AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాంతీయ పార్టీల ‘చీలిక’.. కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా? జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలివే!

భారత రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీల చుట్టూనే చర్చ జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్లో తలెత్తుతున్న అసమ్మతి, చీలికలు జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు ఏ మేరకు లాభం చేస్తాయి? బీజేపీకి ఉన్న అవకాశాలేంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రాంతీయ పార్టీల ‘చీలిక’.. కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా? జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలివే!
National Politics
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 3:53 PM

Share

భారత రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీల చుట్టూనే చర్చ జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్లో తలెత్తుతున్న అసమ్మతి, చీలికలు జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు ఏ మేరకు లాభం చేస్తాయి? బీజేపీకి ఉన్న అవకాశాలేంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దేశ రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న ప్రాంతీయ పార్టీల భవిష్యత్తుపై మరోసారి తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. ఎన్సీపీ (NCP), శివసేన, టీఎంసీ(TMC) వంటి పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్లో తలెత్తిన అంతర్గత సంక్షోభం, చీలికలు.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

హస్తానికి మళ్లీ పాత రోజులు వస్తాయా?

గతంలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలే ఆయా రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఓటు బ్యాంకును దెబ్బతీసి ఎదిగాయి. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి ప్రాంతీయ పార్టీలుగా ఆవిర్భవించిన పార్టీలు అనేకం కనిపిస్తాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టాలంటే ప్రాంతీయ పార్టీలు బలహీనపడటం తమకు కలిసొచ్చే అంశమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. గతంలో కేరళలో లెఫ్ట్ పార్టీలు, తెలంగాణలో బీఆర్ఎస్, కర్ణాటకలో జేడీఎస్ బలహీనపడినప్పుడు కాంగ్రెస్ స్పష్టమైన లాభాన్ని పొందింది. ఇదే ఫార్ములాను ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోంది.

“ప్రాంతీయ పార్టీల ప్రజాదరణ తగ్గితే, జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌కు మేలు జరిగే అవకాశం ఉంది. కానీ ఇది పూర్తిగా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.” అని సీనియర్ జర్నలిస్ట్ వినోద్ అగ్నిహోత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బీజేపీ వ్యూహాలకు చెక్ పడుతుందా?

ప్రాంతీయ పార్టీల బలహీనత కేవలం కాంగ్రెస్‌కే లాభం చేకూరుస్తుందని చెప్పలేం. కొన్నిచోట్ల జాతీయ పార్టీల మధ్య ప్రత్యక్ష పోటీ ఏర్పడినప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా బలపడే అవకాశం ఉంది. దీన్ని గుర్తించిన కాంగ్రెస్, అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకోకుండా.. తమ నాయకత్వాన్ని అంగీకరించేలా చేస్తూ, కూటమిలో ‘పెద్దన్న’ పాత్ర పోషించేందుకు వ్యూహరచన చేస్తోంది.

కాంగ్రెస్ స్పందన ఇదే..!

కాంగ్రెస్‌ను వీడి వెళ్లిన పార్టీలు మళ్లీ విలీనం కావాలనుకుంటే స్వాగతిస్తామని పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ప్రకటించడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉంది. “ప్రతి పార్టీ మొదట తనను తాను బలోపేతం చేసుకోవడానికే ప్రయత్నిస్తుంది, కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. కానీ బీజేపీ తరహాలో మిత్రపక్షాలను మోసం చేసే రాజకీయం మేము చేయం, దానికి బీహారే నిదర్శనం.” అని కాంగ్రెస్ ప్రతినిధి రాగిణి నాయక్ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో కూటమిని కొనసాగించే దిశగా అడుగులు వేయడం ద్వారా, ప్రాంతీయ పార్టీలను పూర్తిగా పక్కన పెట్టే ఉద్దేశం లేదని కాంగ్రెస్ సంకేతాలు ఇస్తోంది. ఏది ఏమైనా, ప్రాంతీయ పార్టీల అంతర్గత సంక్షోభాన్ని కాంగ్రెస్ తన పునరుజ్జీవనానికి ఎంతవరకు వాడుకుంటుందనేది రాబోయే ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us