Ruchira Kamboj: ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్.. త్వరలోనే బాధ్యతలు..
1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన రుచిరా కాంబోజ్ (Ruchira Kamboj) ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు.
Ruchira Kamboj – United Nations: ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్‌ను నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. త్వరలోనే ఆమె బాధ్యతలను చేపట్టనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన రుచిరా కాంబోజ్ (Ruchira Kamboj) ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. భూటాన్‌కు భారత మొదటి మహిళా రాయబారిగా రుచిరా నిలిచారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన టి.ఎస్.తిరుమూర్తి స్థానాన్ని రుచిరా కాంబోజ్ భర్తీ చేయనున్నారు.
రుచితా కాంబోజ్ 1987 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌లో మహిళల్లో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. అంతేకాదు 1987 ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌లో టాపర్. 2002-2005 వరకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్‌గా ఆమె నియామకమయ్యారు. అక్కడ ఐరాస శాంతి పరిరక్షణ, యూఎన్ భద్రతా మండలి సంస్కరణ, మధ్యప్రాచ్య సంక్షోభం తదితర విభాగాల్లో పనిచేశారు. అనంతరం పలు పదవుల్లో సేవలందించిన రుచిరా.. ఇకపై ఐక్యరాజ్య సమితిలో భారత్ గళాన్ని వినిపించనున్నారు.
ఇప్పటివరకు ఈ విధులు నిర్వహించిన తిరుమూర్తి ఐక్యరాజ్యసమితిలో భారత గళాన్ని స్పష్టంగా వినిపించారు. రష్యాపై ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో భారత్ వైఖరిని పలు దేశాలు తప్పుబట్టగా.. ఆయా దేశాలకు ఆయన ధీటుగా బదులిచ్చారు.
జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..