AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RICH vs POOR: సంపన్నులు మరింత పైకి.. పేదలు మాత్రం అధ:పాతాళానికి.. తాజా గణాంకాలివే..!

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశాన్ని రెండునెలల పాటు కుదిపేసి.. తాజాగా తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో వెల్లడైన ఓ నివేదికాంశాలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. కరోనా పాండమిక్ కాలంలోను సంపన్నులు...

RICH vs POOR: సంపన్నులు మరింత పైకి.. పేదలు మాత్రం అధ:పాతాళానికి.. తాజా గణాంకాలివే..!
Rich Purson And Poor Purson
Rajesh Sharma
|

Updated on: May 31, 2021 | 6:49 PM

Share

RICH vs POOR GAP INCREASING IN INDIA: కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశాన్ని రెండునెలల పాటు కుదిపేసి.. తాజాగా తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో వెల్లడైన ఓ నివేదికాంశాలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. కరోనా పాండమిక్ కాలంలోను సంపన్నులు మరింత సంపన్నులయ్యారని ఈ నివేదిక తేల్చింది. గత ఏడాదిన్నరగా దేశాన్ని కరోనా పట్టిపీడిస్తుండగా.. ఇండియన్ బిలియనీర్ల ఆస్తుల విలువ ఏకంగా 35 శాతం పెరిగినట్లు తాజా సర్వే నివేదిక ఒకటి వెల్లడించింది. వీరి ఆస్తి ఏ లెవెల్లో పెరిగిందంటే.. కేవలం పదకొండు మంది భారతీయ అగ్రశ్రేణి బిలియనీర్ల సంపదతో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకాన్ని ఏకంగా పదేళ్ళు కొనసాగించవచ్చని ఈ నివేదిక వెల్లడించింది. భారతీయ సంపన్నుల ఆస్తులు, సంపద విలువను ఆక్స్ ఫామ్ సంస్థ తమ నివేదికలో ప్రకటించింది. దేశంలో పది కోట్ల మంది పేదల సంపద కంటే ఒక్క శాతం అగ్రశ్రేణి సంపన్నుల సంపద ఏకంగా నాలుగు రెట్లుంటుందని నివేదికలో పోల్చారు. ఆర్థిక వృద్ధి నమూనాలు సంపన్నులను మరింత సంపన్నులుగా మారుస్తాన్నాయని చాటిందీ నివేదిక.

కరోనా వైరస్ మొదటి దశ దేశదేశాలను లాక్‌డౌన్‌ బారిన పడవేసినప్పటి నుంచి ప్రధానంగా సంపన్నదేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు 9 లక్షల కోట్ల డాలర్ల మేరకు అదనపు డబ్బును ముద్రించాయి. దీంతో ఆయా ఆర్థిక వ్యవస్థలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ఆర్థికవేత్త, మోర్గాన్‌ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ గ్లోబల్‌ స్ట్రాటజిస్ట్‌ రుచిర్‌ శర్మ ప్రకారం, కరోనా మహమ్మారి సంపన్నుల సంపదను మరింత పెంచే ఉద్దీపన శక్తిగా మారింది. ఆయా ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన ఉద్దీపన ప్యాకేజీల్లో అధిక భాగం ఆర్థిక మార్కెట్లలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి నయా సంపన్నుల నికర సంపదగా మారిపోయాయని రుచిర్‌ ఓ వ్యాసం రాశారు. కరోనా మొదటి వేవ్‌ కాలంలోనే అతి సంపన్నుల మొత్తం సంపద 5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 13 లక్షల కోట్ల డాలర్లకు అమాంతంగా పెరిగిపోయింది. అంటే దేశాలు ఆర్థికవ్యవస్థను సంక్షోభం నుంచి బయటపడేయడానికి మల్లగుల్లాలు పడుతున్న సమయంలోనే మార్కెట్లు ధనరాసులను తరిలించుకుపోయాయన్నమాట.

విచారకరమైన విషయం ఏమిటంటే ప్రజల చేతుల్లోని సంపద పరోక్షంగా కొత్త సంపన్నుల ఖాతాల్లోకి ఈజీగా తరలిపోవడమే. బ్రూక్సింగ్స్‌ సంస్థ చేసిన మదింపు ప్రకారం 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 14.4 కోట్ల మంది దారిద్య్ర రేఖ దిగువకు తోసివేయబడ్డారని తేలింది. ఈ అంకెల ప్రకారం చూస్తే అత్యంత దారిద్య్రంలో కూరుకుపోయిన అత్యధిక జనాభా విషయంలో భారత్‌ ఇప్పుడు నైజీరియానే అధిగమించింది. భారత్‌లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న భారీ జనసంఖ్యకు ఇప్పుడు మరో 8.5 కోట్లమంది జతకావడం గమనార్హం. కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తున్న విధ్వంసం ఫలితంగా దేశ జనాభా దారిద్య్ర రేఖ కిందికి దిగజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచం నుంచి కటిక దారిద్య్రాన్ని నిర్మూలించడానికి కేవలం 100 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు వెచ్చిస్తే సరిపోతుంది. పాండమిక్ పీరియడ్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో ఇది అత్యంత చిన్న భాగం మాత్రమే. సంపన్నుల చేతిలో మరింత సంపద పోగుపడేలా చేయడానికి ఆర్థిక వ్యవస్థలు చేసిన ప్రయత్నంలో దారిద్య్ర నిర్మూలన అనే అంశం గాలికెగిరిపోయింది. దారిద్య్ర నిర్మూలనకు తగినంత డబ్బు కేటాయించడంలో ప్రపంచం వెనుకబడి ఉంటున్న సమయంలోనే ప్రపంచ బిలియనీర్ల వద్ద సంపద మరింతగా ఎలా పోగుపడుతోందన్నది అర్థం కావడం లేదు. ఉద్దీపన ప్యాకేజీల్లో అతి చిన్న భాగాన్ని దారిద్య్ర నిర్మూలన కోసం వెచ్చించి ఉంటే, ఈ ప్రపంచం మరింత నివాస యోగ్యంగా ఉండేది.

కరోనా వైరస్ ఆదాయ అసమానత్వాన్ని కనీవినీ ఎరుగని లెవెల్‌కు తీసుకుపోయింది. అమెరికాలోని బిలియనీర్ల సంపద కరోనా కాలంలో 44.6 శాతానికి పెరిగిపోయిందని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాలసీ స్టడీ వెల్లడించింది. ఇదే కాలంలో అమెరికాలో 8 కోట్లమంది ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికాలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 16 కోట్ల మంది సంపదతో పోలిస్తే 50 మంది అగ్రశ్రేణి సంపన్నుల సంపద అధికంగా ఉందని ఈ స్టడీ చాటిచెప్పింది. ఇక భారత్‌ విషయానికి వస్తే ఆదాయాల మధ్య అసమానత ఏమంత తక్కువగా లేదు. 2013 నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆఫీసు నివేదిక ప్రకారం సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయాన్ని పరిశీలిస్తే, సగటున నెలకు 6,426 రూపాయలు మాత్రమే ఉందని తెలుస్తుంది. కరోనా విరుచుకుపడటానికి రెండేళ్ల ముందు అంటే 2018 ప్రారంభంలో కెనడాలో ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ చేంజ్‌ చారిటబుల్‌ సంస్థ, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియాతో కలిసి వాంకోవర్‌ ప్రాంతంలోని నివాసాలు లేని 50 కుటుంబాలకు 7,500 కెనడియన్‌ డాలర్లను ఇచ్చాయి. ఏడాది తర్వాత ఈ డబ్బు ఎలా ఉపయోగపడింది అనే అంశంపై చారిటీ సంస్థ జరిపిన పరిశీలనలో అద్భుత ఫలితాలు కనిపించాయి. పైగా ఇలా నగదు సరఫరా అనేది ఎంతో ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇచ్చింది.

నిరుపేదలకు డబ్బుతో ఎలా వ్యవహరించాలో తెలీదంటూ సమాజంలో ఉండే సాధారణ అభిప్రాయానికి భిన్నంగా, తమకు అందిన లిమిటెడ్ ఆర్థిక సహాయాన్ని కూడా వారు ఎంతో తెలివిగా ఉపయోగించుకున్నారని ఈ అధ్యయన ఫలితాలు స్పష్టంగా తెలిపాయి. ప్రధానంగా ఆ కాస్త మొత్తాన్ని వారు ఆహారం, దుస్తులు, ఇంటి నిర్వహణ వంటి అవసరాలకు మాత్రమే తెలివిగా ఖర్చుపెట్టారు. తాజా నివేదికల ప్రకారం ప్రాథమిక ఆహారంపై వినియోగం 37 శాతం పెరిగిందని తెలుస్తోంది. అదే సమయంలో నిరుపేదలు డ్రగ్స్, ఆల్కహాల్‌పై పెట్టే ఖర్చును గణనీయంగా తగ్గించుకున్నారు. అంతవరకు నివాస స్థలం లేకుండా గడిపిన వీరు తాము ఉండటానికి ఒక గూడు కోసం ప్రయత్నించి పక్కా ఇళ్లను సంపాదించుకోవడంపై ఆసక్తి చూపారు. ఈ అధ్యయనం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా నిరుపేదలకు కూడు, గుడ్డా, నీడ ఎంతో ప్రాధాన్యతాంశాలుగా ఉంటున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఇలాంటి చిన్న మొత్తాలతో నగదును బదలాయించడం అనేది దారిద్య్రం కోరలనుంచి పేదలను గణనీయంగా బయట పడేస్తుందన్నది తేలింది.

నిరుపేదల జీవితాల్లో వెలుగును తీసుకొచ్చే ఈ విశిష్ట ప్రక్రియను అమలు చేయడానికి బదులుగా… ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను రాయితీలు, బ్యాంక్‌ బకాయిల రద్దు, బెయిలవుట్లు, కార్పొరేట్‌ ప్రోత్సాహకాల పేరిట భారీ స్థాయిలో సంస్థలకు సబ్సిడీలను అందించడం రూపంలో మరింత డబ్బును సంపన్నుల జేబుల్లోకి చేరే తరహా విధానాల కొనసాగింపును మనం చూస్తూ వస్తున్నాం. పేదలకు వారి వాటా వారికిచ్చే విషయం చర్చకు వచ్చినప్పుడల్లా, ఒక విచిత్రమైన వాదనను మన ఆర్థిక పండితులు తీసుకొస్తుంటారు. అదనపు డబ్బును నేరుగా పేదలకు బదలాయిస్తే సమాజంలోని ప్రతిఒక్కరూ ఖర్చుపెట్టడం అలవాటు చేసుకుని మరింత ద్రవ్యోల్బణం పెరగడానికి కారకులవుతారని మేధావులు చెబుతున్న మాట. ఈ వాదనకు అనుగుణంగానే ఆర్థిక వృద్ధి నమూనాలు చాలా తెలివిగా సోసైటీలో ఆదాయాల మధ్య అసమానతకు మరింత తోడ్పడేలా పథకాలను రూపొందిస్తూ వస్తున్నాయి. అంటే బలిసిన వారిని మరింత బలిసేలా ఈ విధానాలు అమలవుతున్నాయి. అదే సమయంలో నిరుపేదలు నిత్యం తమను తాము కాచుకునే దుస్థితి లోకి దిగజారిపోతున్నారు. అంతిమంగా చెప్పాలంటే, అభివృద్ధి అనే భావన ప్రధానంగా పేదలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆదాయపరమైన అసమానతల తొలగింపునకు అదే అసలైన పరిష్కారం.

ALSO READ: ప్రపంచానికి ఆధునిక యుద్ధరీతుల్ని నేర్పిన ఇజ్రాయెల్ తంత్రం.. అధ్యయనం షురూ చేసిన అమెరికా

ALSO READ: కంగారూలను కంగారెత్తిస్తున్న కొత్త సమస్య.. సాయం కోసం భారత్‌వైపు చూస్తున్న ఆస్ట్రేలియా