కోర్టు ధిక్కరణ కేసులో లాయర్ ప్రశాంత్ భూషణ్ కు చుక్కెదురు
తన కోర్టు ధిక్కరణ కేసులో ప్రొసీడింగ్స్ ని వాయిదా వేయాలని కోరుతూ ప్రముఖ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించినది. ఆయన వాదన సరి కాదని, తనకు పడే శిక్షను మరో బెంచ్ విచారించాలన్న..
తన కోర్టు ధిక్కరణ కేసులో ప్రొసీడింగ్స్ ని వాయిదా వేయాలని కోరుతూ ప్రముఖ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించినది. ఆయన వాదన సరి కాదని, తనకు పడే శిక్షను మరో బెంచ్ విచారించాలన్న అభ్యర్థనలో ఔచిత్యం లేదని కోర్టు పేర్కొంది. తగని పని చేయాలని మమ్మల్ని మీరు కోరుతున్నారు అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. శిక్షను వాయిదా వేయాలన్న అంశాన్ని తాము పరిశీలించడం లేదన్నారు. సుప్రీంకోర్టు పైన, చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే పైన చేసిన ట్వీట్లకు గాను ప్రశాంత్ భూషణ్ క్రిమినల్ కంటెంప్ట్ దోషి అని కోర్టు ఈ నెల 14 న తెలిపింది. అయితే రివ్యూ పిటిషన్ దాఖలు చేసేంతవరకు ప్రొసీడింగ్స్ ని వాయిదా వేయాలని ఆయన కోర్టును కోరారు. ఆయనకు ఎంతమేరకు శిక్షవిధించాలన్న అంశంపై ఆగస్టు 20 న విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
కాగా-నన్ను దోషిగా కోర్టు పేర్కొనడం బాధిస్తోందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. శిక్ష గురించి తానేమీ బాధ పడడంలేదని, కానీ తనను అపార్థం చేసుకోవడమే బాధిస్తోందని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, దాని విలువలను పరిరక్షించాలంటే బహిరంగ విమర్శలు అవసరమేనని తాను భావిస్తున్నానన్నారు. వ్యవస్థ బాగుపడాలనే ఉద్దేశంతోనే నేను ట్వీట్లు చేశాను..క్షమించాలని కోరడమంటే నా డ్యూటీని నిర్లక్ష్యం చేసినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు నుంచి తను దయా దాక్షిణ్యాలను కోరడంలేదని, కోర్టు ఏ శిక్ష విధించినా స్వాగతిస్తానని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.