కుంభమేళాకు వెళ్లిన మహిళ.. లాడ్జ్‌లో శవమైంది! సినిమా స్టోరీని మించి..
కుంభమేళాకు వెళ్లిన ఢిల్లీ దంపతులు త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత, లాడ్జ్‌లో భార్యను చంపి, ఆమె తప్పిపోయిందని నటిస్తూ కుమారుడికి ఫోన్ చేశాడు. కానీ కొడుకు తల్లిని వెతుకుతూ ఆమె మృతదేహాన్ని మార్చురీలో గుర్తించాడు. పోలీసుల విచారణలో భర్త తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇతర స్త్రీతో సంబంధం కారణంగా ఈ హత్య జరిగింది.

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు పొటెత్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే చేసిన పాపాలు పోతాయనే నమ్మకంతో కొన్ని కోట్ల మంది కుంభమేళాకు వెళ్లారు. అలాగే ఢిల్లీకి చెందిన అశోక్ బల్మికి, మీనాక్షి దంపతులు కూడా కుంభమేళాకు వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు ముందు భార్యభర్తలు ఫోన్లో ఫొటోలు కూడా దిగారు. వాటిని భర్త అశోక్ తన సోషల్ మీడియా అకౌంట్లలో కూడా పోస్ట్ చేశాడు. స్నానం చేసిన తర్వాత ఇద్దరూ దగ్గర్లోని ఓ లాడ్జ్‌లో రూమ్ తీసుకొని రాత్రికి అక్కడే బస చేశారు. ఉదయం బయటికి వచ్చిన తర్వాత అశోక్ తన పిల్లలకు ఫోన్ చేసి.. మీ అమ్మ కనిపించడం లేదని, కుంభమేళాలో తప్పిపోయిందని ఫోన్ చేసి చెప్పాడు.
ఈ వార్త విన్న వింటనే అతని కొడుకు తన తల్లిని ఎలాగైనా వెతకాలని కుంభమేళాకు వచ్చాడు. తల్లి ఫోటో పట్టుకొని కుంభమేళాలో తిరిగాడు. చివరికి ఝాన్సీ పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లాడు. తన తల్లి కుంభమేలాలో తప్పిపోయిందని, ఆమె ఫోటో ఇదే అంటూ చూపించాడు. ఆ ఫోటో చూసిన పోలీసులు ఆ కుర్రాడిని తీసుకొని.. దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ మార్చరీలో ఓ మహిళ శవం ఆ కుర్రాడికి చూపించారు. అంతే ఆ కుర్రాడి గుండె పగిలిపోయింది. మార్చురీలో పడి ఉన్న శవం మా అమ్మదే అంటూ ఆ కుర్రాడు దిక్కులుపిక్కటిల్లేలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతన్ని ఓదార్చిన పోలీసులు. ఆ మహిళ ఎలా చనిపోయిందో చెప్పారు. దగ్గరల్లోని ఓ లాడ్జ్ బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉండగా, ఆ లాడ్జ్ నిర్వాహకులు తమకు సమాచారం ఇస్తే.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు మృతురాలి కుమారుడికి చెప్పారు.
అదేంటి మా అమ్మ కుంభమేళాలో తప్పిపోయిందని మా నాన్న ఫోన్ చేసి చెప్పాడు. ఆయన కూడా మా అమ్మను వెతుకుతున్నాడుగా అని చెప్పాడు. వెంటనే పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఫోన్ చేసి వాళ్ల నాన్న అశోక్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి నుంచి కేసు కీలక మలుపు తీసుకుంది. కుంభమేళా పరిసరాల్లో ఎక్కడెక్కడ తిరిగారు అనే వివరాలను అశోక్‌ను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. తీరా పలు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తే.. పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి.
త్రివేణి సంగమంలో స్నానాలు చేసిన తర్వాత దంపతులిద్దరూ దగ్గరల్లోని ఓ లాడ్జ్‌లోకి కలిసి వెళ్లినట్లు ఉంది. కానీ, బయటికి మాత్రం అశోక్ ఒక్కడే వచ్చినట్లు ఉంది. దీంతో పోలీసులు తమదైన స్టైల్‌లో అశోక్‌ను విచారించగా.. తన భార్యను తానే చంపినట్లు నేరం అంగీకరించాడు. ఒక ప్లాన్ ప్రకారం భార్యను బలవంతంగా కుంభమేళా తీసుకొచ్చాడు. మంచిగా ఉంటున్నట్లు నటిస్తూ.. పిల్లలకు కూడా అనుమానం రాకుండా త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న సమయంలో భార్యతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. తీరా లాడ్జ్‌కి తీసుకెళ్లి ఆమెను ఓ పదునైన ఆయుధంతో పొడిచి చంపేశాడు.
ఆ తర్వాత ఏం తెలియనట్లు పిల్లలకు ఫోన్ చేసి మీ అమ్మ తప్పిపోయిందంటూ నటించాడు. కుంభమేళా లాంటి భారీ జనం వచ్చే కార్యక్రమంలో అమ్మ తప్పిపోయిందంటే పిల్లలు నమ్మేసి, ఆమెను గురించి పట్టించుకోరేమో అనుకున్నాడు. కానీ, కొడుకు రాకతో క్రైమ్ బయటపడింది. అసలింతకీ అతను భార్యను ఎందుకు చంపాడంటే.. అతనికి మరో మహిళతో సంబంధం ఉంది, ఈ విషయమైన తరచూ భార్యభర్తల మధ్య గొడవలు అయ్యేవి. ఎలాగైనా భార్య అడ్డుతొలగించుకోవాలని అనుకున్న అశోక్ కుంభమేలా లాంటి పవిత్ర కార్యక్రమానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు.




