Saif Ali Khan Attacked: ముంబై బ్రాండ్ దెబ్బతీయకండి.. మహారాష్ట్ర సీఎం కీలక వ్యాఖ్యలు

Saif Ali Khan Stabbed: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముంబైలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. అయితే ఈ విమర్శలను ఫడ్నవీస్ తోసిపుచ్చారు. దేశంలో అత్యంత సురక్షితమైన నగరం ముంబైగా పేర్కొన్నారు. విపక్షాలు విమర్శలను తోసిపుచ్చిన ఆయన.. ముంబై ప్రతిష్టను దిగజార్చేలా ప్రతిపక్షాలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Saif Ali Khan Attacked: ముంబై బ్రాండ్ దెబ్బతీయకండి.. మహారాష్ట్ర సీఎం కీలక వ్యాఖ్యలు
Devendra Fadnavis And Saif Ali Khan
Follow us
Janardhan Veluru

|

Updated on: Jan 16, 2025 | 6:03 PM

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యోదంతం, ఇప్పుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ప్రముఖ వ్యక్తుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల సంగతేంటని ప్రశ్నించారు. ముంబైలో శాంతి భద్రతలు దిగజారాయంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌(Devendra Fadnavis) తోసిపుచ్చారు. ముంబయి నగరం సురక్షితం కాదనడం సరికాదన్నారు. ముంబై బ్రాండ్‌ను దెబ్బతీసేలా.. ఇక్కడ శాంతి భద్రతలు క్షీణించాయని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ‘‘ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి సమాచారాన్ని ఇప్పటికే అందించారు. దీని వెనుక ఎలాంటి ఉద్దేశ్యం ఉందో కూడా చెప్పారు. నిందితులు ఎక్కడి నుంచి వచ్చారో కూడా పోలీసులు వెల్లడించారు. పోలీసులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు” అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

దేశంలో ముంబై నగరం అత్యంత సురక్షితమైన మెగాసిటీగా ఫడ్నవీస్ అభివర్ణించారు. ఒక్కోసారి కొన్ని సంఘటనలు జరుగుతాయని.. దీనిని కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరముందని అంగీకరించారు. కానీ ఆ ఘటనలను ప్రస్తావిస్తూ ముంబై నగరంలో భద్రత లేదనడం సరికాదన్నారు. ఇలాంటి ప్రచారం ముంబై ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుందన్నారు. ముంబైని మరింత సురక్షితంగా మార్చేందుకు తమ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.

సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనపై స్పందించిన సీఎం ఫడ్నవీస్

ప్రభుత్వంపై ఆదిత్య ఠాక్రే విమర్శలు

సైఫ్‌పై జరిగిన దాడి ఘటనపై శివసేన (ఉద్దవ్ వర్గం) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సైఫ్ అలీఖాన్ ఇంటిలో ఆయనపై కత్తి దాడి దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఆయనకు ప్రాణాపాయం లేదన్న వార్త ఉపశమనం కలిగించిందన్నారు. వీలైనంత త్వరగా ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ ఘటనతో మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారినట్లు తేటతెల్లం చేస్తున్నట్లు చెప్పారు. అటు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్.. సైఫ్‌పై దాడి ఘటనతో మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయని స్పష్టం చేస్తున్నాయని ఆరోపించారు.

కాగా గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఇంట్లో దాడికి గురైన సైఫ్ అలీఖాన్‌కు వెన్నెముక, మెడ, ఎడమ చేతికి గాయాలయ్యాయి. లీలావతి ఆస్పత్రిలో ఆయన సర్జరీ చేశారు. సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన ఫొటోలను ముంబై పోలీసులు విడుదల చేశారు. ఆ వ్యక్తి కోసం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.