Sabarimala: శబరిమల ప్రసాదం తయారీపై కేరళ హైకోర్టులో పిటిషన్.. వివరణ ఇవ్వాలంటూ ఆదేశం..
శబరిమల ఆలయంలో ప్రసాదం తయారీకి "అపవిత్రమైన హలాల్ బెల్లం" వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది...
శబరిమల ఆలయంలో ప్రసాదం తయారీకి “అపవిత్రమైన హలాల్ బెల్లం” వాడకాన్ని తక్షణమే నిలిపివేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అనిల్ K నరేంద్రన్, జస్టిస్ PG అజిత్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ రేపటిలోగౌ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ అంశంపై వెంటనే నివేదికను సమర్పించాలని శబరిమల స్పెషల్ కమిషనర్‌ను కూడా ఆదేశించింది. శబరిమల ఆలయంలో ఆచారాలు, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన శబరిమల కర్మ సమితి జనరల్ కన్వీనర్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తాను దశాబ్ద కాలంగా హిందూ సంస్థలతో కలిసి పనిచేశానని, భారత సుప్రీంకోర్టులో శబరిమల కేసు పెండింగ్‌లో ఉన్న విచారణలో తాను కూడా భాగస్వామినని పేర్కొన్నారు.
“హిందువులు భగవంతునికి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత దానిని ప్రసాదంగా తీసుకుంటారు. అది భగవంతుని పవిత్రమైన కానుకగా చూస్తారు.” అని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపించారు. శబరిమల ఆలయంలో రెండు ముఖ్యమైన ప్రసాదాలు ఉంటాయి. ఒకటి పాయసం రెండోది అప్పం. శబరిమల ప్రసాదం తయారీకి పాడైపోయిన హలాల్ బెల్లం పొడిని ఆలయ నిర్వాహకులు ఉపయోగిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
బెల్లాన్ని ఇ-టెండర్ ద్వారా బోర్డు సేకరిస్తుందని చెప్పారు. ఆహార భద్రత సంబంధించి 2011 ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలకు విరుద్ధంగా ఉందన్నారు. టెండరుదారుని కూడా ప్రాసిక్యూట్ చేయవలసి ఉంటుందని కూడా వాదించారు. వాదనలు విన్న కేరళ హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Read Also.. First Beach: 330 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన బీచ్.. ప్రపంచంలోనే మొదటి బీచ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసా..