాహనం, తోటమాలి, వంటమనిషి, సెక్యూరిటీ గార్డులు వంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది.
చదువుకోవడానికి ప్రత్యేక సెలవులు
ఐఏఎస్ అధికారులకు ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంది. సీనియారిటీ ఆధారంగా వారు దేశంలో లేదా విదేశాలలో ఉన్నత చదువులు అభ్యసించడానికి 2 సంవత్సరాల వరకు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. అయితే జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం కేటాయించిన 30 రోజుల ఆర్జిత సెలవులను కూడా వారు పూర్తిగా వాడుకోలేరు. పరిపాలనా అత్యవసరాల దృష్ట్యా వ్యక్తిగత సెలవులను రద్దు చేసుకుని ప్రజల కోసం పని చేయాల్సి రావడం ఐఏఎస్ వృత్తిలో సాధారణ విషయం.




