IERCSC 2026: దేశంలోనే తొలిసారిగా SMSISMRలో.. ఇంటర్నేషనల్ ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ కార్డియక్ కాన్ఫెరెన్స్..
కర్నాటకలోని సత్యసాయి గ్రామంలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR)లో అంతర్జాతీయ ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కాన్ఫరెన్స్ (IERCSC 2026) ప్రారంభమైంది. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన గుండె శస్త్రచికిత్స నిపుణులు, వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో రోబోటిక్ గుండె శస్త్రచికిత్సల లైవ్ ప్రదర్శనలు, ఆధునిక వైద్య సాంకేతికతలపై చర్చలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

సత్యసాయి గ్రామ, కర్నాటక: ముద్దేనహళ్లి సత్యసాయి గ్రామంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) లో శనివారం రెండు రోజుల అంతర్జాతీయ ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కాన్ఫరెన్స్ (IERCSC 2026) ప్రారంభమైంది. దేశంలోనే ఓ ఉచిత ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఇలాంటి అరుదైన సదస్సు జరగడం ఇదే తొలిసారి. మణిపాల్ హాస్పిటల్స్, ఎస్‌ఎస్ ఇన్నోవేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో భారత్, గ్రీస్, అమెరికా, చైనా, బ్రెజిల్, యుక్రెయిన్, జర్మనీ, వియత్నాం సహా సహా పలు దేశాలకు చెందిన గుండె శస్త్రచికిత్స నిపుణులు, వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ గుండె శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ హీరెమఠ్ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలోనే రిమోట్ రోబోటిక్ గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన ఉచిత వైద్య కళాశాల కేవలం SMSIMSR మాత్రమే. అంతేకాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వైద్యులు, కార్డియాక్ సర్జన్లకు రోబోటిక్ గుండె శస్త్రచికిత్సలో ఉచిత శిక్షణ అందిస్తున్న ఫ్రీ మెడికల్ కాలేజీ కూడా ఇది మాత్రమే అని హీరెమఠ్ పేర్కొన్నారు.
మినిమల్లీ ఇన్వేసివ్ (చిన్నపాటి గాటుతో శస్త్ర చికిత్స), రోబోటిక్ గుండె శస్త్రచికిత్సలలోని ఆధునిక సాంకేతికత, పరిశోధన, చికిత్సా విధానాలపై అనుభవాల పంచుకోవడం, లైవ్‌లోనే రొబోటిక్ సర్జరీ నిర్వహించడం ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గ్రీస్, కోయంబత్తూరు, ముద్దేనహళ్లిలోని శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రుల నుంచి ఏకకాలంలో లైవ్‌లో గుండె శస్త్రచికిత్సల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తొలి రోజు సదస్సులో భాగంగా కోయంబత్తూరులోని ఓ ఆస్పత్రిలో ఉన్న రోగికి, అలాగే ముద్దెనహళ్లిలోని శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో మరో రోగికి ఢిల్లీ నుంచి డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ లైవ్‌లోనే రోబోని ఢిల్లీ నుంచీ ఆపరేట్ చేస్తూ శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం రోగులు ఆరోగ్యంగానే ఉన్నారు.

Smsimsr Hosts Global Robotic Heart Surgery Conference
సదస్సును ప్రారంభించిన నిర్వాహక కార్యదర్శి డా. సి.ఎస్. హిరేమఠ్ మాట్లాడుతూ.. “ఈ సదస్సు వైద్యులకు ప్రపంచ స్థాయి నిపుణులతో ప్రత్యక్షంగా చర్చించే అవకాశాన్ని కల్పిస్తుంది. కొత్త సాంకేతికతను నేర్చుకోవడమే కాకుండా, దానిని రోగుల చికిత్సలో సురక్షితంగా ఎలా వినియోగించాలనే అనుభవాన్ని కూడా అందిస్తుంది” అని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రభు జి. మాట్లాడుతూ, “కరుణ, అత్యాధునిక వైద్య సాంకేతికత పరస్పరం అనుసంధానమై పనిచేయగలవని ఈ సంస్థ నిరూపించింది. ఇటువంటి కార్యక్రమాలు జిల్లా ఆరోగ్య రంగానికి కొత్త దిశను చూపుతాయి” అని అన్నారు.
ఎస్‌ఎస్ ఇన్నోవేషన్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డా. సుధీర్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “స్వదేశీ రోబోటిక్ సాంకేతికత అత్యాధునిక వైద్య సేవలను మరింత మందికి అందుబాటులోకి తీసుకురాగలదు. ఈ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే సామర్థ్యం భారత్‌కు ఉంది” అని పేర్కొన్నారు.
సద్గురు శ్రీ మధుసూదన సాయి మాట్లాడుతూ, “వైద్య విద్య లక్ష్యం కేవలం నైపుణ్యం కలిగిన వైద్యులను తయారు చేయడం మాత్రమే కాదు; కరుణతో సేవ చేసే వైద్యులను తీర్చిదిద్దడం కూడా. పదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. నేడు ఇదే ప్రదేశం ప్రపంచ స్థాయి వైద్య విద్య, పరిశోధన, గ్రామీణ ఆరోగ్య సేవలకు కేంద్రంగా ఎదిగింది. ప్రపంచంలోనే తొలి ఉచిత ఎంబీబీఎస్ కళాశాల ఇక్కడే పనిచేస్తోంది. మా ఆరోగ్య సేవలు భారత్‌కే పరిమితం కాకుండా నైజీరియా, శ్రీలంక వంటి దేశాలకు కూడా విస్తరించాయి” అని తెలిపారు.
ఆదివారం ఎండోస్కోపిక్, రోబోటిక్ గుండె శస్త్రచికిత్సలకు సంబంధించిన వెట్ ల్యాబ్ (ప్రాయోగిక) శిక్షణా కార్యక్రమాలతో సదస్సు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయి, డా. సి.ఎస్. హిరేమఠ్, డా. సతీశ్ బాబు కె.ఎన్., డా. సందీప్ సర్దార్ తదితరులు పాల్గొన్నారు
