Rain Alert: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షబీభత్సం.. 74 మంది మృతి, 31 మంది గల్లంతు! రెడ్ అలర్ట్ జారీ..
హిమాచల్ ప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో మెరుపు వరదలు సంభవిస్తున్నాయి. వరదల దాటికి ఎక్కడికక్కడ రహదారులు తెగిపోయాయి. రానున్న 24 గంటల్లో చంబా, కాంగ్డా, మండి, సిమ్లా, సిర్మూర్ జిల్లాలకు భారీ వర్షాలు కురవనున్నాయి..

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షబీభత్సం కొనసాగుతుంది. అక్కడ గడచిన 24 గంటల వ్యవధిలో 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో మెరుపు వరదలు సంభవిస్తున్నాయి. వరదల దాటికి ఎక్కడికక్కడ రహదారులు తెగిపోయాయి. రానున్న 24 గంటల్లో చంబా, కాంగ్డా, మండి, సిమ్లా, సిర్మూర్ జిల్లాలకు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మెరుపు వరదలకు అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. మెరుపు వరదలతో ఇప్పటికే మండి జిల్లాలో విధ్వంసం నెలకొంది. ఒక్క మండి జిల్లాలోనే మృతుల సంఖ్య 75కు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సినీ నటి మండి ఎంపీ కంగన రనౌత్ పర్యటిస్తున్నారు.
కాగా గత రెండు వారాలుగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలలో భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఈశాన్య ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలో పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో రెండు వారల్లో భారీ వర్షాల దాటికి 74 మంది మృతి, 31 మంది గల్లంతయ్యాయి. 115 మందికి గాయాలయ్యాయి.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా ఇప్పటివరకు సమారు 700 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రాణ, ఆస్తి నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. నేడు కాంగ్రా, సిర్మౌర్ మండి జిల్లాల్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతుంది. ఉనా, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, చంబా, సోలన్, సిమ్లా, కులు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్‌లో భారీ వర్షపాతం కారణంగా ట్రాఫిక్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అక్కడ పలు ప్రాంతాల్లో దాదాపు 258 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 269 రోడ్లు మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో SDRF,NDRF సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.