Hyderabad: రెండు నెలల నిరీక్షణకు తెర.. ఫిన్లాండ్‌లో మిస్సైన హైదరాబాద్ యువకుడు మృతి
ఉన్నత చదువుల కోసం కొడుకుని విదేశాలకు పంపిన హైదరాబాద్‌కు చెందిన తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. పై చదువుల కోసమని ఫిన్లాండ్‌లో వెళ్లిన మనిదీప్ అనే హయాత్‌నగర్ చెందిన యువకుడు అదృశ్యమై రెండు నెలల తర్వాత సముద్రంలో శవమై కనిపించాడు. మే 5 నుంచి కనిపించకుండా పోయిన మనిదీప్ కోసం కుటుంబం, పోలీసులు విస్తృతంగా గాలించారు. చివరకు సముద్రంలో మృతదేహం దొరకడంతో ఈ కేసు విషాదకరంగా ముగిసింది.

హైదరాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థి గుజ్జా మనిదీప్ రెడ్డి ఫిన్లాండ్‌లో అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. గత మే 5 నుంచి కనిపించకుండా పోయిన మనిదీప్ మృతదేహం జూలై 9న సముద్రంలో లభ్యమైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. హయత్‌నగర్‌కు చెందిన మనిదీప్ రెడ్డి ఫిన్లాండ్‌లోని LUT యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. అతడు కనిపించకుండా పోవడంతో స్థానిక పోలీసులు, కోస్ట్ గార్డ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో క్రూనువోరెన్‌రాంటా వాటర్‌ఫ్రంట్ ప్రాంతంలో అతని మృతదేహాన్ని గుర్తించారు.
మనిదీప్ మృతికి గల కారణాలపై ఫిన్లాండ్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (NBI) దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి నేరపూరిత కోణం కనిపించడం లేదని అధికారులు ప్రాథమికంగా స్పష్టం చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రస్తుతం మరిన్ని వివరాలను వెల్లడించలేమని తెలిపారు. మనిదీప్ చివరిసారిగా మే 5న తన తల్లితో ఫోన్‌లో మాట్లాడాడు. తాను ఒక బేకరీ వద్ద ఉన్నానని, అక్కడి నుంచి తన వసతి గృహానికి వెళ్తానని చెప్పాడు. అదే సమయంలో కొంత డబ్బు కూడా పంపాలని కోరాడు. ఆ తర్వాత నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
మనిదీప్ ఆచూకీ కోసం అతని స్నేహితులు, రూమ్‌మేట్స్, యూనివర్సిటీ అధికారులను కుటుంబ సభ్యులు పలుమార్లు సంప్రదించినా ఎలాంటి సమాచారం లభించలేదు. దాదాపు 45 రోజుల పాటు కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో ఆయన తల్లిదండ్రులు గుజ్జా మార్నాథ్, ముత్యం రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి అత్యవసర జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే రెండు నెలలకు పైగా కొనసాగిన ఆందోళనకు చివరికి విషాదకర ముగింపు పలికింది. మనిదీప్ మృతదేహం సముద్రంలో లభించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. విదేశాల్లో చదువుతున్న తెలుగు విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చకు ఈ ఘటన దారితీసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
