8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కేబినెట్ ఆమోదం!
8th Pay Commission: 2025 బడ్జెట్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు గొప్ప శుభవార్త అందించింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం 53 శాతానికి పెరిగిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది..
కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే ఏడాది కానుకగా 8వ వేతన సంఘం అమలులోకి రానుంది. ఎనిమిదో వేతన కమిషన్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఉద్యోగులు ఏడవ వేతన సంఘం కింద వేతనాలు పొందేవారు. దీంతో పాటు శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష యాత్రకు ఊపునిచ్చేలా కొత్త లాంచ్ ప్యాడ్‌కు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్‌ను నిర్మించనున్నారు. ఎన్‌జీఎల్‌వీ ప్రయోగాలకు అనుగుణంగా మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎన్‌జీఎల్‌వీ ద్వారా భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
#WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, “Prime Minister has approved the 8th Central Pay Commission for all employees of Central Government…” pic.twitter.com/lrVUD25hFu
— ANI (@ANI) January 16, 2025
8వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీని కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కనీసం 2.86 శాతంగా నిర్ణయించబడుతుంది. ఇదే జరిగితే, ఉద్యోగుల కనీస బేసిక్ జీతంలో సంబంధిత పెరుగుదల ఉంటుంది. అది రూ.51,480 కావచ్చు. ప్రస్తుతం కనీస మూల వేతనం రూ.18000 కావడం గమనార్హం. దీనితో పాటు, పెన్షనర్లు కూడా అదే ప్రయోజనం పొందుతారు. అలాగే వారి కనీస పెన్షన్ ప్రస్తుతం ఉన్న రూ.9000 నుండి రూ.25,740కి పెరగవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి